ఇజ్రాయిల్ చర్యలు..న్యూయార్క్, టర్కీ నగరాల్లో భారీ ర్యాలీలు

- May 15, 2018 , by Maagulf
ఇజ్రాయిల్ చర్యలు..న్యూయార్క్, టర్కీ నగరాల్లో భారీ ర్యాలీలు

న్యూయార్క్‌: ఇజ్రాయిల్‌ బలగాలు పాలస్తీనీయులపై విరుచుపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యప్రాఛ్య దేశాల్లో రాజేసిన చిచ్చు దావానలంలా వ్యాపిస్తోంది. టెల్‌అవీవ్‌ నగరంలోని యూఎస్‌ ఎంబసీని జెరూసలేమ్‌కు తరలించాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి గాజా సరిహద్దు అట్టుడుకుతోంది. సోమవారం జెరూసలేమ్‌లో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభమైంది. యూఎస్‌ ఎంబసీని జెరూసలేమ్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గాజా సరిహద్దుకు చేరుకున్న నిరసనకారులపై ఇజ్రాయిల్‌ సైన్యం దాష్టీకం ప్రదర్శించింది. గాజా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన పాలస్తీనీయులపై బాష్పవాయుగోళాలు, రబ్బరు బుల్లెట్లు ఎక్కుపెట్టింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. గాజా సరిహద్దు నుంచి పాలస్తీనీయులను తరిమివేశారు. ఇజ్రాయిల్‌ సైన్యం చర్యలకు 58మంది బలైపోయారు. 2,870 మంది స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ బలగాలు దమనకాండ ప్రదర్శించడాన్ని పాశ్చాత్య దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయిల్‌ మారణహోమం సృష్టించి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ విమర్శిస్తున్నాయి. ఇజ్రాయిల్‌ చర్యలపై న్యూయార్క్‌ నగరంలో నిరసనలు వెల్లువెత్తాయి. బ్రూక్లిన్‌ ప్రాంతంలో నిరసనకారులు భారీ ర్యాలీ తీశారు. ప్లకార్డులు, బ్యానర్లు, పాలస్తీనా పతాకాన్ని చేబూని నినదించారు.

పాలస్తీనీయులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అరబ్‌దేశాల నేతలు ఇజ్రాయిల్‌ చర్యలపై స్పందించాలని కోరారు. రక్షణ చర్యల్లో భాగంగానే ఇజ్రాయిల్‌ బలగాలు బాష్పవాయుగోళాలు ప్రయోగించాయని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ వ్యాఖ్యానించడాన్ని ఆందోళనకారులు విమర్శించారు. 

ఇజ్రాయిల్‌ ఉగ్రసంస్థలకు స్వర్గధామంగా మారిందని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ విమర్శించారు. గాజా సరిహద్దులో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ బలగాలు రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయుగోళాలు ప్రయోగించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇజ్రాయిల్‌ చర్యలను ఐరాస సభ్యదేశాలు ఖండించాలని కోరారు. ఇజ్రాయిల్‌ బలగాలను పాలస్తీనీయులపై ఉసిగొల్పిందని అమెరికానే అని విమర్శించారు. బ్రిటన్‌ పర్యటనలో ఉన్న ఎర్డోగన్‌ పై వ్యాఖ్యలు చేశారు. టర్కీలో మూడు రోజులపాటు సంతాపదినాలు పాటించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇజ్రాయిల్‌ అమానవీయ చర్యలను ప్రతీ ఒక్కదేశం ఖండించాలని పిలుపునిచ్చారు. 

టర్కీలో భారీ ర్యాలీ : 
గాజా సరిహద్దులో రక్తపాతం సృష్టించిన ఇజ్రాయిల్‌ చర్యలను వ్యతిరేకిస్తూ టర్కీలో నిరసనలు వెల్లువెత్తాయి. వేలాది మంది అంకారా వీధుల్లోకి చేరుకొని నిరసన తెలిపారు. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయిల్‌కు అండగా నిలుస్తూ అమెరికా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ' అమెరికా డౌన్‌..డౌన్‌....ఇజ్రాయిల్‌ డౌన్‌...డౌన్‌...ఇజ్రాయిల్‌ ఉగ్రవాద దేశం' అంటూ ప్లకార్డులు చేబూని భారీ ర్యాలీ తీశారు.

ఐరాస భద్రతామండలి అత్యవసర సమావేశం : 
గాజా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, పాలస్తీనీయులపై ఇజ్రాయిల్‌ బలగాల దాష్టీకంపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సభ్యులు అత్యవసరంగా సమావేశమయ్యారు. గాజా సరిహద్దు దాటి వచ్చేందుకు పాలస్తీనీయులు ప్రయత్నించడంతోనే తమ బలగాలు బాష్పవాయుగోళాలు, రబ్బరుబుల్లెట్లు ప్రయోగించాల్సి వచ్చిందని ఐరాసలో ఇజ్రాయిల్‌ రాయబారి డేనీ డానన్‌ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణకు ఐరాస భద్రతా మండలి ఆదేశించింది. ఇజ్రాయిల్‌ చర్యలు అమానవీయమని ఐరాస ప్రతినిధి జేద్‌ రాదల్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు.

- 'మధ్య ప్రాఛ్యంలోని పలు దేశాలకు అమెరికా ఏకపక్షంగా మద్దతిస్తోంది. అమెరికా చర్యలను ఖండిస్తున్నా' - ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయేల్‌ మాక్రన్‌ 
- 'గాజా మృతులపై విచారణ చేపట్టాలి. ఇజ్రాయిల్‌ అమానవీయ చర్యలను ఖండిస్తున్నాం' - బ్రిటన్‌, జర్మనీ, టర్కీ, కువైట్‌, దక్షిణాఫ్రికా, ఈజిప్టు అమానవీయం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com