ఒమన్:వణికిస్తున్న తుఫాన్...పెనుగాలులు, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి

- May 25, 2018 , by Maagulf
ఒమన్:వణికిస్తున్న తుఫాన్...పెనుగాలులు, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి

మెకును తుఫాన్‌... ఒమన్‌ను వణికిస్తోంది. తీరప్రాంత నగరమైన సలాలా..., పెనుగాలులు, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అక్క‌డి వీధుల‌న్నీ వరదలను తలపిస్తున్నాయి. తుఫాన్ తీవ్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు సంస్థ‌ల‌న్నీ త‌మ కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశాయి. దీంతో ముఖ్యంగా భారతీయ కార్మికులకు పని లేకుండా పోయింది. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సుమారు 600 మంది కార్మికుల‌ను అధికారులు స‌లాలా ప‌శ్చిమ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠ‌శాల‌కు త‌ర‌లించారు. అక్క‌డ వారు త‌ల‌దాచుకుంటున్నారు. స‌లాలా అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని కూడా అధికారులు ఇదివ‌ర‌కే మూసివేశారు. 

ఇప్పటికే భారీ వర్షాలు, బలమైన గాలులు దోఫార్‌ ప్రావిన్స్‌ను ముంచెత్తుతున్నాయి. కొన్ని గంటలపాటు నిరంతరాయంగా వర్షాలు కురియనున్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు ఎవరూ తమ ఇళ్లను వదిలి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మెకును ప్రభావానికి సొకొట్రాలో 17 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వణికిపోతున్న ఒమన్‌కు సహాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. ముంబై తీరం నుంచి INS దీపక్, INS కోచి అనే రెండు నౌకలను నిత్యావసరాలతో ఒమన్‌కు పంపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com