నిన్నటి వరకూ వరదలు ..ఇప్పుడు కరువు..కేరళలో విచిత్ర పరిస్థితి

నిన్నటి వరకూ వరదలు ..ఇప్పుడు కరువు..కేరళలో విచిత్ర పరిస్థితి

కేరళ:నిన్నటి వరకూ కేరళను వరదలు వణికిస్తే.. ఇప్పుడు నదుల్లో నీళ్లు ఇంకిపోయి కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. నెల రోజుల్లోనే అక్కడ పరిస్థితి పూర్తిగా తారుమారు అయ్యింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు కాల్వలు, బోర్లలో నీరు ఇంకిపోవడం, పొలాలు బీటలు వారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అప్రమత్తమైంది. వరదల తర్వాత ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది అన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ మండలి అధికారులను ఆదేశించింది.

నదుల్లో నీటి మట్టం క్రమంగా తగ్గిపోవడం ఈ వారం పదిరోజుల్లోనే గుర్తించారు. భూగర్భ జలాలు కూడా తగ్గినట్టు తేలింది. అలాగే.. వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేసే వానపాములు కూడా వరదల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయాయి. జీవవైవిధ్యం ఎక్కువగా కనిపించే వాయనాడ్ జిల్లాలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా.. వచ్చే సీజన్‌లో దారుణమైన పరిస్థితులు ఉంటాయన్న ఆందోళన నెలకొంది.

కేరళలో ప్రధానమైన పెరియార్, భారతపుజ, పంబ, కబని సహా మరికొన్ని నదుల్లో నీరంతా హటాత్తుగా మాయమైపోయింది. అప్పుడే కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. భారీవర్షాలు, వరదలు ముంచెత్తిన కారణంగా కేరళలో వందల కిలోమీటర్ల మేర భూమిలో భారీ మార్పులు చోటుచేసుకున్న కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తున్నారు. ఉన్నట్టుండి నీటిమట్టం భారీగా పడిపోవడానికి కారణాలు ఏంటన్న దానిపై.. వాటర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ అధ్యయనం చేస్తోంది. అలాగే, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడంపై నెహ్రూ బొటానిక్‌ గార్డెన్‌ అండ్‌ ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, మలబార్‌ బొటానిక్‌ గార్డెన్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ సైన్సెస్‌లు కూడా స్టడీ చేసి నివేదికలు ఇవ్వనున్నాయి.

Back to Top