మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా.. మరేం ఫరవాలేదు.. ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్ ఉందిగా..

- December 06, 2018 , by Maagulf
మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా.. మరేం ఫరవాలేదు.. ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్ ఉందిగా..

అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ నాయకుడు వస్తే బావుంటుంది. కొద్దో గొప్పో ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటాడు. సామన్యుల గురించి ఆలోచిస్తాడు.. సమస్యలు కాస్తైనా మెరుగు పడతాయని ఆశ. ఎన్నికల వేళ ఎవరినోట విన్నా ఇలాంటి మాటలే.

మరి అందుకోసం మన అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకుని మనకు మేలు చేస్తాడనుకున్న నాయకుడికి ఓటు వేయాలి. ఆ.. మన ఒక్క ఓటు పడకపోతే ఏమవుతుందిలే. అయినా ఏ ప్రభుత్వం వచ్చినా మన బతుకులు మారతాయా ఏంటి. ఎవరు వచ్చినా చేసేది ఏం లేదు అని చదువుకున్న వారు సైతం పలికే మాటలకి ఇక స్వస్తి చెప్పండి.

ఒకే ఒక్క ఓటు కూడా మేటరేనండి. అందుకే మంచి ప్రజాస్వామ్యం కావాలనుకున్న మనందరం ఓటేద్దాం. మంచి నాయకుడ్ని ఎన్నుకుందాం. మన ఓటుతో, మన చేత ఎన్నుకోబడిన నాయకుడు అధికారం చేపట్టి అయిదేళ్లు పాలించడానికి సిద్ధమవుతారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చేసిన వాగ్ధానాలు, పలికిన ప్రగల్భాలను నేరవేర్చేదాకా ప్రశ్నిద్దాం. అందుకే ఓటు హక్కుని వినియోగించుకుందాం. బాధ్యతగల పౌరులుగా ప్రజాస్వామ్యంలోని ప్రతి ఒక్కరినీ మేల్కొలుపుదాం.

ఇందుకోసం ఓటర్ స్లిప్‌లు అందని వారు ‘నా ఓటు’, ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం ఆ యాప్‌లోకి వెళ్లి పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే ఓటరు జాబితా ముద్రిత ఫారం వస్తుంది. అందులో మీ ఫొటో, ఇతర వివరాలతో ఉన్న ముద్రిత ఫారాన్ని ప్రింట్ తీయించుకుని ఓటు హక్కు వినియోగించుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్ తెలిపారు.

బీఎల్‌ఓలు గుర్తించలేకపోవడం, స్లిప్‌లో అడ్రస్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో హైదరాబాద్ జిల్లాలోనే 15 శాతం మంది ఓటర్లకు స్లిప్‌లు అందలేదు. జిల్లాలో మొత్తం 40 లక్షల 57 వేల 488 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6 లక్షల మందికి చీటీలు పంపిణీ చేయలేకపోయినట్లు అధికారులు ప్రకటించారు.

ఓటు ఒక చోట ఉండడం, నివాసం మరో చోటికి మారడం, ప్రాంతం గుర్తించలేకపోవడం వంటి కారణాలతో చీటీలు అందించలేకపోయారు. ఇటువంటి వారంతా తమ స్మార్ట్ ఫోన్‌లో యాప్ డౌన్‌‌లోడ్ చేసుకుని ఓటరు స్లిప్ పొందవచ్చని ఎన్నికల అధికారి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com