జనవరి 24న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల : వర్మ

- October 19, 2018 , by Maagulf
జనవరి 24న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల : వర్మ

వివాదాస్పద సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న మరో కాంట్రవర్సీ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. దివంగత ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు పోటీగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తెరపైకి తెచ్చారు. దీంతో విడుదలకు ముందే వర్మ సినిమా ఆసక్తికరంగా మారింది. తిరుపతిలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతితో కలిసి మీడియాతో మాట్లాడిన వర్మ.. తన సినిమా విశేషాలను వివరించారు. జనవరి 24న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల చేస్తున్నామని, దివంగత ఎన్టీఆర్‌ ఆశీస్సులు తన సినిమాకు ఉంటాయని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాలు చూపించేలా సినిమా తీయగలిగే దమ్ము ఎవరికీ లేదన్న వర్మ.. తాను మాత్రం నిజాలు నిరూపించగలిగేలా సినిమా తీస్తానని స్పష్టం చేశారు. అయితే వైసీపీకి తాను తీసే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు ఎలాంటి సంబంధం లేదని వర్మ క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్‌ మంచి మనిషి అని పొలిటిక్‌ హీరో అని, నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేందుకు ఎన్టీఆర్‌ భయపడరని వర్మ కొనియాడారు. లక్ష్మీపార్వతి గురించి చెప్పగలిగే ప్రత్యక్ష సాక్షి ఎన్టీఆర్‌ మాత్రమే అన్నారు. యూట్యూబ్‌లో లక్ష్మీపార్వతి గురించి... ఎన్టీఆర్‌ గొప్పగా మాట్లాడిన వీడియో తాను చూశానని చెప్పారు. అలనాటి నటీమణలు శ్రీదేవి, జయసుధ, జయప్రదలో లేని ఆకర్షణ... లక్ష్మీపార్వతిలో ఏముందని తాను ఆశ్చర్యపోయానని వర్మ వ్యాఖ్యానించారు. అంతటి ఆకర్షణను కాదని...ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకోవడంపై సందిగ్ధంలో పడిపోయానని చెప్పుకొచ్చారు. కాగా, దాదాపు కొత్తవాళ్లతోనే సినిమా తీస్తున్నట్టు.. పాత్రల ఎంపిక తుదిదశకు చేరినట్టు వర్మ వెల్లడించారు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామిని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి దర్శించుకున్న వర్మ.. సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉన్న అనేక సందేహాలకు సమాధానంగా తన వాయిస్‌లో 4 నిమిషాల నిడివితో ఉన్న వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను నాస్తికుడిగా చెప్పుకునే వర్మ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. తనకు దేవుడి మీద నమ్మకం ఉందన్న వర్మ.. భక్తుల మీదే నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవమే తనను తిరుమల రప్పించిందన్నారు. ఈ సినిమాలో నిజాలు చూపించేలా తనను ఆశీర్వదించాలని తాను శ్రీవారిని కోరుకున్నట్టు వర్మ చెప్పారు. నాస్తికుడైన వర్మ శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. వర్మ తన సిద్దాంతాలను పక్కన పెట్టి దైవ దర్శనానికి రావడం వల్ల ఈ సినిమాకు, ఎన్టీఆర్‌కు న్యాయం జరుగుతుందని.. సినిమా విజయవంతం అవుతుందని లక్ష్మీపార్వతి ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com