చి.ల.సౌ:రివ్యూ

- August 03, 2018 , by Maagulf
చి.ల.సౌ:రివ్యూ

బ్యానర్: చిరుని సినీ కార్పొరేషన్ 
నటీనటులు: సుశాంత్, రుహాణి శర్మ, విద్యుల్లేఖ, రోహిణి, అను హాసన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు 
సినిమాటోగ్రఫీ: సుకుమార్‌ 
మ్యూజిక్: ప్రశాంత్ విహారి 
నిర్మాతలు: జస్వంత్ హాదిపల్లి 
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రాహుల్ రవీంద్రన్

పెళ్లి అనే కాన్సెప్ట్ తో టాలీవుడ్ లో లెక్కనేనన్ని సినిమాలు తెరకెక్కాయి. కానీ పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు కుటుంబాలతో చూడదగినవిగా ఉండడం. అలాగే యూత్ కి కూడా పెళ్లిపై ఉండే నమ్మకాలూ, అపనమ్మకాలు కూడా సినిమా థియేటర్ కి దారి చూపుతున్నాయి. మరి తాజాగా ఇలా పెళ్లి కాన్సెప్ట్ తో అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ మొదటిసారి డైరెక్ట్ చేస్తూ.. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి వచ్చి నిలదొక్కుకోలేక ఇబ్బందులు పడుతున్న సుశాంత్ హీరోగా చి. ల.సౌ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మాస్ అంటూ మాస్ కథల వెంట పడి తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ ని దూరం చేసుకుని.. చాలా సినిమాలతో ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడమే కాకుండా తానూ ఢీలా పడిన సుశాంత్ మొదటిసారి వైవిధ్యమైన కథను ఎన్నుకోవడం, అలాగే ఈ చిత్రం ఎన్నిక విషయంలో కానివ్వండి.. మారే ఇతర విషయాల్లోనూ ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా తనకి తానుగా డెసిషన్స్ తీసుకోవడం, అలాగే నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడం, అన్నిటిలో హైలెట్ ఏమిటంటే.. ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో అక్కినేని ఫ్యామిలీ ఇన్వాల్వ్ కావడం ఒక ఎత్తైతే.. నాగ చైతన్య - సమంతలు ఈ సినిమా చూసి తామే ఈ సినిమా ని విడుదల చేస్తున్నట్లు చెప్పడం.. ఇలా అదనపు ఆకర్షణలతో చి. ల.సౌ సినిమా నేడు ప్రేక్షకులముందుకు వచ్చింది. తక్కువ బడ్జెట్ తో అందమైన ప్రమోషన్స్.. ఆకట్టుకున్న ట్రైలర్ తో చి. ల సౌ సినిమా ప్రేక్షకులను కూడా ఏ మేర ఆకర్షించిందో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

లైఫ్ ఎంజాయ్ చెయ్యడమే పనిగా పెట్టుకుంటాడు అర్జున్(సుశాంత్). లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే లైఫ్ లో సెటిల్ అవుతూ.. అందమైన జీవితం గురించి కలలు కనే అర్జున్ ని అతని తల్లి తండ్రులు, స్నేహితులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు. కానీ పెళ్లి పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు అర్జున్. కానీ అర్జున్ తల్లి మాత్రం అర్జున్ పెళ్లి చేసుకునే వరకు వదలనని.. ఒకరోజు బలవంతంగానే అంజలి(రుహాణి శర్మ) దగ్గరికి పంపుతుంది. ఇక అంజలి కి అనేక సంబంధాలు వస్తాయి కానీ ఏవి సెట్ అవ్వవు. అందుకే అంజలికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది. కానీ అంజలి తల్లి తన ఆరోగ్య సమస్యల వల్లనే కూతురికి పెళ్ళి కావడం లేదని భవించి ఆత్మహత్యా యత్నం చేస్తుంది. అది తట్టుకోలేని అంజలి.. అర్జున్ తో పెళ్లి చూపులకి ఒప్పుకుంటుంది. మరి అర్జున్, అంజలిల పెళ్లి చూపులు సక్సెస్ అయ్యాయా..? వాళ్ల పెళ్లి పీటల వరకు వచ్చిందా..? అసలు అర్జున్ కి పెళ్లంటే ఎందుకు ఇష్టం ఉండదు..? అంజలి పెళ్లి ఎందుకు వద్దనుకుంటుంది..? అంజలిని చూసేందుకు వెళ్లిన అర్జున్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది..? మిగతా చి. ల.సౌ కథ.

నటీనటుల నటన:

