"పంతం" సినిమా రివ్యూ

- July 05, 2018 , by Maagulf

రేటింగ్‌: 2/5 
తారాగణం: గోపీచంద్, మెహ్రీన్, సంపత్ రాజ్, జయ ప్రకాష్ రెడ్డి, పృథ్వీ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు 
సంగీతం: గోపీ సుందర్ 
నిర్మాత: కె.కె.రాధా మోహన్ 
దర్శకత్వం: చక్రవర్తి

పదేళ్ల క్రితం మంచి ఫామ్ లో ఉన్న హీరో గోపిచంద్ స్వయంకృతాపరాధంతో చేసిన సినిమాల పుణ్యమా అని మూడేళ్ళ పాటు వరుస డిజాస్టర్ల తో తన మార్కెట్ ను బాగా తగ్గించుకున్నాడు.

బయ్యర్లకు మినిమమ్ గ్యారెంటీ అన్న హీరోగా గోపిచంద్ కున్న పేరు క్రమంగా మసకబారుతూ వచ్చింది. విచిత్రంగా సీనియర్ దర్శకులతో చేసినా.. పేరున్న యూత్ డైరెక్టర్స్ తో చేసినా.. ఫలితంలో మాత్రం మార్పు రాకపోవడంతో పంతం మీద ఏమంత అంచనాలు లేవు. అందుకే ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నాయి.

విక్రాంత్ (గోపిచంద్) మినిస్టర్ల కు చెందిన బ్లాక్ మనీని దొంగతనం చేస్తూ.. ఎవరికి తెలియకుండా ఒక ట్రస్ట్ ద్వారా తానుంటున్న కాలనీ అభివృద్ధికి రహస్యంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. హోమ్ మినిస్టర్ జయేంద్ర (సంపత్ రాజ్) అందరికంటే పెద్ద బాధితుడిగా మారాతాడు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇవన్నీ చేస్తోంది విక్రాంత్ అని తెలుస్తుంది.

కానీ అందరు అనుకున్నట్టు విక్రాంత్ సామాన్యుడు కాదని అతను ఇవన్నీ చేయడానికి బలమైన కారణం ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. తర్వాత జరిగే పరిణామాల నేపధ్యంలో విక్రాంత్ అరెస్ట్ అయ్యి కోర్టు దాకా వస్తాడు. ఇలా దొంగతనాలు చేయాలనే పంతం విక్రాంత్ ఎందుకు పూనాడు దాని వెనుక ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ తెరమీద చూడాలి.

గోపీచంద్ పాదరసం లాంటి యాక్టర్. ఎలా మలుచుకుంటే అలా మారతాడు. కాకపోతే ఇతన్ని ఎలా వాడుకోవాలో తెలియక అప్పుడెప్పుడో వచ్చిన యజ్ఞం-రణం లాంటి ఫార్ములా సినిమాల పంధాలోనే కథలు రాసుకుంటూ గోపిచంద్ ని బోల్తా కొట్టిస్తున్నారు. తన బలం మాస్ ప్రేక్షకులే అయినప్పటికీ సరైన కథలో చూపిస్తే ఫ్యామిలీ సెక్షన్ కూడా బాగా ఆదరిస్తారని గతంలో లౌక్యం లాంటి సినిమాలు రుజువు చేశాయి. అయినా కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయి.

గోపిచంద్ నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఇందులో కూడా అంతే. సామాన్యుడిగా, కోటీశ్వరుడిగా రెండు షేడ్స్ ని చాలా ఈజ్ తో క్యారీ చేసాడు. గౌతమ్ నందాలో కూడా ఇంచుమించు ఇవే పాత్రలు కానీ.. అక్కడ డ్యూయల్ రోల్. ఇక్కడ సింగల్. అంతే తేడా. మొత్తానికి భారాన్ని బాగానే మోశాడు.

మెహ్రీన్ కు తన సినిమాల సంఖ్య పెరగడానికి తప్ప ఇది ఎందుకూ ఉపయోగపడలేదు. గ్లామర్ కోసం, పాటల కోసం తప్ప తాను చేసిన అక్షర పాత్ర శుద్ధ దండగ. విలన్ గా సంపత్ రాజ్ ఇలాంటి పాత్రల ద్వారా గిన్నిస్ రికార్డు లోకి ఎక్కేలా ఉన్నాడు. చాలా చోట్ల ఎక్కువగా అరిచి ఓవర్ యాక్షన్ చేసాడు.

షియాజీ షిండే చెవిటి కామెడీ పేలలేదు. ఉన్నంతలో పృథ్వి, శ్రీనివాస రెడ్డి కొంత నయం. నవ్వించే ప్రయత్నం చేసారు. జయప్రకాశ్ రెడ్డి, కాలకేయ ప్రభాకర్, జీవా ఇలా రాసుకుంటూ పోతే పెద్ద తారాగణం ఉంది కానీ ఎవరికి ఎక్కువ స్కోప్ దక్కలేదు.

