ఏ.పి:గోదారిలో 22 మంది జలసమాధి..

- May 16, 2018 , by Maagulf
ఏ.పి:గోదారిలో 22 మంది జలసమాధి..

గోదారి 22 మందిని మింగేసింది. లాంచీ యజమాని నిర్లక్ష్యం.. 22 మంది పేద ప్రాణాలను బలితీసుకొంది. అతిగా సంపాదించుకోవాలన్న అత్యాశ.. నిండు ప్రాణాలను నీళ్ల పాలు చేసింది. అధికారులు హుటాహుటీన స్పందించినా.. ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసినా.. అప్పటికే.. అమాయకుల ప్రాణాలు గోదారికి బలైపోయాయి. ఇప్పటి వరకూ 15 మంది మృతదేహాలను వెలికి తీయగా. .మిగిలిన వారి కోసం రేపు గాలింపు చేపట్టనున్నారు.

గోదావరిలో లాంచీ ప్రమాదంలో 22 మంది దుర్మరణం చెందారు. ఉదయం నుంచి సాగిన రెస్క్యూ ఆపరేషన్.. మధ్యాహ్నానికి ముగిసింది. గోదావరిలో 60 అడుగుల లోతులో మునిగిపోయిన లాంచీని.. భారీ క్రేన్‌ సహాయంతో పైకి లాగారు. తాళ్లు కట్టి.. పోలీసులు, స్థానికులు కలిసి ఒడ్డుకు లాగారు. లాంచీని బయటకు లాగే సమయంలో నాలుగు మృతేదేహాలు బయటపడ్డాయి. మిగిలిన మృతదేహాలను.. ఒడ్డుకు వచ్చిన తర్వాత లాంచీలో నుంచి వెలికి తీశారు.

దేవీపట్నం నుంచి ప్రయాణీకులతో బయల్దేరిన లాంచీ.. వాడపల్లికి సమీపంలో బోల్తా పడింది. ఆ సమయంలో సిమెంట్‌ సంచులతో పాటు.. ప్రయాణీకులూ లాంచీలో ఉన్నారు. విపరీతమైన ఈదురు గాలులు, వర్షం రావడంతో.. ప్రయాణీకులను కింద గదుల్లో కూర్చోబెట్టి.. సిమెంట్ బస్తాలు తడవకుండా తలుపులు వేసేశారు. గాలుల తీవ్రతకు లాంచీ బోల్తాపడడంతో.. పైన ఉన్నవాళ్లు మాత్రమే ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. లోపల కూర్చున్న 22 మంది మాత్రం.. జలసమాధి అయిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులుండగా.. వీరిలో ఇద్దరు కవల పిల్లలు. వారి తల్లిదండ్రులు కూడా ఈ ప్రమాదంలోనే మృతి చెందారు. వీరి పెద్ద కొడుకు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అనాథగా మారిన అతడిని చూసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు.. ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తక్షణ సాయంగా లక్ష అందించనున్నారు. లాంచీకి అనుమతులు ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంలో నడిపినందువల్లే ప్రమాదం జరిగిందన్నారు చంద్రబాబు. బాధిత కుటుంబాలకు ఇంటితో పాటు, చదువుకున్న వారుంటే ఉద్యోగం ఇస్తామన్నారాయన. బోటుకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ.. ప్రతికూల వాతావరణంలో నదిలో తిప్పిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బోటు యజమానిపై కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com