తెలంగాణ:ఓట్ల కోసం సెలవిస్తే..వీకెండ్ పార్టీలకు వెళ్లారు

- December 08, 2018 , by Maagulf
తెలంగాణ:ఓట్ల కోసం సెలవిస్తే..వీకెండ్ పార్టీలకు వెళ్లారు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. చెదరుమదురు ఘటనలు మినహా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ మొత్తం ప్రశాంతంగానే జరిగింది. ఈసీ పకడ్భందీ ఏర్పాట్లతో ప్రధాన ఘట్టం పూర్తైంది. ఇక నేతల భవితవ్యం ఈవీఎంలలోకి చేరింది. నిన్న ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది. ఇక సమస్యాత్మక ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసింది. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. 67 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఈ నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి.

ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. అటు.. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులు చెప్పడంతో గందరగోళం నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్‌ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులొచ్చాయి. పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల వివిధ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఖమ్మం జిల్లా మధిరలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91 శాతం పోలింగ్‌ నమోదైంది. పాలేరు, మనుగోడు, నర్సంపేటలో 90 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా మలక్‌పేట నియోజకవర్గంలో 40 శాతం పోలింగ్‌ నమోదైంది. అటు.. మహానగరంలో పోలింగ్‌ శాతం నిరుత్సాహ పరిచింది. శుక్రవారంతో పాటు వీకెండ్‌ కావడంతో చాలా మంది సెలవులు తీసుకుని కుటుంబాలతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో జిల్లాలో 50 శాతం, మేడ్చల్‌ జిల్లాలో 54 శాతం పోలింగ్‌ నమోదైంది.

పేర్లు గల్లంతై.. ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వారికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ క్షమాపణలు కోరారు. మళ్లీ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. ఎన్నికలు విజయవంతంగా జరగడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎన్నిక సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రానందున రీ–పోలింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని రజత్‌ కుమార్‌ తెలిపారు. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించామన్నారు. అక్కడ నిరంతరం పోలీసు గస్తీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ వేడి రాజేశాయి. జాతీయ స్థాయి ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ దాదాపు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. కేసీఆర్‌కు ఎదురులేదని టైమ్స్‌-నౌ చెప్పింది. టీఆర్ఎస్‌ 66 స్థానాలు గెలుచుకుంటుందని స్పష్టం చేసింది. కూటమికి 37, బీజేపీకి 7, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని చెప్పింది. మరోవైపు ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ తెలంగాణలో ప్రజా కూటమి గెలుస్తుందన్నారు. కూటమి సుమారు 65 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. టీఆర్‌ఎస్‌కు 25 నుంచి 45 లోపే సీట్లు వస్తాయని తెలిపారు. ఇక సర్వేలన్నీ గుబులు రేపుతుండటంతో అభ్యర్ధులు, ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరపడాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com