‘కాశి’ మూవీ రివ్యూ

- May 18, 2018 , by Maagulf
‘కాశి’ మూవీ రివ్యూ

టైటిల్ : కాశి
జానర్ : ఎమోషనల్‌ డ్రామా
తారాగణం : విజయ్‌ ఆంటోని, అంజలి, సునైనా, యోగి బాబు, జయప్రకాష్‌ 
సంగీతం : విజయ్‌ ఆంటోని
దర్శకత్వం : కృతిగ ఉదయనిధి
నిర్మాత : ఫాతిమా విజయ్‌ ఆంటోని

సలీం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన విజయ్‌ ఆంటోని, తరువాత బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్‌లోనూ ఘనవిజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో తెలుగులోనూ మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్న విజయ్‌, తరువాత తను హీరోగా నటించిన ప్రతీ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కానీ బిచ్చగాడు స్థాయిలో విజయం మాత్రం సాధించలేకపోయాడు. అందుకే మరోసారి మదర్ సెంటిమెంట్‌ను నమ్ముకొని కాశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

కథ :
భరత్‌ (విజయ్‌ ఆంటోని) న్యూయార్క్‌లో డాక్టర్‌. సొంత హాస్పిటల్‌, హోదా, మంచి కుటుంబం అన్నీ ఉన్నా భరత్‌ను ఏదో పొగొట్టుకున్నా అన్న భావన వెంటాడుతుంటుంది. ఓ చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా ఓ కల చిన్నతనం నుంచి వస్తుంటుంది. (సాక్షి రివ్యూస్‌) తన తల్లి కిడ్నీలు ఫెయిల్‌ అవ్వటంతో భరత్‌ జీవితం మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్లు తను అమ్మానాన్నలు అనుకుంటున్న వారు తనను పెంచిన తల్లిదండ్రులు మాత్రమే అని తెలుస్తుంది. 

దీంతో తనకు రోజు వచ్చే కలకు తన గతానికి ఏదో సంబంధం ఉందన్న నమ్మకంతో తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు భరత్‌. అనాథశ్రమంలో తన తల్లిపేరు పార‍్వతి అని, ఆమె సొంత ఊరు కంచెర్లపాలెం అని తెలుసుకొని ఆ ఊరికి వెళతాడు. ఈ ప్రయత్నంలో భరత్ విజయం సాధించాడా..? తన తల్లిదండ్రులను కనుక్కోగలిగాడా..? అసలు భరత్‌ వారికి ఎలా దూరమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
విజయ్‌ ఆంటోని, అంతా తానే అయి సినిమాను నడిపించాడు. నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే బలమైన భావోద‍్వేగాలు చూపించే అవకాశం రాకపోవటంతో నాలుగు పాత్రలు కూడా రొటీన్‌గా సాగిపోతాయి. హీరో ఫ్రెండ్‌ పాత్రలో నటించిన యోగిబాబు అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు.హీరోయిన్‌ గా నటించిన అంజలిది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో నటించిన జయప్రకాష్‌ తప్ప ఇతర నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే.

విశ్లేషణ :
బిచ్చగాడు సినిమాలో మదర్‌ సెంటిమెంట్‌తో సక్సెస్‌ సాధించిన విజయ్‌ ఆంటోని మరోసారి అదే సెంటిమెంట్‌ను నమ్ముకొని కాశి సినిమా చేశాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమైన కొడుకు తన గతాన్ని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే కాశి కథ. అయితే ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో దర్శకురాలు కృతిగ ఉదయనిధి పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. అసలు కథను పక్కన పెట్టి కథతో సంబంధం లేని పిట్టకథలతో సినిమాను నడిపించారు.పూర్తిగా తమిళ నటులు, తమిళ నేటివిటీతో తెరకెక్కటం కూడా తెలుగు ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. గత చిత్రాల్లో సూపర్‌ హిట్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్న విజయ్‌ ఆంటోని ఈ సారి పాటలతోనూ మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
స్క్రీన్‌ప్లే
తమిళ నేటివిటి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com