మసులా ఫెస్టివల్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బందరు

మసులా ఫెస్టివల్‌తో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బందరు

మచిలీపట్టణం:కృష్ణా జిల్లా మంగినపూడిలో నిర్వహించిన మసులా బీచ్‌ ఫెస్టివల్‌తో అంతర్జాతీయంగా బందరు పట్టణ పేరు మరోమారు మారుమోగిందని రాష్ట్ర న్యాయ, యువజన సర్వీసులు, క్రీడల శాఖామంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మచిలీపట్నం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఫెస్టివల్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు వచ్చారన్నారు. విదేశీయులు సైతం ఈ బీచ్‌ ఫెస్టివల్‌ చూసి ముగ్దులయ్యారని చెప్పారు. తీరప్రాంతంలో ఉన్న 160 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మంగినపూడి బీచ్‌ రోడ్డు మిగిలిన పనులు రూ.20కోట్లతో త్వరలో చేపడతామనీ, జిల్లాపరిషత్‌ గెస్ట్‌హౌస్‌నూ నిర్మిస్తామనీ చెప్పారు. బీచ్‌కు వచ్చే యాత్రికుల కోసం అన్ని సౌకర్యాలూ కల్పించడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. ఫెస్టివల్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్‌ చిలంకుర్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

 

Back to Top