తనకు వచ్చిన మొదటి అవకాశాన్ని దర్శకుడు చక్రవర్తి పూర్తిగా సద్వినియోగపరుచుకోలేదు. రిస్క్ లేకుండా రొటీన్ కథకే సోషల్ మెసేజ్ అనే పూత పూసాడు కానీ రంగు అతకక చాలా చోట్ల వెలిసిపోయింది. హీరో దొంగతనాలు చేసి సమాజాన్ని ఉద్ధరించడం లాంటి కాన్సెప్ట్ తో రవితేజ, అర్జున్ లాంటి హీరోలు గతంలో చేసారు హిట్స్ కొట్టారు. ఇది కూడా అదే కోవలోకి వెళ్తుంది అనే లెక్కలో.. కేవలం ప్రాధమిక సూత్రాలనే తీసుకున్న చక్రవర్తి ఇలాంటి సినిమాలల్లో బలంగా ఉండాల్సిన ఎమోషన్ ని ఒకటి రెండు సీన్స్ లో తప్ప మిగిలిన చోట్ల చూపలేకపోవడంతో పంతం సాగదీసిన ఫీలింగ్ తో పాటు ముందు ముందు ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసే అవకాశాన్ని ఇస్తుంది.

లోపమంతా కథనంలోనే ఉంది. శ్రీమంతుడు, కిక్, జెంటిల్ మెన్, సుప్రీమ్ లాంటి ఎన్నో సినిమాల కలబోతగా పంతం కనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు. మినిస్టర్ సొమ్ముని ఈజీగా నొక్కేయడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. హీరో ఎంతో సీక్రెట్ గా యాపిల్ కంప్యూటర్ లో దాచుకున్న ఇన్ఫర్మేషన్ ని ఇంటి ఓనర్ అంత తేలిగ్గా ఓపెన్ చేసి చూడటం లాంటి బ్లండర్స్ సినిమాలో ఎన్నో ఉన్నాయి.

ప్రభుత్వం అంటే హోమ్ మినిస్టర్ తప్ప ఇంకెవరూ ఉండరు అనేలా చూపడం, అంత పెద్ద బిలియనీర్ కొడుకు ఇండియాలో ఏం చేస్తున్నాడో చూసుకోకుండా ఉన్న తండ్రిని నిస్సహాయుడిగా చూపడం లాంటి తప్పులు ఎన్నో ఉన్నాయి . మరీ దారుణంగా కాదు కానీ ఏముంది ఈ సినిమాలో అనే ఫీలింగ్ కలిగేలా చేసాడు చక్రవర్తి.

తనలో మంచి టెక్నీషియన్ ఉన్నాడు కానీ.. దర్శకుడిగా ఇంకా సానబెట్టాలి. గోపి సుందర్ చెత్త అనిపించే మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్క పాట గుర్తు పెట్టుకోవడం మాట అటుంచి బయటికి వెళ్లి వద్దాం అనేలా చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా హెల్ప్ కాలేదు. ఉన్నంతలో ప్రసాద్ మూరెళ్ళ కెమెరా ఒక్కటే కాస్త రిలీఫ్. ఖర్చు మాత్రం భారీగా ఉంది.

చివరిగా చెప్పాలంటే పంతం సమాజానికి సందేశం ఇద్దామనే ముసుగులో తీసిన ఒక మామూలు మాస్ సినిమా అంతే. దారుణమైన ఫలితాలు చవిచూస్తున్న గోపీచంద్ గత సినిమాలతో కంపేర్ చేసుకుని చూస్తే కొంచెం నయం అనిపించవచ్చు కానీ అలా మినహాయించి చూస్తే మాత్రం గోపీచంద్ ఖాతాలో మరో రొటీన్ సినిమా పడినట్టే.

మాస్ కి మెచ్చే అంశాలు పూర్తిగా రంగరించలేకపోయిన చక్రవర్తి.. మెసేజ్ కి మూసకి మధ్య నలిగిపోయి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇంకాస్త శ్రద్ధ పెట్టి కథనాన్ని రాసుకుని ఉంటే కనీసం బిసి సెంటర్స్ లో బలంగా నిలిచే ఛాన్స్ ఉండేది. మొత్తంగా చూస్తే అది కూడా కష్టమే అనిపిస్తుంది.

గోపీచంద్ ను బాగా ఇష్టపడే వాళ్లకు ఓ మోస్తరుగా, సాధారణ ప్రేక్షకులకు అంతంత మాత్రంగా అనిపించే పంతం పూర్తిగా మాత్రం నెరవేరలేదు.

పంతం - మరో మూస ప్రయాణం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com