వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో AMB Cinemas

- November 14, 2018 , by Maagulf
వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో AMB Cinemas

సామాన్య మానవుడి దగ్గరి నుంచి ఎగువ తరగతి వ్యక్తుల వరకు అందరినీ అలరింపజేసేది. ఆకట్టుకునేలా చేసే ఏకైక సాధనం సినిమానే. ప్రతీ ఇంట్లో టీవీ కొలువు దీరినా సినిమాలను వెండితెరపై థియేటర్లలోనే చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. గతంలో టీవీ విస్తరిస్తున్న సమయంలో కొంతకాలం పాటు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గినా మళ్లి పుంజుకోవడం విశేషం, సినిమా బావుందని టాక్‌ వస్తే చాలా.చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రేక్షకులు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇంకోవైపు మల్టి ఫ్లెక్స్‌ సంస్కృతి అన్ని ప్రాంతాల్లోనూ వచ్చేసింది. ముఖ్యంగా నగర ప్రాంతాలలో ఇందులో సినిమా చూసేందుకు ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. దాంతో అధునాతన సౌకర్యాలను మల్టి ఫ్లెక్స్‌లలో కల్పించేందుకు ఆయా యాజమాన్యాలు ఎంతో శ్రద్దను కనబరుస్తున్నాయి. వాటిలోని సౌండింగ్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతని కలిగిస్తోంది. దీని సంగతి అలావుంటే.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు తలమానికంగా అత్యాధునిక సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఎయంబి మల్టి ఫ్లెక్స్‌ నిర్మించబడింది. స్థానిక కొండాపూర్‌లోని కొత్తగూడ సిగ్నల్స్‌ వద్ద ఏషియన్‌ సినిమాస్‌ సంస్థ, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భాగస్వాములుగా ఎయంబి నిర్మాణం సకల హంగులతో దాదాపుగా పూర్తయింది. భాగస్వాముల పేర్లతో కలిసి వచ్చేటట్లుగా దీనికి ఎయంబి పేరు పెట్టారు.

మొత్తం ఏడు స్క్రీన్స్‌ (థియేటర్స్‌) ఈ మల్టి ఫ్లెక్స్‌లో ఉన్నాయి. అన్ని స్క్రీన్స్‌లో కలుపుకుని మొత్తం 1638 సీట్లు ఉన్నాయి. ఐదవ స్క్రీన్‌ విఐపి లాంజ్‌తో మొత్తం 52 గోల్డ్‌ క్లాస్‌ సీట్లు ఉన్నాయి. ఇవన్నీ రిక్లైయినర్‌ సీట్లు కావడం ఓ విశేషం, అన్ని స్క్రీన్స్‌కు డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ సిస్టమ్‌తో నిర్మాణం జరిపారు.

మల్టి ఫ్లెక్స్‌లోని ఐదవ ఫ్లోర్‌లో ప్రత్యేకించి యం లాంజ్‌ను నిర్మించారు. గోల్డ్‌ క్లాస్‌ స్క్రీన్‌ ప్రేక్షకులు మాత్రమే యం లాంజ్‌లో సేదతీర వచ్చు. అక్కడ సకల సౌకర్యాలతో ప్రేక్షకులకు కొత్తరకమైన అనుభూతి కలుగుతుంది. షవర్‌ బాతింగ్‌ సౌకర్యం కూడా అక్కడ ఏర్పాటుచేశారు.

బయట దొరకని పసందైన అనేకరకాల తినుబండారాలు అక్కడ దొరుకుతాయట. ఇక నూరు మంది సామర్ధ్యం కలిగిన పార్టీ బ్యాంకెట్‌ హాల్‌ కూడా ఈ మల్టి ఫ్లెక్స్‌లో ఉంది. ఇక్కడ వందమందితో కూడుకున్న వ్యక్తులు లేదా సంస్థలు, సినిమావాళ్లు ఫంక్షన్లు చేసుకునే సౌలభ్యం ఉంది. మొత్తం నాలుగు స్థాయిలలో (ఫోర్‌ లెవల్స్‌) పార్కింగ్‌ ఈ మాల్‌లో ఉంది.

బి-2 పార్కింగ్‌ను ప్రత్యేకించి ఎయంబికి కేటాయించారు. సెవెన్‌ స్టార్‌ హోటల్‌లోకి ప్రవేశించిన కస్టమర్‌ ఎలాంటి అనుభూతికి గురవుతాడో అలాంటి అనుభూతిని ఈ మల్టి ఫ్లెక్స్‌లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులు పొందుతారని నిర్వాహకులు అంటున్నారు. మొత్తంమీద హైదరాబాద్‌లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మల్టి ఫ్లెక్స్‌లలో ఎయంబి నిర్మాణం ఓ సంచలనానికి తెరతీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com