అన్నదాత సుఖీభవ ఆడియో విడుదల

- May 16, 2018 , by Maagulf
అన్నదాత సుఖీభవ ఆడియో విడుదల

శతాబ్దాలు గడిచినా రైతుల పరిస్థితుల్లో మార్పు లేకపోవడాన్ని అన్నదాతా సుఖీభవ చిత్రంలో చూపిస్తున్నామని నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి పేర్కొన్నారు. స్నేహ చిత్ర పిక్చర్స్‌ పతాకంపై ఆయన రూపొందించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ, ఐదు వందల ఏళ్ల క్రితం శిస్తు కట్టలేదని కవి శ్రీనాథుడితో రాళ్లు మోయించి, కొరడాలతో కొట్టించారు. అప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందో నేటికీ అలానే ఉంది. యు.పి.ఎ., ఎన్‌.డి.ఎ. ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలను కన్నబిడ్డల్లాగా.రైతులను సవతి బిడ్డల్లా చూస్తున్నారు. వేల కోట్లు రుణాలను ఎగ్గొడుతున్న పారిశ్రామిక వేత్తలను ఏమీ అనడం లేదు. వారికి రుణాలు మాఫీ చేస్తున్నారు. కానీ రైతులను మాత్రం రుణాలు కట్టమని వేధిస్తున్నారు.

రైతులకు కూడా రుణమాఫీలు చేయాలి. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి. గిట్టుబాటు ధరను కల్పించాలి వంటి అంశాలను ఇందులో ఆవిష్కరించాం. పంట పెట్టుబడి కోసం ఎక్కడా అప్పులు చేయకుండా ముందుగానే ఎకరాకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

దేశంలో ఏ సీఎం ప్రవేశపెట్టని రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్‌గారు ప్రవేశపెట్టారు అని అన్నారు. యలమంచిలి శివాజీ మాట్లాడుతూ, రైతుల బాగుకోసం కేసీఆర్‌గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పథకమిది. చరిత్ర సృష్టించిన రైతులపై సినిమాలు తీసిన నారాయణమూర్తిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని అన్నారు.

గీత రచయిత అశోక్‌తేజ మాట్లాడుతూ, మాకు నారాయణమూర్తి అన్నతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సమస్య ఉంటే ముందు ఆయనతోనే మనసు విప్పి చెప్పుకుంటాం అని అన్నారు. ఇంకో గీత రచయిత గోరెటి వెంకన్న మాట్లాడుతూ, రైతుల సమస్యలను కూడా కమర్షియల్‌ పంథాలో రూపొందించిన చిత్రమిదని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com