చంద్రుడి మీదకు జపాన్ బిలియనీర్..'డియర్ మూన్' అంటూ ప్రచారం

- September 17, 2018 , by Maagulf
చంద్రుడి మీదకు జపాన్ బిలియనీర్..'డియర్ మూన్' అంటూ ప్రచారం

జపాన్‌: చందమామ ఇక అందుతుంది. వెన్నల చెంతకు ఇక పర్యాటకులూ వెళ్లవచ్చు. వ్యోమగాములే కాదు, మాములు మానవులూ ఇప్పుడు చంద్రుడిని చుట్టిరావచ్చు. స్పేస్ ఎక్స్ తన మూన్ ప్రాజెక్టు కోసం తొలి టూరిస్టును ప్రకటించింది. జపాన్‌కు చెందిన బిలియనీర్ యుసాకు మైజావా.. చంద్రుడి మీదకు వెళ్లే మొదటి పర్యాటకుడని ఎలన్ మస్క్ తెలిపారు. జపాన్ ఆన్‌లైన్ దుస్తుల వ్యాపారంలో జోజోటైన్ టాప్ సైట్‌గా ఉంది. దాని వ్యవస్థాపకుడే యుసాకు మైజావా. స్పేస్ ఎక్స్ ప్రయోగించనున్న బిగ్ ఫాల్కన్ రాకెట్‌లో ఈ టూరిస్టు ప్రయాణించనున్నాడు. 2023లోగానే అతను చంద్రుడి చుట్టు వెళ్లి రావాలన్న ఆసక్తితో ఉన్నాడు. డియర్‌మూన్ ప్రాజెక్టు పేరుతో తన మూన్ రైడ్‌ను ఓ వెబ్‌సైట్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నాడు. ఫోర్బ్స్ ప్రకారం 42 ఏళ్ల యుసాకు మైజావా ఆస్తులు 2.9 బిలియన్ డాలర్లు. ఖరీదైన కళాఖండాలను సేకరించడం ఈయనకు హాబీ. కొంత మంది ఆర్టిస్టులతో కలిసి మూన్ ట్రిప్‌కు వెళ్లాలని యుసాకు నిర్ణయించాడు. సుమారు 8 మంది కళాకారులను ఆహ్వానించేందుకు అతను ప్లాన్ చేశాడు.

వివిధ వర్గాలకు చెందిన ఆ కళాకారులతో తన మూన్ ప్రాజెక్టుపై భవిష్యత్తు తరాలకు కావాల్సిన అంశాలను తయారు చేయనున్నట్లు అతను తెలిపాడు. ఇప్పటి వరకు కేవలం రెండు డజన్ల సంఖ్యలో మాత్రమే చంద్రుడి చుట్టు తిరిగి వచ్చారు. 1972లో అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్ చివరిది. ఆ తర్వాత మళ్లీ మనుషులెవరూ చంద్రుడి వద్దకు వెళ్లలేదు.

అయితే ఈ చంద్రయాణం కోసం జపాన్ బిలియనీర్ ఎంత సొమ్ము చెల్లించాడన్న అంశాన్ని మాత్రం ఎలన్ మస్క్ వెల్లడించలేదు. కానీ భారీ మొత్తంలో అతను డబ్బు ఇస్తున్నట్లు మస్క్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com