బోస్టన్‌లో 70చోట్ల పేలిన గ్యాస్‌ పైపులైన్లు

- September 14, 2018 , by Maagulf
బోస్టన్‌లో 70చోట్ల పేలిన గ్యాస్‌ పైపులైన్లు

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో గ్యాస్‌ పైపు లైన్లు వరుసగా పేలడం కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయచర్యలు చేపట్టింది. గ్యాస్‌ పైపులైన్లు పేలిన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడగా... వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

దాదాపు 70చోట్ల పైపులైన్లు పేలినట్లు తమకు సమాచారం అందిందని మసాచుసెట్స్‌ పోలీసులు వెల్లడించారు. తూర్పుతీరం ప్రాంతంలోని లారెస్స్‌, ఆండోవర్‌, ఉత్తర ఆండోవర్‌లో గ్యాస్‌ వాయువులు విస్తరించినట్లు గుర్తించారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు గ్యాస్‌ పైపులైన్లలో పీడనాన్ని తగ్గించినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ ఘటనకు గల కారణాలపై ఇప్పుడే చెప్పలేమని.. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com