స్పెషల్ స్టోరీ - చిలకలపూడి బంగారం

- April 25, 2018 , by Maagulf
స్పెషల్ స్టోరీ  - చిలకలపూడి బంగారం

చిలకలపూడి గోల్డ్‌' పుట్టి 150 సంవత్సరాలకు పైనే.. చెవి కమ్మలు, నక్లెస్‌, హారాలూ, టెంపుల్‌ జ్యూలరీ... ఒకటేమిటి చెవిదిద్దుల నుంచి వడ్డాణాలు, కాలి పట్టీల వరకూ అన్నిరకాల గిల్ట్‌ నగలు రూపొందుతాయి ఇక్కడ. 'చిలకలపూడి గోల్డ్‌', 'బందరు వన్‌గ్రామ్‌ గోల్డ్‌' అనే పేర్లతో ప్రఖ్యాతి చెందిన ఈ నగలు మచిలీపట్నం సమీపంలోని 'జ్యూయలరీ పార్క్‌'లో తయారవుతాయి. ఈ పార్క్‌లో సుమారుగా రెండు వందల కంపెనీలు ఉంటాయి. అందులో పనిచేసే కార్మికులు వేలల్లోనే... వీరందరి జీవితాలతో ముడిపడున్న 'బంగారం' బతుకు ఇప్పుడెలా ఉందో తెలుసుకోవాలనే ఆసక్తితో 'జీవన' అక్కడికెళ్లింది. వారితో ముచ్చటించింది. 'ఆ బంగారం' వెనుక విశేషాలు మీ కోసం.

ఇక్కడ ఇమిటేషన్‌ జ్యూలరీ తయారుచేస్తారు. అంటే మేలిమి బంగారు ఆభరాణాలు ఎలా ఉంటాయో అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటాయి. ఇలాంటి ఆభరణాలు తయారుచేయడంలో బందరు సమీపంలోని చిలకలపూడి గోల్డ్‌ వర్కర్స్‌ చేయి తిరిగినోళ్లు. కేవలం జ్యూలరీ పార్క్‌లో ఉన్న కంపెనీలే కాదు. బందరు సమీపంలో ఇళ్లల్లోనూ చాలామంది గిల్ట్‌ జ్యూలరీ వర్క్‌ చేస్తుంటారు. ఇక్కడ ఆభరణాల డిజైన్‌ చేయడం దగ్గర నుంచి అచ్చులేయడం, పాలిష్‌ చేయడం, మార్కెటింగ్‌ కూడా ఉంది. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా కొన్ని పనులే చేస్తాయి. రెండుమూడు పెద్ద కంపెనీలు మాత్రం డిజైన్‌ చేయడం దగ్గర నుంచి మార్కెటింగ్‌ వరకూ వ్యాపారమంతా నిర్వహిస్తారు. ఈ కంపెనీల్లో వర్కర్లూ అంతే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. 

ఎన్నో మోడల్స్‌ 
ఆభరణాల తయారీకి కావాల్సిన ముడిసరుకు కొంత మచిలీపట్నంలోనే దొరుకుతుంది. ఇత్తడి కొట్లు, పాత సామాను అమ్మేవాళ్ల దగ్గర నుంచి పనికిరాని రాగి, ఇత్తడి లోహాలను తీసుకుంటారు. వాటిని కరిగించి ముడి పదార్థంగా మారుస్తారు. ఇది కడ్డీల రూపంలో ఉంటుంది. దీనితో ఆభరణాల డిజైనింగ్‌, అచ్చు పోయడం, జిగ్గింగ్‌, పాలిషింగ్‌, మార్కెటింగ్‌ జరుగుతుంది. అయితే ఎక్కువ మోతాదులో గిల్ట్‌ వేయాల్సిన ఆభరణాలు ముంబయి, కోల్‌కత వంటి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతాయి. ఈ వ్యాపారంలో ప్రతీ స్థాయిలో డీలర్లు ఉంటారు. ముంబయి నుంచి డిజైన్‌ చేసిన ఆభరణాలు కొని, మార్కెటింగ్‌ చేసేవాళ్లు ్ల్ల్లగిల్ట్‌పని చేయిస్తారు. దాన్ని ప్యాకింగ్‌ చేసుకుని, షాపులకు అమ్ముతారు. ఇప్పుడు ముంబయి, కోల్‌కత, రాజ్‌కోట్‌, జైపూర్‌ డిజైన్లకు డిమాండ్‌ పెరిగింది. అక్కడ టెక్నాలజీ వాడి కొత్త డిజైన్లు రూపొందిస్తున్నారు. ఆ డిజైన్లలో ఎక్కువ స్టోన్‌ మోడల్స్‌ ఉంటాయి. ఇక్కడివేమో ప్లెయిన్‌గా ఉంటాయి. అంత టెక్నాలజీ వాడే స్థితిలో బందరు కంపెనీలు లేవు. అంతకు ముందు పెద్ద కంపెనీలు చిన్న కుటీర పరిశ్రమలకు పెట్టుబడిపెట్టి, పనిచేయించుకునేవారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వస్తువులు వస్తుండటం వల్ల చిన్న పరిశ్రమలే పెద్ద కంపెనీలకు అడ్వాన్సులిచ్చి పనులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. 

