హెచ్చరిక.. మరో భారీ భూకంపం

- December 02, 2018 , by Maagulf
హెచ్చరిక.. మరో భారీ భూకంపం

హిమాలయ ప్రాంతానికి మరో భారీ భూకంపం ముప్పు పొంచి ఉంది.. ఈ పర్వతాల భూపొరల్లో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందని.. అది ఏ క్షణమైనా వెలువడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి సబంధించి బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌లో భూకంప శాస్త్రవేత్తగా ఉన్న సిపీ రాజేంద్రన్‌ బృందం ఓ నివేదికను విడుదల చేసింది. మధ్య హిమాలయాల ప్రాంతంలో ఎప్పుడైనా 8.5 తీవ్రతతో భూకంపం రావచ్చని నివేదికలో పేర్కొన్నారు.

భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. పశ్చిమ నేపాల్‌లోని మోహనఖోలా, ఉత్తరాఖండ్‌లోని ఛోర్‌గలియా ప్రాంతంలో భూప్రకంపనలను పరిశీలించిన తరువాత.. వాటితో పాటు ఇతర డేటాబేస్‌లు, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇచ్చిన మ్యాప్‌లు.. ఇస్రో పంపిన కార్టోశాట్‌–1 చిత్రాలు, గూగుల్‌ ఎర్త్‌ ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. 2004లో సునామీ రాకను కచ్చితంగా అంచనా వేసిన పుణెకు చెందిన భూకంప శాస్త్రవేత్త అరుణ్‌ బాపట్‌ స్పందిస్తూ.. ఈ ఏడాది చివర్లో లేదా 2019 ఆరంభంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో జనసాంద్రత క్రమంగా పెరుగుతున్నందున ఇలాంటి ప్రకృతి విపత్తు సంభవిస్తే నష్టం ఊహకు అందదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పెనుభూకంపాన్ని తట్టుకునేవిధంగా కట్టడాలు నిర్మించకపోవడం, ప్రజలను అధికారులు సిద్ధం చేయకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్త రాజేంద్రన్‌ అన్నారు. ఇప్పుడు హిమాలయాల ప్రాంతంలో 8.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే నేపాల్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే అంశంపై పరిశోధనలు జరుపుతున్న అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త రోజర్‌ బిల్హమ్‌ ఈ విషయమై స్పందిస్తూ.. హిమాలయాల్లోని తూర్పు అల్మోరా నుంచి నేపాల్‌లోని పోకరా ప్రాంతం మధ్యలో భూపొరల్లో తీవ్రమైన ఒత్తిడి నెలకొందన్నారు. ఈ అధ్యయనం కోసం 36 జీపీఎస్‌ స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com