24 కిస్సెస్:రివ్యూ

- November 23, 2018 , by Maagulf
24 కిస్సెస్:రివ్యూ

నటీనటులు: అరుణ్ అదిత్, రావు రమేశ్, హెబ్బా పటేల్, సీనియర్ నరేశ్, అదితీ మ్యాకల్ తదితరులు
కెమెరా: ఉదయ్ గుర్రాల
ఎడిటర్: ఆలయం అనిల్
స్వరాలు: జాయ్ బరువ
నేపథ్య సంగీతం: వివేక్ ఫిలిప్
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
రచన, దర్శకత్వం: అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి 
విడుదల తేదీ: నవంబర్ 23, 2018

అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా '24 కిస్సెస్'. విడుదలకు ముందు టీజర్లో, ట్రైలర్లో ముద్దులతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి, సినిమా ఎలా వుంది? అసలు, ముద్దుల కథేంటి? రివ్యూ చదవండి!
కథ:

ఆనంద్ (అరుణ్ అదిత్) ఓ చిల్డ్రన్ ఫిల్మ్‌మేకర్‌. చిన్న పిల్లల సమస్యలు, పౌష్టిక ఆహారలోపం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు. చిన్న పిల్లలపై రెండు మూడు సినిమాలు తీశాడు. అప్పుడప్పుడూ మాస్ కమ్యూనికేషన్ కాలేజీలకు వెళ్లి ఫిల్మ్ మేకింగ్ క్లాసులు చెబుతాడు. ఓ కాలేజీకి వెళ్ళినపుడు శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం హద్దులు దాటి ముద్దులు, శృంగారం వరకూ వెళుతుంది. ఆనంద్‌ని శ్రీలక్ష్మి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆనంద్ ఏమో కలిసుందాం గానీ... పెళ్లి, పిల్లలు వద్దంటాడు. ఎందుకని? అతను నిజంగా శ్రీలక్ష్మిని ప్రేమించాడా? లేదా ఆమెపై మోజు పడ్డాడా? చిన్న పిల్లలను ఎంతో ప్రేమించే అతడు.. చిన్న పిల్లలపై సినిమాలు తీసే అతడు.. పెళ్లి ఎందుకు వద్దంటున్నాడు? పిల్లలు ఎందుకు వద్దంటున్నాడు? పెళ్లి, పిల్లలకు ఆనంద్ 'నో' చెబితే శ్రీలక్ష్మి ఏమంది? చివరికి ఏమైంది? అనేది సినిమా!

విశ్లేషణ:

పది పదిహేను నిమిషాల్లో సినిమా ముగుస్తుందనగా... హీరో అరుణ్ అదిత్‌తో రావు రామేశ్ ఓ డైలాగ్ చెబుతారు... 'ఇప్పటికైనా నీ కథేంటో క్లియర్‌గా చెప్పరా?' అని! అప్పటివరకూ థియేటర్‌లో ప్రేక్షకుల పరిస్థితీ అంతే! 'కథేంటో? క్లియర్‌గా లేదు' అంటుకుంటూ వుండాలి. సైక్రియాట్రిస్ట్‌ రావు రమేశ్‌కి హీరో అరుణ్ అదిత్ తన కథను ముక్కలు ముక్కలుగా చెబుతుంటాడు. శ్రీలక్ష్మికి, తనకు మధ్య జరిగిన ముద్దులు, ముచ్చట్ల గురించి అన్నమాట! హీరోయిన్‌తో ముద్దలు పెట్టిన హీరో, వెంటనే చిన్న పిల్లల సమస్యల గురించి లెక్చర్లు ఇస్తుంటాడు. అమ్మాయితో శృంగారం చేసేవాడు, అనాథల గురించి ఆలోచించకూడదని ఏ రాజ్యాంగంలోనూ రాయలేదు. ఎవరూ చెప్పలేదు. కానీ, రెండు విషయాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా దర్శకుడు చెప్పలేకపోయాడు. పెళ్లి, పిల్లలకు హీరో ఎందుకు వ్యతిరేకం?అనేది చివర్లో రావు రమేశ్ 'ఇప్పటికైనా నీ కథేంటో క్లియర్‌గా చెప్పరా?' అని అడిగినప్పుడు చెబుతాడు. అప్పటివరకూ ప్రేక్షకులకు ఆ ప్రశ్నలు పెద్ద పజిల్. అప్పటివరకూ సినిమా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది.

