కేరళ:అయ్యప్ప సన్నిధిలో స్త్రీలు అడుగుపెడితే..ఆత్మహత్యల బెదిరింపులు

- October 14, 2018 , by Maagulf
కేరళ:అయ్యప్ప సన్నిధిలో స్త్రీలు అడుగుపెడితే..ఆత్మహత్యల బెదిరింపులు

కేరళ అట్టుడుకుతోంది. అయ్యప్ప సన్నిధిలో స్త్రీలు అడుగుపెడితే ఆత్మహత్య చేసుకుంటామంటున్న ప్రకటనలు కాక పుట్టిస్తున్నాయి. త్వరలోనే శబరిమల అయ్యప్పను దర్శించుకుంటానన్న తృప్తీదేశాయ్ స్టేట్ మెంట్ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఆమె ప్రకటనపై పందళం రాచ కుటుంబీకుడు శసికుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు ఎవరికీ మంచిదికాదని హితవు పలికారు.

భక్తుల దర్శనార్థం ఈనెల 16న అయ్యప్ప సన్నిధి తలుపులను తెరవనున్నారు. దీంతో ఏక్షణం ఏం జరుగుతుందో అని భక్తుల్లో టెన్షన్ మొదలైంది. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. యువతులను ఆలయంలోకి అనుమతిస్తే.. ఆత్మహత్య చేసుకుంటామని శివసేన హెచ్చరించింది. ఆలయం తెరిచిన తొలి రెండ్రోజులు ప్రతీ జిల్లా నుంచి వేలాది మహిళా శివసేన కార్యకర్తలు అక్కడికి వెళతామని ఆపార్టీ నేత పెరింగమ్మల అజీ తెలిపారు. మహిళా కార్యకర్తలంతా ఆత్మహత్యా దళంగా పంపానది నుంచి ఆలయం వరకు వరుసగా నిలబడతారన్నారు. ఆ సమయంలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని తేల్చిచెప్పారు.

కొచ్చీలో వేలాది మంది ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. శబరి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించే మహిళలను అడ్డంగా నరికెయ్యాలన్న నటుడు కొల్లం తులసిపై కేసు నమోదైంది. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తే.. ఆ ప్రాంతం థాయ్ లాండ్ లా మారుతుందన్న టీడీబీ మాజీ అధ్యక్షుడు ప్రయర్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈమొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com