సుశాంత్ అర్జున్ పాత్రకి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాడనిపిస్తుంది. సుశాంత్ గత సినిమాల్లో చాల రఫ్ గా. ఒక లక్ష్యం లేని కుర్రాడి పాత్రల్లోనే ఎక్కువగా కనిపించాడు. కానీ చి ల సౌ గురించి సుశాంత్ కష్టం మాత్రం తెరపై తెలుస్తుంది. అర్జున్ పాత్ర కోసం అహర్నిశలు కష్టపడ్డాడు అని అనిపిస్తుంది. చాలా ఏళ్ల తరువాత సుశాంత్‌లోని నటుడిని బయటకు తీసుకువచ్చాడు దర్శకుడు. లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌ ను బాగానే పండించ గలిగాడు. ఇన్నేళ్ల తరువాత ఈ చిత్రంతో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడున. ఎక్సప్రెషన్స్ ని బాగా క్యారీ చేసాడు. పెళ్లంటే ఇష్టం లేని కుర్రాడిగా. బాధ్యతలు పట్టించుకోలేని యువకుడిగా సుశాంత్ నటన బాగుంది. ఇంకా ఎమోషన్స్ ఉన్న సన్నివేశాల్లో సుశాంత్ నటన కాస్త మెరుగుపరుచుకుంటే పర్ఫెక్ట్ నటుడిగా సుశాంత్ కి మంచి పేరొస్తుంది. అలాగే సుశాంత్ కొన్ని క్లోజప్‌ సీన్స్‌ లో తేలిపోయాడు. ఆ సీన్స్ లో సుశాంత్ ఏజ్ కనబడుతుంది. ఇక హీరోయిన్ రుహని శర్మ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనేలా ఉంది ఆమె నటన. చాలా సహజ సిద్ధంగా నటించి అందరినీ మెప్పించింది. అంజలి క్యారెక్టర్ లో మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అదరగొట్టే నటనతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. లుక్స్ పరంగా కాస్త డల్ అయినా. అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాగే కొన్ని సన్నివేశాల్లో హీరో ని డామినేట్ చేసింది. ఇక హీరోయిన్ తల్లి పాత్రలో రోహిణి, హీరో తల్లి పాత్రలో అను హాసన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. హీరో ఫ్రెండ్ సుశాంత్ క్యారెక్టర్‌లో ఫుల్ ఫన్ అందించాడు. మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా పర్వాలేదనిపించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

కొన్ని సినిమాల్లో హీరోగా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు అంటే.. అసలు డైరెక్షన్ లో ఇతనికేం అనుభవం ఉంది. అందునా హీరో సుశాంత్ ఇప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఇలాంటి టైం లో రాహుల్ ని డైరెక్టర్ గా పరిచయం చేయడం కారెక్టేనా అని అన్నారు ఇండస్ట్రీలో చాలామంది. కానీ రాహుల్ రవీంద్రన్ మాత్రం పక్కాగా కథను రాసుకుని.. తానే స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహించాడు ఈ చి. ల. సౌ సినిమాకి. ఒక చక్కని కథతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్. కథను నడిపించిన తీరు అభినందనీయమే. పెళ్లి అనే సింపుల్‌ లైన్‌ను తీసుకుని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో చి.ల.సౌ కథను అందంగా మలిచాడు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినా కన్ఫ్యూజన్ లేకుండా లాజిక్‌లు, మ్యాజిక్‌ల జోలికి పోకుండా సున్నితమైన భావోద్వేగాలతో రియలిస్టిక్ ప్రేమకథను అందించారు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య ఒక రాత్రిలో జరిగే పెళ్లి చూపుల్ని కథాంశంగా తీయడం అనేది ప్రయోగం అనే చెప్పాలి. అందమైన లొకేషన్లు, భారీ యాక్షన్ సీన్లు లాంటి హంగామా లేకుండా కేవలం పాత్రల ద్వారా కథను నడిపించారు. ఆయనకు నటుడుగా కంటే దర్శకుడిగానే ఎక్కువ మార్కులు పడతాయంటే సందేహం లేదు. తొలి సినిమాతోనే తనలోని దర్శకుడితో పాటు రచయితకు కూడా బాగా పని చెప్పాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్‌గా, మంచి ఇంట్రెస్టింగ్ నోట్‌లో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్‌లో ఎమోషనల్ టర్న్ తీసుకోవడం, అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ లో తీసెయ్యాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఆ సీన్స్ వల్లనే సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ తర్వాత కథ గాడిన పడుతుంది. ఇక క్లైమాక్స్ వరకూ కథలో అక్కడక్కడా లాజిక్ మిస్ అయ్యే సీన్లు ఉన్నప్పటికీ ఎమోషనల్ లవ్ జర్నీలో కవర్ అయిపోయాయి. సినిమా కోసం ఎంపిక చేసిన నటీనటులను వందశాతం వినియోగించుకుని ఎమోషన్స్‌ ని రాబట్టగలిగాడు దర్శకుడు. ఇక హీరోగా సుశాంత్‌కు చి.ల.సౌ మైల్ స్టోన్ మూవీ గా నిలిచి పోతుందని చెప్పడంలో ఎక్కడా సందేహపడాల్సిన అవసరమే లేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

చి. ల.సౌ సినిమా కి సంగీతం అందించిన ప్రశాంత్ వంశీ సంగీతం ఒకే ఒకే గా ఉన్నప్పటికీ.. ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. ఇక సుకుమార్‌ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒక పెద్ద ఫ్లాట్, మరో చిన్న ఇల్లు, హాస్పటల్‌లోనే సినిమాను షూట్ చేసినా అన్ని ఫ్రేమ్స్ చక్కగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ సుకుమార్‌. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే. అక్కడక్కడా కొన్ని సీన్లకు ఎడిటర్ కత్తెర వేస్తే బాగుండేది. కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉన్నాయి. అది కూడా సెకండ్ హాఫ్ లో ఎక్కువగా ఎడిటింగ్ చెయ్యాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కొన్ని లొకేషన్స్ అయినా.. నిర్మాతలు ఖర్చు ప్రతి ఫ్రెమ్ లో తెలుస్తుంది.

ప్లస్ పాయింట్స్: స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సుశాంత్, రుహాణి శర్మ నటన, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం

మైనస్ పాయింట్స్ : మ్యూజిక్, ఎడిటింగ్, కొన్ని బోరింగ్ సీన్స్

మాగల్ఫ్ రేటింగ్: 2 .75 /5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com