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ హీరోయిన్‌కి హీరో ముద్దులు పెట్టడం, ఆమెతో 'నువ్వంటే నాకిష్టం. కానీ, పెళ్లి చేసుకోను' అనడం తప్ప... కథ ఇంచు కూడా ముందుకు కదలదు. మధ్యలో చిన్న పిల్లల గురించి చెప్పిన సన్నివేశాలు తీసేసినా... ముద్దులను మాస్ ప్రేక్షకులు హర్షించేలా చూపించారా? అంటే అదీ లేదు. బహుశా... హీరో హీరోయిన్ మధ్య అధర చుంబనాలు, గాఢమైన ముద్దు సన్నివేశాలు వస్తే థియేటర్‌లో ప్రేక్షకులు విసుగు చేసిన సినిమా ఇదే అవుతుందేమో! దర్శకుడు అంత నిస్సారంగా తీశారు. సినిమా ప్రారంభంలో ముద్దుల్లో 24 రకాలు వున్నాయనీ, ఓ జంట 24 ముద్దులు పెట్టుకుంటే పెళ్లి చేసుకున్నట్టే అనీ, 'కిస్సెస్ ఆఫ్ లవ్' పుస్తకం గురించీ ఓ సన్నివేశంలో ఒక పాత్రధారి చేత దర్శకుడు చెప్పిస్తాడు. పోనీ, ముద్దుల్లో ఆ 24 రకాలేంటో సినిమాలో చూపించారా? అంటే.. అదీ లేదు. దర్శకుడిలో స్పష్టత కొరవడటంతో ప్రేక్షకులను విసిగించే సన్నివేశాలు సినిమాలో ఎక్కువయ్యాయి. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. మొదట్లో వచ్చిన రెండు మూడు పాటలు పర్వాలేదు. తరవాత వచ్చిన ప్రతి పాట పంటి కింద రాయిలా తగిలింది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ బావున్నాయి.

ప్లస్ పాయింట్స్:

అరుణ్ అదిత్ - హెబ్బా కెమిస్ట్రీ, ముద్దులు
మధ్య మధ్యలో రావు రమేశ్ పంచ్ డైలాగులు

మైనస్ పాయింట్స్:

కథ, కథనం, దర్శకత్వం
విసిగించిన సెంటిమెంట్ సన్నివేశాలు
దర్శకుడిలో కవితాత్మక ధోరణి మరీ ఎక్కువ కావడం
ఇటు శృంగారానికి, అటు సందేశానికి మధ్య సఖ్యత లోపించడం

నటీనటుల పనితీరు:

అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. హెబ్బా డీ-గ్లామర్ పాత్రలో, అరుణ్ అదిత్ కొన్ని సన్నివేశాల్లో గుబురు గడ్డంతో కనిపించాడు. ముద్దులు పెట్టుకోవడంలో ఇద్దరూ పోటీ పడ్డారు. కానీ, ఇద్దరి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. రావు రమేశ్ నటన, పంచ్ డైలాగులు ఆకట్టుకుంటాయి. మోడరన్ ఫాదర్‌గా సీనియర్ నరేశ్ హుందాగా నటించాడు. హెబ్బా పటేల్ తమ్ముడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కామెడీ టైమింగ్ బావుంది. అదితీ మ్యాకల్ గ్లామర్ పాత్రలో, అందాలను ఆరబోస్తూ కనిపించింది.

చివరగా:

టీజర్లు, ట్రైలర్లు, పాటల్లో చూపించిన ముద్దులు చూసి సినిమాకు వెళితే మోసపోయే ప్రమాదం వుంది. సినిమా విడుదలకు ముందు దర్శకుడు చెప్పినట్టు ముద్దులను మించిన కథ సినిమాలో వుంది. అయితే... అది ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. విసిగిస్తుంది.

 

--మాగల్ఫ్ రేటింగ్ 1/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com