ఇంట్లో నుంచే పని చేస్తూ.. డబ్బులు సంపాదించడం ఎలా??

- May 19, 2018 , by Maagulf

ఒకప్పుడు వ్యాపారం నిర్వహించడం అంటే నైపుణ్యం కీలకంగా ఉండేది. కానీ ఇప్పుడు అన్నిటి కంటే ఎక్కువగా టెక్నాలజీకి ప్రాముఖ్యత దక్కుతోంది. తమ మనసులో ఉన్న ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చి వ్యాపార సామ్రాజ్యాలనే సృష్టించేసుకుంటున్నారు. విజయవంతంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగిన అమెజాన్.కాం.. ఒకప్పుడు ఓ బుక్‌స్టోర్ రూపంలో ఒక గ్యారేజ్‌లో మొదలైన కంపెనీ అంటే ఆశ్చర్యం వేయక మానదు. 

ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం మొత్తం అనుసందానం కావడంతో.. కొనుగోళ్లు, అమ్మకం, సేవలు అందించడం గురించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం తేలిక అయిపోయింది. పెట్టుబడి తక్కువ ఉన్నా పర్వాలేదు. కొన్ని స్టార్టప్ ఐడియాల ఖర్చు రూ. 10 వేల కంటే తక్కువగా ఉంటోందంటే ఆశ్చర్యపోకండి. మీకు తగినంత ఉత్సాహం.. ప్లానింగ్ ఉంటే చాలు.. ఎలాంటి వ్యాపారం అయినా చేసేసేందుకు అవకాశాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గరి నుంచే చేసేందుకు అనువైన కొన్ని వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 చేతితో తయారు చేసే బహుమతులు, స్టేషనరీ

మీలో కళాత్మకత ఉంటే మీరు ఆఫ్‌లైన్ ద్వారానే కాదు, ఆన్‌లైన్ ద్వారా మీ ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా డబ్బు సంపాదించవచ్చు. ఇంట్లో తయారు చేసిన సబ్బులు, కొవ్వొత్తుల నుంచి పెన్సిల్స్, నోట్‌బుక్స్ వరకూ అనేకం విక్రయించవచ్చు. ఇంకా అనేక  ప్రొడక్టులను మీరు ఎంచుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద పెద్ద సైట్లలో అమ్మకానికి పెట్టవచ్చు. చిన్నగా వ్యాపారం నిర్వహించాలని అనుకుంటే ఇండియామార్ట్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటివాటిలో కూడా కొనసాగించవచ్చు. 


ఆఫ్‌లైన్‌లో అయితే స్థాయిక ఫ్లీ మార్కెట్లలోను, పండుగ మార్కెట్లలోను అమ్మకాలు చేపట్టవచ్చు.  చిన్నపాటి వస్తువులు, యాక్సెసరీస్, జ్యూవెలరీ, గ్రీటింగ్ కార్డ్స్, క్యాండిల్స్, న్యూస్‌పేపర్ బాక్స్‌లు, బుట్టలు, ల్యాంప్ షేడ్స్.. ఇలా మీరు అమ్మాలే గానీ.. కొనేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు.


 అల్పాహార సేవలు

పట్టణాల్లో ఉండే వారిలో చాలామంది తమ సొంత ఊళ్లకు దూరంగా ఉంటారు. అందుకే ఇంటి భోజనానికి దూరమైపోతారు. ఇలాంటివారికి రుచికరమైన భోజనం అందుబాటు ధరలో అందిస్తే విపరీతంగా ఆదరిస్తుంటారు. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వర్కింగ్‌ పీపుల్‌ను తెలుసుకుని, వారికి మంచి భోజనం అందించడం ద్వారా మార్కెట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓ 5గురు వ్యక్తులతో కూడా ఈ వ్యాపారం ప్రారంభించేయవచ్చు. మీకు ఇంటికే సరుకులు అందుతుండడంతో ఇప్పుడు కేవలం వంటకు మాత్రం సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఇంటి భోజనం  అంటూ ప్యాక్ చేసి పంపితే.. వారు మెచ్చితే, ఇక మీ వ్యాపారానికి తిరుగు లేనట్లే.

 ట్యూషన్స్, ప్రోగ్రామింగ్ క్లాసులు

ఇప్పుడు అనేక కోర్సులు ఆన్‌లైన్‌లో ఉంటున్నా.. వీటిని అందించేందుకు ట్యూటర్స్ అవసరం. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్యూటర్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలు ఏ సబ్జెక్టులో అయితే వెనుకబడి ఉంటారో.. వాటిలో తర్ఫీదు ఇప్పించ్చేందుకు సిద్ధంగా ఉంటున్నారు. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ శిక్షణకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఇద్దరు పిల్లలకు ట్యూషన్ చెప్పడంతో ప్రారంభించినా.. మౌత్ టాక్‌తో మీ వ్యాపారం విస్తృతం అవుతుంది. వాట్సాప్‌ను కూడా ఇందుకు ఉపయోగించుకోవచ్చు.

