బెంగళూరు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర

బెంగళూరు నగరంలో భారీ పేలుళ్లకు కుట్ర

బెంగళూరు:వివిఐపిల పర్యటనలు తరచూ ఉండడం వల్ల కేంద్ర భద్రతా బలగాలు బెంగళూరులో హై-అలెర్ట్‌గా ఉంటాయి. అనుమానాస్పద వ్యక్తులు, విదేశాలనుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌పై అనునిత్యం పర్యవేక్షణ ఉంటుంది. ఇలా బెంగళూరులో నివసిస్తే తమ వ్యూహానికి ఆదిలోనే ఎసరు వస్తుందని శివారు పట్టణాలను అడ్డాగా చేసుకుని ఉగ్రవాదులు నివసిస్తున్నారు. తుమకూరు, రామనగర్‌, కోలారు పట్టణాలలో అయితే సులభతరంగా ఇళ్ళను అద్దెకు తీసుకోవచ్చునని, పైగా నగరానికి చేరుకోవాలంటే గంటన్నర సమయం సరిపోతుందని భావించి సమీప పట్టణాలను అడ్డాగా చేసుకున్నారు. భారీ విధ్వంసానికి వీరు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. రామనగర్‌, బెంగళూరులో జమాత్‌-ఉల్‌-ముజాహిద్దీన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాదులు ఇరువురిని జాతీయ భద్రతా దళం అరెస్టు చేసిన విషయం విదితమే.

బంగ్లాదేశ్‌లో బాంబు పేలుళ్ళ కుట్రలో 95 ఏళ్ళ శిక్షకు గురై జైలు పాలైన జేఎంబీ ఉగ్రవాది మునీర్‌ షేక్‌ జైలు గోడలను పగులగొట్టి భారత్‌కు చేరినట్లు తెలుస్తోంది. బోధ్‌గయ, కోల్కత్తా, కల్‌చక్రలలో బాంబు పేలుళ్ళు జరిపిన మునీర్‌, అతడి ప్రధాన అనుచరుడు అజిత్‌, కోలారు జిల్లా మాలూరుకు చేరారు. ఓ ప్రైవేటు కంపెనీలో హెల్పర్‌గా మునీర్‌ పనిచేశాడు. కేరళలోని మల్లంపురలో అతడి సహచరుడిని ఎన్‌ఐఎ బృందాలు అరెస్టు చేయడంతో మునీర్‌, ఆదిల్‌ కుటుంబాలు రామనగర్‌కు మకాం మార్చాయి. వారిరువురు ప్రస్తుతం ఎన్‌ఐఎ అదుపులో ఉండగా మరింత మంది బెంగళూరు శివారులో ఉన్నట్లు నిఘా బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2014 డిసెంబరు 28న చర్చ్‌ స్ట్రీట్‌ బాంబు పేలుడులో నిందితుడైన సిమి ఉగ్రవాది జావేద్‌ రఫీక్‌ అలియాస్‌ అలంజబ్‌ అఫ్రిది, పరప్పన అగ్రహార లే అవుట్‌లో భార్యతో కలిసి నివసిస్తుండగా ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేశారు. 2010లో చిన్నస్వామి స్టేడియం కాంపౌండ్‌ వద్ద బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్‌ భట్కళ్‌, సోదరులతో కలసి తుమకూరులో ఆశ్రయం పొందినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక మాలూరులో నివసించిన మునీర్‌ 2016లో వైట్‌ఫీల్డ్‌ సత్యసాయిబాబా ఆసుపత్రిలో నరాల బలహీనతకు సంబంధించి చికిత్స పొందినట్లు ఎన్‌ఐఎ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. మునీర్‌, అదిల్‌లను ట్రాన్సిస్ట్‌ రిమాండ్‌పై అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఎ బుధవారం బీహార్‌ రాజధాని పాట్నాకు తీసుకెళ్ళినట్లు సమాచారం.

సాధారణ ఉద్యోగం - భారీ కుట్ర

ఉగ్రవాదుల బ్యాంకు ఖాతాలకు లక్షలాది రూపాయలు జమ అవుతున్నా వారు మాత్రం సాధారణ ఉద్యోగాలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నట్లుగా స్థానికులను నమ్మిస్తూ వచ్చారు. ప్రస్తుతం రామనగర్‌లో పట్టుబడ్డ మునీర్‌ షేక్‌ సైకిల్‌పై బట్టలు వ్యాపారం చేసుకుంటుండేవాడు. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్‌ భట్కళ్‌ తుమకూరులో విద్యార్థిగాను, చర్చ్‌స్ట్రీట్‌ బాంబు పేలుళ్ళ సూత్రధారి జావేద్‌ రఫీక్‌ ఏసీ మెకానిక్‌గాను పనిచేశారు. మునీర్‌ వద్ద లభించిన ఆధారాలను పరిశీలిస్తే దేశంలోనే భారీ కుట్రకు యత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇరువురు ఉగ్రవాదులు పట్టుబడ్డంతో స్వాతంత్య్ర సంబరాలను భారీ బందోబస్తుతో జరపాలని రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయించింది. మరింతమంది అనుమానిత ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగానే నిఘా చర్యలు కొనసాగుతున్నాయి.

Back to Top