'టీచర్స్ డే': స్పెషల్ స్టోరీ

- September 04, 2018 , by Maagulf
'టీచర్స్ డే': స్పెషల్ స్టోరీ

గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట. అది భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. 1962లో భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతులు చేపట్టిన రాధాకృష్ణన్ వద్దకు కొంత మంది విద్యార్థులు, మిత్రులు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని వారు రాధాకృష్ణన్ కోరారు. అందుకు సమాధానంగా ఆయన - ప్రత్యేకంగా తన పుట్టిన రోజు జరపడానికి బదులు సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

ఆ రోజును భారతదేశంలో సెలవు దినంగా ప్రకటించలేదు. ఆ రోజున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే గురుపూజోత్సవాలు. ఆ రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తారు. కానీ రోజువారీ బోధనలు, కార్యక్రమాలు కాకుండా పాఠశాలల్లో ఉత్సవాలు జరుగుతాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయుల అవతారాలు కూడా ఎత్తుతారు. ఉపాధ్యాయుల పాత్ర పోషించి తమ పాఠశాల ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

ఆధ్యాత్మిక బోధకుడికి, భౌతిక విషయాలు బోధించే ఉపాధ్యాయుడికి మధ్య తేడా ఉంది. ఆధ్యాత్మిక గురువు తన శిష్యుడి ఆలోచనల నుంచి భ్రమలు తొలగించి ఆధ్యాత్మిక దిశగా మళ్లిస్తాడు. దేవుడు, గురువు ఇద్దరు ఎదురుగా ఉంటే ముందు ఎవరికి నమస్కరించాలని సందేహం తలెత్తితే తాను ముందుగా గురువునే ఎంచుకుంటాననే భావన భారతీయ సంప్రదాయంలో ఉంది. గురు బ్రహ్మ, గురూర్ విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే, గురువు పరబ్రహ్మ స్వరూపమనని భారతీయుల విశ్వాసం.

తల్లిదండ్రులు జన్మనిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది, వారి ప్రవర్తనను రూపు దిద్దేది ఉపాధ్యాయులే. భావి భారత పౌరులను తీర్చి దిద్దేది కూడా వారే. ఉపాధ్యాయులు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువల్ల ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం దేశాన్ని గౌరవించడం, సత్కరించడమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com