ప్లకార్డుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన చిన్నారి..

ప్లకార్డుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన చిన్నారి..

శబరిమలలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి… పోలీసులు భద్రతను మరింత పెంచారు. నాలుగో రోజూ అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కొందరు మహిళలు కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు చేసి.. మహిళలను వెనక్కు పంపిస్తున్నారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

శబరిమల ఆలయ పరిసరాల్లో నాలుగో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళనలు కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇంకా వెల్లువెత్తుతున్నాయి.

శుక్రవారం ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోకి చేరుకోగానే భక్తులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని శబరిమల పోలీసు కార్యాలయానికి తరలించారు. భక్తుల నిరసనల నేపథ్యంలో లోనికి అనుమతించడం సాధ్యం కాదని పోలీసులు వారికి నచ్చజెప్పారు.

ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం అసాధ్యమనిపిస్తోంది. కేరళ వ్యాప్తంగా ఎక్కడికక్కడ భక్తులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అటు ఆలయ సిబ్బంది, పూజారులు కూడా మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుండడంతో.. పోలీసులు ఏం చేయలేకపోతున్నారు.

అయ్యప్పమాల వేసుకొని తల మీద ఇరుముడి పెట్టుకున్న తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం తనకు 50 ఏళ్లు పూర్తయిన తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను అని అర్థం వచ్చేలా రాసిన ప్లకార్డు పట్టుకుని ఆలయంలోకి ప్రవేశించింది.

శబరిమల ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్న ఆచారాలను గౌరవించాలని తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ పేర్కొన్నారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెబుతూనే.. శబరిమల ఆలయం మతపరమైన విశ్వాసాలతో ముడిపడిందని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు వయసుతో నిమిత్తం లేకుండా మహిళలంతా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయప్ప స్వామిని దర్శించుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై.. ఆలయ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

Back to Top