 ప్రీస్కూల్స్, క్రష్

ప్రీస్కూల్స్‌కు విపరీతంగా ఆదరణ పెరుగుతోంది. ఈ పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను చిన్న వయసులోనే నేర్పించడం అవసరం అయిన విషయం. ఓ కాలనీ లేదా ఏరియా ఎఁచుకుని ఒక ప్లేస్కూల్ ప్రారంభించండి. చట్టపరమైన అనుమతులు తీసుకున్న తర్వాత ప్రాఫిట్ లేదా నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాపారం బాగుంటే ఫ్రాంచైజీలు కూడా ఓపెన్ చేయవచ్చు.

 హాబీ క్లాసులు

పెయింటింగ్, సింగింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, మ్యూజిక్.. ఇలా అనేక హాబీలపై క్లాసులు తీసుకునేందుకు పలువురు సిద్ధంగా ఉన్నారు. నగరాల్లోనే కాదు చిన్నచిన్న పట్టణాల్లో కూడా వీటికి డిమాండ్ ఉంటుంది. మీరు మ్యూజిక్‌లో స్పెషలైజేషన్ చేసి ఉంటే.. తప్పనిసరిగా వాటిని నేర్పించే ప్రయత్నం చేయండి. పియానో.. గిటార్.. డ్రమ్స్.. ఇలా మీకు ఏది వస్తే అధి నేర్పించే ప్రయత్నం చేయండి. మీ ట్యాలెంట్ అనుసరించి.. క్లాసుకు ఇంత అని కూడా వసూలు చేయవచ్చు.

 ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ

మీరు విపరీతంగా ప్రయాణాలు ఇష్టపడే వ్యక్తి అయిఉండి, ఫోటోలు తీయడం మీ హాబీయా? మీకు లైటింగ్, ఐఎస్ఓ గురించి బేసిక్స్ తెలిసి ఉండి, ఆయా ఫోటోల కోసం గంటలపాటు వెయిటింగ్ చేసే మనస్తత్వం ఉంటే.. మీ కంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ గురించి ఇంకెవరు అర్ధం చేసుకోగలరు. వెంటనే ఫోటోగ్రఫీలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని.. ఔత్సాహికులకు బేసిక్స్ నేర్పించండి సరిపోతుంది. మీరు ఔట్‌డోర్ ఫోటోగ్రఫీ కూడా చేయవచ్చు కానీ.. ఇందుకు బడ్జెట్‌ కూడా సహకరించాల్సి ఉంటుంది. చాలా పెద్ద ప్రపంచం మీ కెమేరా లెన్స్ కోసం ఎదురుచూస్తోంది. మంచి మంచి చిత్రాలకు భారీ రేటు అందించేందుకు కూడా చాలామంది సిద్ధంగానే ఉన్నారు. 

 హోమ్-బేకర్స్

సరిగ్గా ఓ కేక్ ను బేక్ చేయగలిగితే.. ఓ మైలు దూరం దాని వాసన ద్వారానే రుచి అమోఘం అని తెలిసిపోతుందని అంటారు. స్పెషల్ బేక్ చేసిన కేక్స్ ఎవరికి నచ్చవు చెప్పండి. కేక్స్, పైస్, పాస్ట్రీస్, డోనట్స్, కుకీస్, చాకొలెట్స్, బ్రెడ్, మౌసెస్, ఫ్రూట్ ఫ్లేవర్ రెలిష్.. మీకు వచ్చిన ఏ ఐటెం అయినా ఇంటినుంచి తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. బేకింగ్ క్లాసులు కూడా కండక్ట్ చేయచ్చు.

 నర్సరీలు

ఇంట్లో పెంచిన చెట్లకు కాసిన పండ్లు, ఆర్గానిక్ ఫుడ్‌కు విపరీతమైన గిరాకీ ఉంటుంది. హెర్బ్స్, ఫ్రూట్స్, అన్నిరకాల కూరగాయల పెంపకం ఓ ప్యాషన్ మాదిరిగా చేసి.. వ్యాపారం చేసేయవచ్చు. మీ ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలం కొంతకాలానికి మీ పిగ్గీ బ్యాంక్ అయిపోతుంది.

 మిని లైబ్రరీ

మీకు పుస్తకాలు అంటే విపరీతమైన ఇష్టమా.. మీ ఇంట్లో గదుల నిండా పుస్తకాలు నిండిపోయాయా.. మీరే ఒక కమ్యూనిటీ లైబ్రరీ స్టార్ట్ చేసేయండి. మీ ప్రాంతంలో ఉండే పుస్తక ప్రియులకు వాటిని చదివే అవకాశం కల్పించడమే కాకుండా.. ఆదాయం కూడా అందుకోండి. మీ మాదిరిగానే వ్యక్తిత్వం ఉన్నవారిని మనుషులను కలుసుకోండి.

