కన్నీటి వీడ్కోలు మధ్య కొనసాగుతున్న వాజ్‌పేయి అంతిమ యాత్ర

- August 17, 2018 , by Maagulf
కన్నీటి వీడ్కోలు మధ్య కొనసాగుతున్న వాజ్‌పేయి అంతిమ యాత్ర

మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి అంతిమ యాత్ర కన్నీటి వీడ్కోలు మధ్య ప్రారంభమైంది. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. తుది వీడ్కోలు చెప్పేందుకు వేల సంఖ్యలో అభిమానులు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తరలి వచ్చారు.. వాజ్‌పేయి భౌతిక కాయం దగ్గర ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. వాజ్‌పేయి అమర్‌ రహే అంటూ నినాదాలు చేస్తున్నారు.

అంతకుముందు పార్థివదేహాన్ని BJP ఆఫీస్‌లో కార్యకర్తల సందర్శన కోసం ఉంచారు. ప్రధాని మోడీ సహా అగ్రనేతలు అద్వానీ, అమిత్‌షా, రాజ్‌నాథ్ అంతా అటల్‌జీకి నివాళులు అర్పించారు. పెద్దదిక్కులాంటి రాజనీతజ్ఞుడు అనంతలోకాలకు వెళ్లిపోవడం పార్టీకి తీరని లోటంటూ.. నేతలంతా శ్రద్ధాంజలి ఘటించారు. మహానేత మరణంతో దేశవ్యాప్తంగా విషాధ ఛాయలు అలముకున్నాయి.

ఉదయం 10 గంటల సమయంలో వాజ్‌పేయి భౌతికకాయాన్ని .. కృష్ణమీనన్‌ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి సైనిక లాంఛనాలతో ర్యాలీగా బీజేపీ హెడ్‌ఆఫీస్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అటల్‌జీ అమర్‌రహే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కార్యకర్తలంతా ఉద్వేగానికి లోనయ్యారు. వేలాదిమంది కార్యకర్తలు కడసారి చూపుల కోసం క్యూకట్టడంతో బీజేపీ ఆఫీస్ పరిసరాలన్నీ జనసందోహంతో కనిపించాయి. ఇక అంతిమ యాత్ర సైతం ఆధ్యంతం కన్నీటి పర్యతంగా సాగుతోంది. ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా సీనియర్‌ నేతలంతా అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ , మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సహా పలువురు నివాళులు అర్పించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, కిషణ్‌రెడ్డి కూడా శ్రద్ధాంజలి ఘటించారు.

వాజ్‌పేయి పార్థివదేహంపై జాతీయపతాకాన్ని ఉంచి అధికారిక లాంఛనాలతో బీజేపీ ఆఫీస్‌కు తీసుకు వచ్చారు. తెల్లని పూలతో అలంకరించిన వేదికపై భౌతికకాయాన్ని…. కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం ఉంచారు. అటల్‌జీ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను హాల్‌లో పొందుపరిచారు. కవిగా, రాజనీతజ్ఞుడిగా, మాజీ ప్రధానిగా, లౌకివాదిగా, స్నేహశీలిగా, హాస్యచతురత కలిసిన వ్యక్తిగా, మృదు స్వభావిగా, ఆప్తుడిగా.. అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వాజ్‌పేయి.

పార్టీ ఆఫీస్‌కి పార్థివ దేహాన్ని తీసుకురాకముందు.. ఉదయాన్నే అటల్‌జీ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కూడా ఆయనకు అంజలి ఘటించారు. AP సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. హైటెక్ సిటీ ప్రారంభానికి తాను ఆహ్వానించడం, దాన్ని మన్నించి ఆయన హాజరవడం ఓ అద్భుతమైన అనుభవం అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతో మద్దతిచ్చారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com