మహిళల శ్రమే చౌక 
ఇక్కడ పనిని బట్టి 550 నుంచి 150 వరకూ రోజువారీ కూలీ, జీతాలుంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా మహిళలు మాత్రమే చేసేపని లేకపోయినా జిగ్గింగ్‌ వర్క్‌ మినహా ఎక్కువపనులు మహిళలే చేస్తుంటారు. దీనికి కారణం ఏంటని యజమానుల్ని అడిగితే మహిళలు పని వేగంగా చేస్తారని చెబుతారు. అయితే నిజానికి మహిళలకు జీతం తక్కువ ఇవ్వొచ్చనే ఉద్దేశం ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాన్నే ఒక యజమాని దగ్గర ప్రస్తావిస్తే, 'మగోళ్లకయితే పదివేలు పైనే జీతమివ్వాలి. లేకపోతే 'పెళ్లాం, బిడ్డల్ని పోషించడం ఎలాగా?' అని అడుగుతారు. అదే ఆడోళ్లయితే రోజుకు 150-200 ఇస్తే సరిపోతుంది' అన్నారు. ఈ కూలి కోసం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకూ పనిచేయాలి. ఈ జీతానికి జ్యూలరీ పార్క్‌లో పనిచేసే మహిళలు 15 వందలకు పైగా ఉన్నారు. 

ఐగోల్డ్‌ కొంపముంచింది 
బందరు పరిసర ప్రాంతాల్లో ఈ గిల్ట్‌ బంగారంపైన ఆధారపడి బతుకుతున్నవారే ఎక్కువ. పనిలో పోటీ పెరిగిపోవడంతో ఒకరు పది రూపాయలకు చేస్తామంటే ఇంకొకరు ఐదుకే చేస్తామని వస్తున్నారు. దీనితో పాటు కూలీలు దొరక్క సమస్య. జిఎస్‌టి వచ్చినప్పటి నుంచి ఆ వచ్చే లాభంలోనే కట్టుకోవాల్సి వస్తుంది. పనికిరాని మెటల్‌ కొనుక్కోడానికే మూడు శాతం జిఎస్‌టి కడుతున్నారు ఇక్కడి వ్యాపారస్థులు. ఒక నగ తయారవడానికి చాలామంది పనిచేయాలి. చెవిదిద్దులో బుట్ట, పైపు, పూసలు, సీల వంటివి ఎన్ని భాగాలుంటాయో వాటిలో ఒక్కొక్కటీ ఒక్కొక్కరి దగ్గర తయారవుతుంది. అంతకుముందు గిల్ట్‌పనిలో క్వాలిటీ ఉండేది. రాగి, బంగారం కలిసి ఉండటం వల్ల కనీసం ఆరు నెలలు మన్నిక కనిపించేది. ఇప్పుడు ఇత్తడి వాడుతున్నారు. దీనికి ఫోలిక్‌యాసిడ్‌ కలిపి బంగారంరంగు అద్దుతారు. దీనిని ఐగోల్డ్‌ అంటారు. ఇది మూడు నెలలకు మించి వాడితే.. కొందరికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా రావొచ్చు. అంతకుముందు స్వచ్చమైన రాగిపైన పల్చని బంగారం రేకు తొడిగి, దానిపైన వెండితీగను చుట్టేవారు. దీన్ని వేడి చేసినప్పుడు వెండి కరిగి, బంగారం బయటపడుతుంది. ఈ పద్ధతిలో చేసిన ఒన్‌గ్రామ్‌ గోల్డ్‌ నాలుగేళ్లు ఉండేది. ప్రస్తుతం ఈ పద్ధతిని ఆచరించేవారే లేరు. ఇప్పుడు లెక్కలేనన్ని డిజైన్లూ, మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇదివరకు 20 రూపాయలు అమ్మిన నగ ఇప్పుడూ అదే రేటు పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐగోల్డ్‌ నగల వల్ల గిల్ట్‌ నగల రేటు తగ్గింది, మార్కెటింగ్‌ పెరిగింది. కానీ.. క్వాలిటీ పూర్తిగా పడిపోయింది. వీటితో పాటు కూలి రేటు ఎక్కువవడం వల్ల వ్యాపారంలో లాభాలు తగ్గిపోయాయి. 

