వర్షాలకు చిగురుటాకుల్లా వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

- July 16, 2018 , by Maagulf
వర్షాలకు చిగురుటాకుల్లా వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... ఫలితంగా వానలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది... లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి... ముసురు నుంచి హైదరాబాద్‌ ఇంకా తేరుకోనే లేదు..

తెలుగు రాష్ట్రాలను కుండపోత వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి... గత పది రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది... రహదారులు నదులను తలపిస్తున్నాయి... ముంపు ప్రాంతాల్లో నీరు ముందుకు కదలకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు...

తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి... రెండ్రోజులుగా ముసురులోనే రాష్ట్రం తడిసి ముద్దవుతోంది... రహదారులన్నీ నీటమునిగాయి... వర్షంలోనే జనం రాకపోకలు సాగిస్తున్నారు... రోజూవారి కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది...

సోమవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై... చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి... వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌, తాండూరు, నిర్మల్‌లో భారీ వర్షం కురిసింది. కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ,  జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది... 

ఇక హైదరాబాద్‌ మహానగర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. ఉదయం నుంచి పట్టిన ముసురు సాయంత్రం వరకు కురుస్తూనే ఉంది... దీంతో హైదరాబాదీలు వానలోనే తడుస్తూ తమ కార్యక్రమాలను సరిదిద్దుకున్నారు... నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, బంజారా హిల్స్‌, జూబ్లీహిల్స్‌ లో వర్షం కురవగా... ముషీరాబాద్‌, నాగోల్, బీఎన్ రెడ్డిలో చిరుజల్లులు పడ్డాయి. ఎల్ బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్ లలో మోస్తారు వాన పడింది. తార్నాక, నాచారం , ఉప్పల్, మేడిపల్లిలో చిరుజల్లులు పడ్డాయి.

అటు ఏపీలోనూ కుండపోతగా కురుస్తున్న వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు... వర్షానికి పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచాయి. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులు ఆగాయి. ప్రతికూల వాతావరణంలోనూ ప్రాజెక్టు పనులు ఆగకుండా శ్రమస్తున్నారు.

మరో వైపు పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలంలో వరద గోదారి 30 అడుగులకు చేరుకుంది. వాతావరణ శాఖ సైతం ముందస్తు హెచ్చరికలు చేస్తోంది. భారీ వానలు ఇలానే కొనసాగితే గోదారి తన ఉగ్ర రూపాన్ని చూపే వీలుంది. ముందస్తు జాగ్రత్తగా ధవళేశ్వరం బ్యారేజీ నుండి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 

ఇక గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీలో వాగులు పొంగుతున్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని జీఎం వలస వాగు పొంగడంతో అక్కడ కాజ్‌వే కొట్టుకుపోయింది. రవాణా, విద్యుత్‌ వ్యవస్థకు కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

నైరుతి సీజన్‌లో ఈ నెల 15వరకూ కోస్తాలో సాధారణం కంటే 29శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో రాయలసీమలో పదిశాతం తక్కువగా నమోదైంది. ఒడిషాకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ క్రమంలో వచ్చే 48 గంటల్లో ఒడిశా, ఛత్తీసగఢ్‌, విదర్భలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, కోస్తాలో కూడా భారీ వర్షాలు కురువనున్నాయి... రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com