బ్రేకింగ్: ఘోర ప్రమాదం...ట్రైన్ ఢీకొట్టడంతో 13 మంది పిల్లలు మృతి

బ్రేకింగ్: ఘోర ప్రమాదం...ట్రైన్ ఢీకొట్టడంతో 13 మంది పిల్లలు మృతి

యూపీలోని ఖుషీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ వ్యాన్‌ పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొట్టడంతో 13 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం ఆరున్నరకి పిల్లల్ని స్కూల్‌కి పంపి ఇలా రిలాక్స్ అయ్యారో లేదో, కాసేపటికే ప్రమాదం వార్త తెలిసి పేరెంట్స్‌ షాక్‌కి గురయ్యారు. తల్లిదండ్రుల రోదనలతో అక్కడంతా హృదయవిదారకంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది.

ఈ యాక్సిడెంట్‌లో చనిపోయిన వారంతా 10 ఏళ్లలోపు పిల్లలే. గాయపడ్డ మిగతా వారికి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించారు. స్కూల్‌కి పిల్లల్ని తీసుకెళ్తున్న బస్ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి. ఐతే, రైల్వే క్రాసింగ్ వద్ద అతను ట్రైన్‌ను గుర్తించని కారణంగానే  ఈ విషాదం చోటుచేసుకుంది. స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. దాదాపు అరకిలోమీటర్‌ దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ యాక్సిడెంట్ పట్ల యూపీ సీఎం ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

ఖుషీనగర్‌ దగ్గర్లో ఉన్న ఈ రైల్వే క్రాసింగ్ వద్ద ఓ కాపలాదారుతోపాటు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఐతే, ఇవాళ అతను విధులకు హాజరుకాకపోవడంతో ట్రైన్ వస్తున్నట్టు సమాచారం ఇచ్చే వారెవరూ అక్కడ  అందుబాటులో లేరు. ఇదే ప్రమాదానికి కారణమైంది. ఐతే, ట్రాక్ దగ్గరకు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన డ్రైవర్, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పెను విషాదం చోటుచేసుకుంది. 

గోరఖ్‌పూర్‌కి 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటన, రైల్వే క్రాసింగ్‌ల వద్ద సెక్యూరిటీ ఉంచాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. దశల వారీగా రైల్వే క్రాసింగ్స్ ఆధునీకరిస్తున్నామని కేంద్రం చెప్తున్నా ఇలాంటి ఘటనలు జరగడం విమర్శలకు తావిస్తోంది. రెండు వారాల క్రితం హిమాచల్‌ప్రదేశ్‌లో లోయలో బస్సు పడిపోయిన ఘటనలో 27 మంది పిల్లలు చనిపోయిన విషాదం మర్చిపోకముందే.. ఇప్పుడు రైల్వే క్రాసింగ్ రూపంలో మరో 13 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఇలా ప్రమాదాల్లో మరణించడం విషాదాన్ని నింపింది.

Back to Top