సంబంధాలే రావట్లేదు 
ఈ ఇమిటేషన్‌ ఆభరణాలు ఒకప్పుడు మచిలీపట్నంలో మాత్రమే చేసేవారు. వాటిపైన ఆధారపడి పనిచేసుకుంటున్న కుటుంబాలన్నింటినీ కలిపితే సుమారుగా 60 వేల కుటుంబాలున్నాయి. అంటే గిల్ట్‌ గోల్డ్‌పని చేస్తున్నవారు సుమారు లక్షపైనే ఉన్నారు. చిలకలపూడి, పోలారం, పెడన, తాళ్లపాలెం వంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల్లో కూలీలొచ్చి పనిచేస్తుంటారు. వారిలో మహిళలే ఎక్కువమంది. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ ఈ పనులు చేసేవారు పెరిగిపోవడంతో మచిలీపట్నంలో వ్యాపారం తగ్గింది. ఇది ఎంత ప్రభావం చూపిందంటే ఒకప్పుడు ఈ బంగారం పని చేస్తున్నవాళ్లంటే గొప్పగా చూసేవాళ్లు, ఇప్పుడు పిల్లలకి పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు.

మరుగున పడింది
నేను 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇదివరకు బంగారం రేటు తక్కువ కాబట్టి ఒన్‌గ్రామ్‌ గోల్డ్‌ వాడారు. ఇప్పుడది వేలల్లో ఉంది. ఒన్‌గ్రామ్‌ గోల్డ్‌ మరుగున పడింది. ఇదివరకు రూపాయి పెడితే పదిహేను రూపాయలొచ్చేవి. ఇప్పుడు ఇరవై పెడితే నాలుగు రూపాయలు మిగులుతున్నారు.

- హరిబాబు 

మేమూ తీసేస్తున్నాం! 
ఇప్పుడు ఇత్తడి, రాగితోనే పని. అల్యుమినియంలా ఉండే మొజాయిక్‌ వచ్చిన తర్వాత అవీ లేవు. అంతకుముందు దేశారుపేటలో 50 వరకూ కుటీర పరిశ్రమలు ఉండేవి. ఇప్పుడంతా మానేసి వేరే కూలి పనులు చేసుకుంటున్నారు. మేమూ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం. 
- సీతారామయ్య 

ఎంతో కొంత ఆసరా! 
ఇక్కడ పనిచేసే మహిళలు వందల్లో ఉంటారు. రకరకాలు పనులు చేస్తారు. మేము చుట్టింపులు చేస్తాము. మా జీతాలతో కుటుంబం గడవదు. కానీ.. ఎంతో కొంత ఆసరా ఉంటదని ఇక్కడ పనిచేస్తున్నాం. 
- కుమారి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com