దీపావళికి పెరగనున్న పసిడి ధర

- October 20, 2018 , by Maagulf
దీపావళికి పెరగనున్న పసిడి ధర

ప్రపంచవ్యాప్తంగా పసిడి దిగుమతుల్లో చైనా తరువాత రెండో స్థానంలో ఉన్న భారతీయ కొనుగోలు దారులకు రానున్న దీపావళి ఒక కుదుపునివ్వనుందా? గత రెండేళ్ళ గరిష్టానికి బంగారం ధరలు పెరగనున్నాయా? అవుననే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.  రూపీ ఆల్ టైం గరిష్టానికి పడిపోడంతో బులియన్ మార్కెట్ ధరలు పుంజుకోనున్నాయి. ఇక దేశీయంగా దివాలీ, ధన్ తేరాస్ పండుగల్లో బంగారం డిమాండ్ ఎక్కువగా ఉండనుంది. దీంతో రిటైలర్లు బంగారం దిగుమతిని పెంచనున్నారు. దాంతో ధరలు కూడా పెరొగచ్చని మార్కెట్ వర్గాల భోగట్టా. రానున్న ఈ రెండు పండుగలు వినియోగ దారులకు సంతోషాన్ని మిగలనివ్వవని మెటల్ ఫోకస్ లిమిటెడ్ ఎనలిస్ట్ చిరాగ్ సేఠ్ అంటున్నారు. రానున్న మరి రెండు రోజుల్లో అంతర్జాతీయ పసిడి ధరల సూచి  కుదుపుకు లోనయ్యే అవకాశం లేక పోలేదని.. చిరాగ్ పేర్కొన్నారు.  

అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున దిగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి దేశంలో బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు.  ముఖ్యంగా మన దేశంలో నవంబర్ 5 న వచ్చే ధన్ తేరాస్, దానికి రెండు రోజుల ముందుగా వచ్చే దీపావళికి బంగారు ఆభరణాల కొనుగోళ్ళు ఊపందుకుంటాయి. పెళ్ళిళ్ళు కూడా ఈ సీజన్‌లో ఉండటంతో పసిడికి అధిక గిరాకి ఉండటం సహజం. ఈ ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బంగారం ధరలు మరింత పెరగనున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గత నాలుగేళ్ళ అమ్మకాలు పరిశీలిస్తే… దాదాపు 240 మెట్రిక్ టన్నుల బంగారాన్ని వినియోగ దారులు కొన్నారని  వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. మల్టీ కమోడిటీస్ ఎక్సేంజ్ ఇండియా లిమిటెడ్ లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు 9శాతం పెరిగాయి. జూలై 2016 తరువాత ఇదే అత్యధికం. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో గోల్డ్ ధర కాస్త దిగివచ్చినప్పటికీ .. దేశీయంగా రూపీ మారకపు విలువ పడిపోడంతో.. ఇక్కడ రేట్లు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

రూపీ పతనం, రేట్ల పెరుగుదల కారణంగా ఈ సారి బంగారం డిమాండ్ తక్కువగా ఉండొచ్చని ఆల్ ఇండియా జ్యూయల్‌రీ డొమెస్టిక్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితిన్ ఖండేల్ వాల్ అంటున్నారు . కానీ రానున్న పండుగలను దృష్టిలోపెట్టుకుని ఇప్పటికే పసిడి దిగుమతి దారులు  రెట్టింపు ఆర్డర్లు చేసేశారు. బంగారు ఆభరణాలకు డిమాండ్ తక్కువగాఉంటే  ఈ సారి కొనుగోళ్ళు మందగించవచ్చు. దేశంలో అతిపెద్ద బంగారు ఆభరణాల తయారీ సంస్థల షేర్లు నేటిమార్కెట్లో క్షీణతను చవిచూశాయి. బ్రాండెడ్ జ్యూయల్‌రీని తయారు చేసే టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ  0.9శాతంక్షీణించింది. అలాగే త్రిభువన్ దాస్ భీమ్‌జీ జవేరీ లిమిటెడ్ కూడా 1.7 శాతం క్షీణతకు గురైంది. ఏది ఏమైనా మన భారతీయులు మాత్రం పసిడి ప్రియులే. ఈసారి దివాలీ, ధన్ తేరాస్‌లకు బంగారు ఆభరణాల కొనుగోళ్ళు పెరుగుతాయనే.. ఆ సంస్థలు భావిస్తున్నాయి. తులం బంగారం రేటు ప్రస్తుతం 10 గ్రాములు రు. 32,720 గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com