APNRT ఐకాన్‌ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

- June 21, 2018 , by Maagulf

అమరావతి:నవ్యాంధ్ర రాజధాని అమరావతిని భవిష్యత్‌లో ఇన్నోవేషన్‌ వ్యాలీగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని రాయపూడి వద్ద ప్రవాసాంధ్రులకు నిర్మించ తలపెట్టిన ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సీఆర్‌డీఏ అధికారులు,APNRT ప్రెసిడెంట్ డా.రవి కుమార్ వేమూరు,APNRT డైరెక్టర్ రాజశేఖర్ చప్పిడి,జయకుమార్ గుంటుపల్లి(APNRT యూరోప్ ఆపరేషన్స్ హెడ్),రాధాకృష్ణ రావి(APNRT కో-ఆర్డినేటర్-సౌదీ అరేబియా),ములకల సుబ్బారాయుడు(APNRT ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్),జ్యోత్స్నా(APNRT కో-ఆర్డినేటర్-కువైట్) మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రవాసాంధ్రులు ఏ దేశంలో స్ధిరపడినా జన్మభూమిని మాత్రం మరిచిపోవద్దు. నేను గతంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లే ఎంతోమంది తెలుగువారు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులుగా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతోమంది ఇంజినీర్లుగా, వైద్యులుగా విదేశాలకు వెళ్లి సత్తా చాటారు. సాఫ్ట్ వేర్‌ రంగానికే తలమానికమైన అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టాం. ఇప్పుడు అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్నాం. ఇన్నోవేషన్‌ వ్యాలీ అంటే భవిష్యత్‌లో అమరావతే గుర్తుకురావాలి. నాలెడ్డ్జ్ ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. జేఈఈలో మన విద్యార్థులే అత్యధికంగా అర్హత సాధిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారు రాణించాలి. ప్రపంచానికి సేవ చేసే ఏకైక జాతి తెలుగుజాతే అని గుర్తింపు తీసుకురావాలి’ అని అన్నారు.

రాజధానికే ఆకర్షణీయ భవనం

రాజధానిలోని పరిపాలన నగరంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఐకాన్‌ టవర్‌ను నిర్మించనున్నారు. ప్రవాసాంధ్రుల నుంచి సేకరించిన సుమారు రూ.500 కోట్ల అంచనా వ్యయంతో 36 అంతస్తులుగా భవనాన్ని ఏపీఎన్‌ఆర్‌టీ నిర్మించనుంది. అమరావతి నగరానికి అద్దం పట్టేలా అంగ్ల అక్షరం ‘ఏ’ తరహాలో ఆకృతిని రూపొందించారు. రెండు టవర్ల మధ్యలో గ్లోబ్‌ ఆకృతిని నిర్మించనున్నారు. కొరియాకు చెందిన స్పేస్‌ కార్పొరేషన్‌ సంస్థ ఈ భవన ఆకృతిని రూపొందించింది. అధునాతనమైన ఎక్సో స్కెల్టెన్‌ విధానంలో నిర్మిస్తున్న ఈ భవనంలో అంతస్తుల మధ్యలో కాంక్రీటు పిల్లర్లు ఉండకపోవడంతో ఆరు శాతం ఎక్కువ స్థల లభ్యత ఉంటుందని ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌పూల్‌, వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లతో కూడిన ఈ భవనం అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ఈ టవర్‌ వల్ల ప్రత్యక్షంగా ఐదు వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com