చంద్రబాబు ఆశలపై నీళ్చు చల్లిన మహేష్

- April 27, 2018 , by Maagulf
చంద్రబాబు ఆశలపై నీళ్చు చల్లిన మహేష్

టాలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆశలపై నీళ్లు చల్లాడు. టీడీపీ పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేశాడనే చెప్పాలి. ఇంతకీ మహేష్ బాబు ఏమన్నాడంటే.. తనకు వందేళ్లు వచ్చేవరకు సినిమాల్లోనే చేస్తానని, రాజకీయాల్లోకి మాత్రం రానని తేల్చి చెప్పాడు. ఆ విధంగా పొలిటికల్ ఎంట్రీపై మహేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

కాగా టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు మహేష్ బాబు బావ అవుతాడు. ఈ క్రమంలో మహేష్ బాబు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. మహేష్ కు ఎంపీ టికెట్ ఇస్తారనే వార్తలూ వినిపించాయి. అయితే ఆ ప్రచారాలకు తెరదించుతూ మహేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశాడు. తానసలు రాజకీయాల్లోకి రానని చెప్పేశాడు.

కొరటాల శివ, మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'భరత్‌ అనే నేను' సినిమాకి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిమానులతో కలసి సినిమాను వీక్షించేందుకు మహేష్, కొరటాల శివ ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లారు. విజయవాడలో ముందు కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆ తరువాత అభిమానులతో కలిసి సినిమా చూసి మాట్లాడారు. విజయవాడ రావడం ఆనందంగా ఉందని మహేశ్‌ బాబు అన్నాడు. తాను విజయవాడ రావడం సెంటిమెంట్‌ గా భావిస్తానని, గతంలో ఒక్కడు, పోకిరీ, దూకుడు వంటి విజయోత్సవ సభలను కూడా విజయవాడలోనే నిర్వహించామని గుర్తు చేశాడు. తన తాజా చిత్రం భరత్‌ అనే నేను చిత్రానికి ఘన విజయం అందించిన అభిమానులను థ్యాంక్స్‌ చెబుతున్నట్లు పేర్కొన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com