తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌

- November 29, 2018 , by Maagulf
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌

తెలంగాణ:తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ రఫ్పాడించారు. టిఆర్‌ఎస్‌ బాస్‌ కేసీఆరే‌ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. కేసీఆర్‌కు.. టిఆర్‌ఎస్‌ పార్టీకి కొత్త కొత్త అర్థాలు చెప్పారు. టిఆర్‌ఎస్‌-బీజేపీ-ఎంఐఎం మూడూ ఒక్కటేనని.. ఏ పార్టీకి ఓటేసినా ఒక్కటే అని తీవ్ర ఆరోపణలు చేశారు. వరుస సమావేశాలు, రోడ్‌ షోలతో ప్రజా కూటమి ప్రచారాన్ని ఆయన హోరెత్తించారు.

తెలంగాణ పొలిటికల్‌ ఫైట్‌ పీక్‌కు చేరింది. అగ్రనేతలంతా ప్రచార బరిలోకి దిగడంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. మొన్నటి వరకు అధికార పార్టీతో పోలిస్తే కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్‌.. ఇప్పుడు దూకుడు పెంచింది. ఎ.ఐ.సి.సి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వయంగా ప్రచార బరిలోకి దిగడంతో కాంగ్రెస్‌ కేడర్‌, అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగింది. వారి అంచనాలకు తగ్గట్టే రాహుల్‌ సైతం ఎక్కడా తగ్గకుండా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

గులాబి బాస్‌ కేసీర్‌ పేరుకు కొత్త నిర్వచనం చెప్పారు రాహుల్‌ గాంధీ.. కేసీఆర్‌ అంటే ఖావో కమీషన్‌ రావు అని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయినప్పుపడు సర్‌ప్లస్‌ స్టేట్‌గా తెలంగాణను కాంగ్రెస్‌ అప్పచెబితే.. కేసీఆర్‌ దాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు.

తెలంగాణలో కేసీఆర్‌, కేంద్రంలో మోడీ ఇద్దరూ ఒకలాగే పరిపాలిస్తున్నారన్ని రాహుల్‌ ఆరోపించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా దోచుకోవడంలో ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల కేసీఆర్‌ సరైన వ్యాఖ్యలే చేశారని.. ఎన్నికల్లో ఓడిపోయి కచ్చితంగా ఫౌం హౌస్‌కే పరిమితం అవుతారని రాహుల్‌ జోస్యం చెప్పారు.

ప్రాజెక్టులు రీ డిజైన్‌ పేరుతో కేసీఆర్‌ కోట్లు దోచుకుంటున్నారని. తెలంగాణ ప్రజల సంపదను దోచిపెట్టి తన కుటుంబం ఖాతాలో వేసుకుంటున్నారని రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

టిఆర్‌ఎస్‌ పార్టీలో ఒక ఎస్‌ మిస్సైందని రాహుల్‌ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అంటూ కొత్త అర్థం చెప్పారు. బీజేపీ -టిఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందాన్ని బయటపెడతానన్నారు రాహుల్‌. మొదట తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి.. తరువాత ఢిల్లీలో మోడిని గద్దె దింపడమే తమ కూటమి లక్ష్యమన్నారు రాహుల్‌..

గురువారం ఉదయాన్నే ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు, విద్యార్థులతో రాహుల్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేట్ విద్యాసంస్థలకు న్యాయం చేస్తామన్నారు. యువతకు ఏం కావాలో కాంగ్రెస్‌కు మాత్రమే తెలుసన్నారు.

ఇలా రెండో రోజు సైతం విరామం లేకుండా రాహుల్‌ పర్యటన కొనసాగింది. హైదరాబాద్‌, భూపాలపల్లి, ఆర్మూర్‌, పరిగి సభల్లో పాల్గొన్నారు. అలాగే రోడ్‌ షోలోనూ పాల్గొని ప్రజా కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.. మళ్లీ డిసెంబర్‌ 3న రాహుల్‌ తెలంగాణ ప్రచారానికి రానున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com