పార్క్ హయత్‌లో చంద్రబాబు, రాహుల్ సమావేశం

- November 29, 2018 , by Maagulf
పార్క్ హయత్‌లో చంద్రబాబు, రాహుల్ సమావేశం

పార్క్ హయత్‌లో చంద్రబాబు, రాహుల్ సమావేశం అయ్యారు. అల్పాహారవిందులో తాజా రాజకీయ వ్యూహంపై చర్చించారు. ముఖ్యంగా బీజేపీయేతర కూటమి ప్రయత్నాలపై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మహాకూటమిని గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా మాట్లాడారు. ఇప్పటికే రాహుల్‌తో కలిసి ఖమ్మం సభలోనూ, సనత్‌నగర్, నాంపల్లిలోనూ చేసిన రోడ్‌షోలకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. మేనిఫెస్టో హామీలను జనంలోకి తీసుకెళ్లే అంశంపై చర్చించారు.

అటు, రాహుల్‌తో భేటీకి ముందు మీడియా యాజమాన్యాలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి కేసీఆర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. తనకు తెలంగాణలో తిరిగే హక్కు లేదని KCR ఎలా అంటారని ప్రశ్నించారు. హైదరాబాద్ రావడానికి మోడీ, రాహుల్‌కు ఉన్న హక్కు తనకు ఎందుకు ఉండదని, కేసీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

తెలుగువారి హక్కుల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతుందని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్లాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. మోడీ కనుసన్నల్లో కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులకు నాంది పలికిందే తాము అయినప్పుడు వాటిని ఎందుకు అడ్డుకుంటాని, ఈ అంశాన్ని అంతా గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాకూటమి అధికారంలోకి వచ్చాక చర్చల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు లేకుండా చూసుకుంటామని అన్నారు. పోటీ చేసే సీట్లు ముఖ్యం కాదని, అన్ని చోట్లా గెలవడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. తాము 13 చోట్లా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com