 పెట్ సిట్టింగ్

హాలీడేస్‌కు, విదేశాలకు, లాంగ్‌టూర్స్‌కు వెళుతున్నపుడు పెంపుడు జంతువులను ఎక్కడ ఉంచి వెళతారనే అనుమానం మీకు ఎప్పుడైనా కలిగిందా? వారి పెంపుడు జంతువులను సాకే సర్వీస్‌ను మీరు ఆఫర్ చేయవచ్చు. మీ ఇంటిలో తాత్కాలికంగా వాటికి ఏర్పాటు చేయవచ్చు. 

 ఇంట్లో చేసిన జామ్స్, పచ్చళ్లు

సుదీర్ఘ కాలం మన్నే పచ్చళ్లు, పిండివంటలు, జామ్స్‌కు విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అయితే ఇంట్లో తయారు చేసిన వాటికి భలే గిరాకీ. ప్రత్యేకంగా ఎంపిక చేసిన పదార్ధాలను ఉపయోగించడమే ఈ రుచికి అసలు సిసలైన కారణం. వీటిని తయారు చేయడం మీకు వస్తే.. వెంటనే ఓ వ్యాపారం ప్రారంభించేయండి.

 హ్యాండ్‌మేడ్ యాక్సెసరీస్, జ్యూవెలరీ

యాక్సెసరీస్ తయారు చేయడం ఓ అద్భుతమైన నైపుణ్యం. దీనికి తమ ప్రతిభను జోడించి రంగురంగుల ప్యాటర్న్స్‌తో కొందరు రూపొందిస్తుంటారు. ఇయర్‌ రింగ్స్‌ నుంచి నెక్‌లేస్‌ల వరకూ కంటికి నచ్చేలా తయారు చేస్తే.. మీరే కొత్త ట్రెండ్ సెట్టర్ అయిపోవచ్చు. హ్యాండ్‌మేడ్ జ్యూవెలరీకి మార్కెట్లో అంతటి డిమాండ్ ఉంది మరి.

 అద్దకం, ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టాలు, చీరలు, వస్త్రాలు

ఎంబ్రాయిడరీ, రంగుల అద్దకంలో మీకంటీ ప్రత్యేకమైన డిజైనింగ్ శైలి ఉందా.. ప్రింటింగ్‌లో మీరు వైవిధ్యత చూపించగలరా.. సాధారణంగా కనిపించే వస్త్రాన్ని అందంగా మార్చగలమనే నమ్మకం మీకు ఉంటే.. ఈ వ్యాపారం ప్రారంభించేందుకు అది సరిపోతుంది. 

 అడ్వైజరీ సేవలు- ట్యాక్స్ ప్లానింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ వంటివి

చాలామందికి ట్యాక్స్ ఫైలింగ్ వంటి సాధారణ అంశాలపై కూడా అవగాహన అంతగా ఉండదు. ఇక ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అయితే.. ఇది చాలా చాలా తక్కువ. వివిధ పెట్టుబడి సాధనాల గురించి విని గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఇలాంటివారికి పర్సనల్ అడ్వైజర్‌గా వ్యవహరించవచ్చు. మీకు ఆయా రంగాల్లో అందుబాటులో ఉండే వెబ్‌సైట్ల వివరాలు.. ఆయా సర్వీసుల ఛార్జీలపై ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది. ఎవరి దగ్గర సరైన సలహా లభిస్తుందో చెప్పగలిగినా మీరు సక్సెస్ సాధించినట్లే.

 హోమ్ ట్రైనర్స్

జిమ్, డ్యాన్స్ క్లాస్ వంటివి చేయాలని అందరూ భావిస్తుంటారు. పైగా ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. కానీ అందరికీ జిమ్‌కి వెళ్లి వర్కవుట్స్ చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే మీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోనే జిమ్ సౌకర్యాలను, జుంబా లేదా యోగా క్లాసులను ప్రారంభించి శిక్షణ ఇచ్చేయవచ్చు. న్యూట్రిషన్ డైట్ ప్లానింగ్ గురించి వివరించవచ్చు.సల్సా, జైవ్, క్లాసికల్ వంటి డ్యాన్స్ క్లాస్‌లు కూడా స్టార్ట్ చేయవచ్చు.

 మీ ప్లేస్ అద్దెకి ఇవ్వండి

సిటీలో కానీ.. ఏదైనా కొండ ప్రాంతంలో కానీ.. మరేదైనా ప్రదేశంలో కానీ.. మీ సొంత స్థలం ఏదైనా ఖాళీగా ఉందా.. ఆ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయం సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెటింగ్ విపరీతంగా పెరిగిపోవడంతో.. వేర్‌హౌసింగ్‌కు ఆదరణ పెరుగుతోంది. అలాగే పర్యాటకులకు కూడా అద్దెకు ఇచ్చే వారికి కూడా మీ స్థలాన్ని లీజుకి ఇచ్చే అవకాశం ఉంటుంది. మొదట ఇది టెంపరరీ వ్యాపారం అనిపించినా.. చివరకు ఇది మీ ఫుల్-టైం బిజినెస్ అయిపోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com