ఆధార్‌ డేటాను ఉపసంహరించుకొనే వెసులుబాటు!

- December 06, 2018 , by Maagulf
ఆధార్‌ డేటాను ఉపసంహరించుకొనే వెసులుబాటు!

ప్రైవేటు సంస్థలు ఆధార్‌ డేటా ఉపయోగించుకొనేందుకు వీలు కల్పిస్తోన్న ఆధార్‌ చట్టంలోని సెక్షన్‌ 57ను కొట్టేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థలు.. వ్యక్తుల ఆధార్‌ డేటాను తీసుకోవడం రాజ్యాంగ బద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆధార్‌ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. సుప్రీం ధర్మాసనం ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. కొందరు వ్యక్తులు తమ ఆధార్‌ సంఖ్య, బయోమెట్రిక్‌ వంటి వివరాలను గతంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అయితే ఈ వివరాలను వెనక్కి తీసుకునే వెసులుబాటుపై ప్రభుత్వం సవరణలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. 18 ఏళ్ల వయసు దాటినవారికి అంతకుముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆధార్‌ వివరాలను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది. కాగా సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ ను అనుసంధానించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు సమయంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పాన్ కార్డుకు మాత్రం ఆధార్‌ అనుసంధానాన్ని సమర్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com