హెచ్‌సీటీజీ కంపెనీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్న మంత్రి లోకేష్

- September 17, 2018 , by Maagulf
హెచ్‌సీటీజీ కంపెనీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్న మంత్రి లోకేష్

ఏపీకి పెట్టుబడుల్ని ఆకర్షించడంతో మంత్రి నారా లోకేష్‌ తలమునకలయ్యారు. చైనా పర్యటనలో హెచ్‌సీటీజీ కంపెనీతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సుముఖతను తెలియజేస్తూ.. కంపెనీ ప్రతినిధులు మంత్రి సమక్షంలో రాష్ట్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సెక్రెటరీ విజయానంద్‌కు అంగీకార పత్రాన్ని అందజేశారు. టెలి కమ్యూనికేషన్‌ సేవలు అందించడంలో పేరున్న కంపెనీ హెచ్‌సిటిజి. ఫైబర్‌ కేబుల్‌ సిరీస్‌, డిజిటల్‌ కేబుల్‌ సర్వీస్‌, నెట్‌వర్క్‌ క్యాబినెట్స్‌, ఆప్టికల్‌ డిస్ట్రిబ్యూషన్‌ బాక్స్‌లను తయారు చేస్తుంది. త్వరలోనే పూర్తిస్థాయి పెట్టుబడి ప్రణాళికతో ఏపీకి వస్తామని హెచ్‌సిటిజి ప్రతినిధులు లోకేశ్‌కు తెలిపారు.

బీజింగ్‌లో రైసెన్‌ సోలార్‌ టెక్నాలజీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జియాన్‌పింగ్‌ జెంగ్‌తోనూ లోకేష్‌ చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలో పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు వస్తామని జియాన్‌పింగ్‌ తెలిపారు.

మరోవైపు సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీ వైస్‌ డైరెక్టర్‌ ఆరాన్, ఓ ఫిల్మ్‌ కంపెనీ ప్రతినిధులతోనూ లోకేష్‌ భేటీ అయ్యారు. కెమెరా మాడ్యూల్‌, ఆప్టికల్‌ కాంపోనెంట్స్‌ తయారీలో అపార అనుభవమున్న ఓ ఫిల్మ్‌, సన్నీ ఆప్టికల్స్‌ సంస్థలను ఏపీకి ఆహ్వానించారు.. ఏపీలోని ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లను సందర్శించాలని మంత్రి కోరారు. ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఏపీని సందర్శిస్తామన్నారు.

అంతకుముందు సోలార్‌ ఎనర్జీ సంబంధిత పరికాల తయారీలో పేరొందిన చైనా ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ గ్రూప్‌ కంపెనీ సీఈఓ వాన్గ్‌బిన్‌తోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తిని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను వాన్గ్‌బిన్‌కు వివరించారు. CETC సబ్సిడరీ కంపెనీలు, సప్లయర్‌ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. మంత్రి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన CETC సీఈఓ… ఏపీలో కంపెనీ విస్తరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఈ పర్యటనలోనే చైనాలో నివసిస్తున్న తెలుగువారితోనూ లోకేష్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. మరోవైపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో మన దేశం తరపున లోకేష్ పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com