ప్రపంచంలో తొలిసారిగా పట్టాలెక్కిన హైడ్రోజన్‌ రైలు

- September 18, 2018 , by Maagulf
ప్రపంచంలో తొలిసారిగా పట్టాలెక్కిన హైడ్రోజన్‌ రైలు

జర్మనీ: ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు జర్మనీలో పట్టాలెక్కింది. ఈ రైలు నిర్మాణం కొంచెం ఖర్చుతో కూడినది అయినప్పటికీ ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ రైళ్లను ఫ్రెంచి కంపెనీ ఆల్స్‌టామ్ తయారు చేసింది. కక్స్‌హెవెన్, బ్రిమెర్‌హెవెన్, బ్రీమెర్వోడ్,బక్స్‌ట్‌హ్యూడ్ మధ్య దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాయి.

ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైలు కమర్షియల్ సర్వీసు సేవలందించేందుకు సిద్ధంగా ఉందని.. మరికొన్ని ఈ తరహా రైళ్లను త్వరలోనే తయారు చేస్తామని ఆల్స్‌టామ్ కంపెనీ సీఈఓ హెన్రీ పొపార్ట్ తెలిపారు. హైడ్రోజన్‌తో ఈ రైళ్లు నడుస్తాయని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక స్టేషన్లు నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 

హైడ్రోజన్ రైళ్లతో ఆవిరి, నీరు మాత్రమే విడుదల

2021కల్లా మరో 14 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెడతామని ఆల్స్‌టామ్ కంపెనీ తెలిపింది. జర్మనీలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా రైళ్లు నడిపేందుకు ఆసక్తికనబరుస్తున్నాయన్నారు. హైడ్రోజన్ రైళ్లు ఫ్యూయెల్ సెల్స్ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి కరెంటును ఉత్పత్తి చేస్తాయని దీని ద్వారా ఆవిరి నీరు మాత్రమే విడుదల అవుతుందని వివరించిన సంస్థ పర్యావరణంకు ఎలాంటి హాని కలగదని తెలిపింది.
 
హైడ్రోజన్ ట్యాంక్ నింపితే 1000 కిలోమీటర్లు వరుకు పరుగులు

ట్రైన్‌లో అమర్చిన లిథియమ్ బ్యాటరీలలో అధిక శక్తి స్టోర్ అయి ఉంటుంది. ఒక్కసారి హైడ్రోజన్ ట్యాంక్ నింపితే ట్రైన్ 1000 కిలోమీటర్లు వరకు పరుగులు తీస్తుంది. డీజిల్ ఇంజిన్లు కూడా ఒక్కసారి ట్యాంక్ ఫుల్ అయితే 1000 కిలోమీటర్లు వరుకు పరుగులు తీయగలవు. హైడ్రోజన్ టెక్నాలజీతో కాలుష్యంకు చెక్ పెట్టొచ్చని, అదే డీజిల్ ఇంజిన్ అయితే విడుదలయ్యే పొగతో కాలుష్యం ఏర్పడుతుందని వివరించిన ఆల్స్‌టామ్ సంస్థ హైడ్రోజన్ రైలు డీజిల్ ఇంజిన్లకు, ఎలక్ట్రిక్ ఇంజిన్లకు ప్రత్యామ్నాయంగా మారనుందని తెలిపింది. జర్మనీ నగరాల్లో విస్తరించిన కాలుష్యానికి కొత్త హైడ్రోజన్ రైలు చెక్ పెట్టనుంది. 

డీజిల్ ట్రైన్ ధరకంటే హైడ్రోజన్ రైలు ధర కాస్త ఎక్కువే

హైడ్రోజన్ రైలు ధర డీజిల్ రైలుకంటే కొంచెం ధర ఎక్కువే అయినప్పటికీ దాని నిర్వహణ ఖర్చు చాలా తక్కువని కంపెనీ ప్రతినిధి స్టీఫన్ చ్రాంక్ తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇతర దేశాలు అంటే బ్రిటన్, నెదర్లాండ్స్, డెన్మార్క్, నార్వే, ఇటలీ, కెనడాల నుంచి కూడా తమకు హెడ్రోజన్ రైళ్లు కావాలని ఆర్డర్ వస్తున్నాయని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఫ్రాన్స్ మాత్రం 2022కల్లా తమ దేశ పట్టాలపై హైడ్రోజన్ రైలు పరుగులు తీయాలని త్వరగా తమకు రైలును తయారు చేసి అందివ్వాల్సిందిగా కోరినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com