ఈ నెల 22న విడుదల కానున్న 'శరభ'

- November 10, 2018 , by Maagulf
ఈ నెల 22న విడుదల కానున్న 'శరభ'

హైదరాబాద్:తెలిసి తెలియని వయసులో ఇండిస్టీకి వచ్చాను. తెలుగు ఇండిస్టీనే నన్ను ఇంతదాన్ని చేసింది. ఎప్పటికీ ఈ రుణాన్ని తీర్చుకోలేను. మళ్లీ జయప్రదగా, తెలుగు బిడ్డగానే నన్ను పుట్టించాలని కోరుకుంటున్నాను. భారీ గ్రాఫిక్స్‌ ఉన్న ఈ సినిమాలో తల్లీకొడుకు అనే ఎమోషన్‌ను ఇమడ్చటం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఈ చిత్రం నా జీవితంతో కొత్త మలుపు. 'శరభ' లాంటి సినిమాలు రావడానికి కూడా ఇది సరైన సమయం అని భావిస్తున్నాను'' అని జయప్రద అన్నారు. 
ఆకాష్‌ కుమార్‌, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన చిత్రం 'శరభ'. సీనియర్‌ నటి జయప్రద ప్రధాన పాత్రలో చేశారు. ఎన్‌.నరసింహరావు దర్శకత్వం వహించారు. ఎ.కె.ఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై అశ్వని కుమార్‌ సహదేవ్‌ నిర్మించారు. ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆర్‌.నారాయణమూర్తి మేకింగ్‌ వీడియో, ట్రైలర్‌ను జయప్రద, చదలవాడ శ్రీనివాసరావు విడుదల చేశారు. 
దర్శకుడు నరసింహరావు మాట్లాడుతూ ''సినిమా తీయడానికి చాలా రోజులు పట్టింది. అలాగే విడుదలకు కూడా. 'ఎర్రసైన్యం'తో ఇండిస్టీలోకి వచ్చాను. నా గురువు నారాయణమూర్తి ఇచ్చిన ఫౌండేషనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. భీమనేని శ్రీనివాసరావు, బాలశేఖర్‌, శంకర్‌ లాంటి గొప్ప దర్శకుల వద్ద 20 ఏళ్లు వర్క్‌ చేసిన అనుభవంతో ఈ సినిమా చేశాను. సున్నితంగా పెరిగిన ఆకాశ్‌ను చాలా కష్టపెట్టాను. మిస్టీ చాలా బాగా చేసింది. జయప్రద వంటి మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె ఎంత అద్భుతంగా నటించారో సినిమాలో చూడొచ్చు. ఆమె ఒప్పుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది' అని అన్నారు. 
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ''నేను ఈ సినిమా ఫీల్డ్‌లో పుట్టడానికి కారణం కేవలం జయప్రద గారే. నేను తెనాలిలో ఏమీ లేని స్టేజ్‌లో నేల టికెట్‌ చూసే రోజుల్లో ఆవిడ చేసిన 'సీతారాములు' సినిమా చూశాను. ప్రపంచంలో ఇంత అందమైన లేడీని ఎక్కడా చూడలేదు. నా జన్మలో ఎప్పటికైనా ఈమెతో ఓ సినిమా తీయాలి అని ఫ్రెండ్స్‌తో చెప్పాను. ఈ మాట జయప్రదగారితో కూడా ఇప్పటివరకూ చెప్పలేదు. ఆరోజు చెప్పినట్టుగానే ఫస్ట్‌ సినిమా ఆమెతోనే చేశాను' అని తెలిపారు. 
ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ 'శంకర్‌కు ఈ సినిమా డైరెక్టర్‌ నరసింహరావు శిష్యుడు. ప్రారంభంలో నా వద్ద మూడు సినిమాలకు వర్క్‌ చేశాడు. 'నీలో టాలెంట్‌ ఉంది నాలాంటి సినిమాలు అందరూ తీయరు నువ్వు బయటకి వెళ్లి ట్రై చేయి' అని అంటే వెళ్లాడు. ఇటీవలే ఈ సినిమా చూశాను. గొప్ప సినిమా తీశాడు. కథను, దర్శకుడిని నమ్మి రూ.20 కోట్లు పెట్టి ఈ సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్‌కు హ్యాట్సాప్‌. జయప్రద గారి క్యారెక్టర్‌ అద్భుతంగా ఉంటుంది. నా కాలేజ్‌ డేస్‌లోనే జయప్రద గారు పెద్ద హీరోయిన్‌. రంభ, ఊర్వశి, మేనక పేర్లు మాత్రమే విన్నాం. భూతలంపై అలాంటి అందమైన వాళ్లెవరైనా ఉన్నారంటే ఆవిడే జయప్రద. ఈ మాట నేనో మీరో చెప్పింది కాదు ద గ్రేట్‌ డైరెక్టర్‌ సత్యజిత్‌రే అన్న మాటలివి. తెలుగు నుంచి వెళ్లి నార్త్‌లో సక్సెస్‌ అయిన ఏకైక హీరోయిన్‌ జయప్రద. కమిట్మింట్‌ ఉన్న నటి. గొప్ప పొలిటీషియన్‌ ఆమె. ఆవిడ వయసెంతో తెలీదు. కానీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. హీరోతో పాటు విలన్‌ క్యారెక్టర్‌ కూడా హీరోయిక్‌గా ఉంది. అన్ని అంశాలు అద్భుతంగా కుదిరాయి' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com