పాకిస్థాన్‌ లో భారీ సైబర్‌ అటాక్‌..

పాకిస్థాన్‌ లో భారీ సైబర్‌ అటాక్‌..

పాకిస్థాన్‌ను హ్యాకర్లు చావుదెబ్బ కొట్టారు. ఏకంగా దేశంలోని అన్ని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసి… కోట్ల రూపాయలను దోచుకున్నారు. 22 బ్యాంకుల్లో కస్టమర్ల సమాచారం చోరీ చేసి.. బ్యాంకింగ్‌ వ్యవస్థనే కుప్పకూల్చారు. భారీ సైబర్‌ అటాక్‌తో పాక్‌ బ్యాంకులు.. ఆర్థిక లావాదేవీలను నిలిపివేశాయి.

పాకిస్థాన్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థపై హ్యాకర్లు పంజా విసిరారు. దాదాపు అన్ని పాకిస్థానీ బ్యాంకుల్ని హ్యాక్‌ చేసి.. సుమారు 8 వేల మంది ఖాతాదారుల సమాచారం కొల్లగొట్టారు. మొత్తం 22 పాకిస్థానీ బ్యాంకులకు చెందిన సమాచారాన్ని హ్యాకర్లు మార్కెట్లో అమ్ముకున్నట్లు తెలుస్తోంది. సుమారు 20 వేల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను తెలుసుకున్నట్లు పాకిస్థాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ భావిస్తోంది. ఈ కార్డులను ఉపయోగించి ఎంత సొమ్ము దొంగతనానికి గురైందో తెలియాల్సి ఉంది.

ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డులు హ్యాక్ అవుతున్నట్లు అనుమానం రావడంతో ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్టు పాకిస్థాన్‌లోని పది జాతీయ బ్యాంకులు ప్రకటించాయి. ఈ కార్డుల ద్వారా అంతర్జాతీయ లావాదేవీలను నిలిపివేశాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు హ్యాక్ అవుతున్నట్టు పౌరులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిరోజుల క్రితం కార్డ్ పేమెంట్స్ బంద్ చేసిన బ్యాంకులు.. తాజాగా ఆన్‌లైన్ కార్యకలాపాలను కూడా బంద్ చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో హ్యాకింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు అన్ని బ్యాంకులు హ్యాకింగ్‌కు గురైనట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన సైబర్ నేరాల విభాగం తెలిపింది. ఖాతాదారుల సొమ్ము భారీగా దొంగతనానికి గురైనట్లు వెల్లడించింది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.

మరోవైపు దేశంలోని బ్యాంకులపై హ్యాకర్లు దాడి చేసినట్లు వార్తలు రావడంతో పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు తక్షణమే స్పందించింది. పెట్టుబడిదారులు, బ్యాంకు ఖాతాదారులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించింది. బ్యాంకు ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించినట్లు ఆందోళన వ్యక్తమవుతోందని.. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ హ్యాకింగ్‌కు గురి కాలేదని స్పష్టం చేసింది.

Back to Top