నాడు లండన్ 'ఆక్స్‌ఫర్డ్' యూనివర్శిటీలో ఫ్రొఫెసర్.. నేడు ఢిల్లీ వీధుల్లో..

నాడు లండన్ 'ఆక్స్‌ఫర్డ్' యూనివర్శిటీలో ఫ్రొఫెసర్.. నేడు ఢిల్లీ వీధుల్లో..

ఉన్నత చదువులు చదివిన కొడుకులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కానీ.. ఉన్న ఊరిని కన్న తండ్రిని మరచి పోయారు. పర్యవసానం ఆ తండ్రి ఉండడానికి కూడా గూడు లేక ఢిల్లీ రైల్వే స్టేషన్లో తలదాచుకుంటున్నాడు. పోనీ ఆయన ఏమైనా మామూలు వ్యక్తా అంటే అదీ కాదు. లండన్ ఆక్స్‌ఫర్డ్ యూనిర్శిటీలో ప్రొఫెసర్‌గా వందల మంది విద్యార్థులకు విద్యనందించారు. 74 ఏళ్ల వయసున్న  రాజా సింగ్ పూల్ 1960కి ముందు ఆక్స్‌ఫర్డ్ లో ప్రొఫెసర్‌గా పని చేస్తుండేవారు. తమ్ముడితో కలిసి వ్యాపారం చేయదలచి యూనివర్శిటీలోని ఉద్యోగాన్ని వదిలి ఇండియా వచ్చారు. ముంబైలో మొటార్ వెహికల్స్ విడిభాగాల వ్యాపారం మొదలు పెట్టాడు. కొంతకాలానికి అనారోగ్యంతో తమ్ముడు మరణించడంతో పాటు వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగుతుండేది. తన ఇద్దరు కొడుకుల్ని ఉన్నత చదువులు చదివించే నిమిత్తంగా ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మాల్సి వచ్చింది. సరిగా సాగని వ్యాపారాన్ని వదలి ఉద్యోగం చేస్తూ కొడుకుల్ని బాగా చదివించాడు రాజా సింగ్. ఉన్నత చదువులు చదివిన కుమారుల్లో ఒకరిని లండన్, మరొకరిని అమెరికా పంపించారు. 

ఆ సమయంలోని భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. తోడుగా ఉంటాడనుకున్న తమ్ముడు కూడా లేకపోవడంతో ఒంటరిగానే జీవనం సాగిస్తూ వస్తున్నాడు.  ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లిన కొడుకులు తిరిగి ఇండియా రాలేదు. అక్కడే స్థిరపడి వారికి నచ్చిన వారిని పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అప్పుడప్పుడు తండ్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. కాలం గడచిన కొద్దీ ఫోన్ చేయడం కూడా మానేశారు. వారి చదువులు, విదేశాలకు వెళ్లడానికి కావలసిన డబ్బు కోసం చేసిన అప్పులు మాత్రం అతడి వెంటే ఉన్నాయి. దీంతో ఉన్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చాడు. యూనివర్శిటీలో విద్యను బోధించిన పరిజ్ఞానంతో ఢిల్లీలోని యూకే కాన్సులేట్ సెంటర్ దగ్గర అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. వీసా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారికి సాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాయం చేసినందుకు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటాడు కానీ తను మాత్రం నోరు తెరిచి అడగరు. అది కూడా తను తినడానికి కావలసినంత మాత్రమే తీసుకుని మిగిలినది ఇచ్చేస్తుంటాడు. సాయింత్రం అవగానే దగ్గరలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడే తలదాచుకుంటాడు. ఈ క్రమంలో యూకే వీసా కోసం రాజా సింగ్ సాయం తీసుకుంటున్న అవినాష్‌కు అనుమానం వచ్చింది. ఇంతబాగా ఇంగ్లీషు మాట్లాడడం, వీసా దరఖాస్తు విషయాలు చెప్పడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. రాజా సింగ్‌ని పదే పదే ప్రశ్నించి అసలు విషయం రాబట్టాడు. అతడు చెప్పిన వివరాలకు చలించిపోయిన అవినాష్ ఆయన ఫొటోలు, ఇతర వివరాలతో ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో అది వైరల్ కావడంతో ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలిసింది. వారు వెంటనే స్పందించి రాజా సింగ్‌ని ఢిల్లీలోని ఓల్డేజ్ హోంకి తరలించారు. పేస్‌బుక్‌లో పోస్ట్ చూసిన పూర్వ విద్యార్థులు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. 

Back to Top