తెలంగాణ:టీఆర్ఎస్ గెలుపు.. కారణాలు ఇవే..

- December 11, 2018 , by Maagulf
తెలంగాణ:టీఆర్ఎస్ గెలుపు.. కారణాలు ఇవే..

హైదరాబాద్:కేసీఆర్ వ్యూహం ఫ‌లించింది. కారును జోరుగా న‌డ‌ప‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. కారును రాంగ్ రూట్‌లోకి మ‌ళ్లిద్దామ‌నుకున్న ప్రజా కూట‌మిని ప్రజ‌లు ఆద‌రించ‌లేదు. టీఆర్ఎస్ గ‌త ఎన్నిక‌ల కంటే ఈసారి బంప‌ర్ మెజార్టీ సాధించింది. ఈ ఘ‌న విజ‌యం వెనుక కేసీఆర్ వ్యూహం ఉంది. ఆయ‌న చేప‌ట్టిన సంక్షేమ ప‌థ‌కాలు, చేప‌ట్టిన అభివృధ్ధి ప‌థ‌కాలు ప్రజ‌ల ఆద‌ర‌ణ చూర‌గొన్నాయి. వీటిని ఓట్ల రూపంలోకి మ‌లుచుకోవ‌డంలో టీఆర్ఎస్ స‌క్సెస్ అయింది.

టీఆర్ఎస్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయి. ముంద‌స్తుకు వెళ్తున్నట్లు ప్రక‌టించిన వెంట‌నే కేసీఆర్ 105 మంది జాబితాను ప్రక‌టించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌నే అభ్యర్థులుగా ప్రక‌టించి ప్రత్యర్థి పార్టీల‌కు స‌వాలు విసిరారు. కానీ త్వరగా సీట్ల స‌ర్దుబాటు కుద‌ర‌క‌పోవ‌డం, చివ‌రి నిమిషం వ‌ర‌కు అభ్యర్థులను ప్రక‌టించ‌క‌పోవ‌డం ప్రజా కూట‌మికి మైన‌స్ అయింది. మ‌రోవైపు ప్రచారం విష‌యంలోనూ టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా, ప్రణాళికాబ‌ద్ధంగా వ్యవ‌హ‌రించింది. టీఆర్ఎస్‌లో స్టార్ బ్యాట్స్ మ్యాన్ కేసీఆరే. ప్రచార‌మంతా కేసీఆర్ సెంట్రిక్‌గా సాగింది. కానీ ప్రజా కూట‌మిలో ఇలాంటి ప‌రిస్థితి లేదు. ఎవ‌రికివారే యమునా తీరే అన్నట్లు వ్యవ‌హ‌రించారు కూట‌మి నేత‌లు. ప్రచారం విష‌యంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబునే న‌మ్ముకున్నారు కూట‌మి నేత‌లు. ఆయ‌న ప్రచారం చేసిన ప్రతి చోట ఇంత‌వ‌ర‌కు చేప‌ట్టిన అభివృధ్ధి, ప్రవేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను బ‌లంగా ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంలో స‌క్సెస్ అయ్యారు.

2014లో సీఎంగా బాధ్యత‌లు చేప‌ట్టిన త‌ర్వాత కేసీఆర్ తెలంగాణ స‌మ‌స్యల‌పై దృష్టిపెట్టారు. తాగు, సాగు నీటిపై ఫోక‌స్ చేశారు. సంక్షోభంలో ఉన్న వ్యవ‌సాయాన్ని, రైతుల‌ను ఆదుకోవాల‌ని ప‌లు సంక్షేమ ప‌థ‌కాలు ప్రవేశ‌పెట్టారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంట‌ల‌పాటు ఉచిత విద్యుత్తు… ప‌థ‌కాలు అన్నదాత‌ల‌కు మేలు చేశాయి. ప్రచారంలో భాగంగా ప్రతీ నియోజ‌క‌వ‌ర్గాన్ని తిరిగిన కేసీఆర్… ప్రతి స‌భ‌లోనూ వీటినే ప్రధానంగా ప్రస్తావించారు. రైతు సంక్షేమానికి త‌మ ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రాధాన్యతను ఇస్తోందో వివ‌రించే ప్రయ‌త్నం చేశారు. గ‌త ప్రభుత్వాలు, పాల‌కులు వ్యవ‌సాయాన్ని ఎంత‌గా నిర్లక్ష్యం చేశారో విడ‌మ‌రిచి చెప్పడంలో కేసీఆర్, ఇత‌ర పార్టీ శ్రేణులు స‌క్సెస్ అయ్యారు. చివ‌రికి ఈ ప‌థ‌కాలను ఓట్ల‌లోకి మార్పు చేయ‌డంలో విజ‌యం సాధించింది టీఆర్ఎస్.

ఈ ఎన్నిక‌ల్లో కేసీఆరే ప్రధాన ఆక‌ర్షణ‌. కొంత‌మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై వ్యతిరేక‌త ఉన్నా… కేసీఆర్ ప‌ట్ల ఉన్న సానుకూల‌త టీఆర్ఎస్ కు ప్లస్ అయింద‌ని చెప్పక తప్పలేదు. రైతుబందు, రైతు బీమా, వ్యవ‌సాయానికి ఉచిత విద్యుత్తుతోపాటు కంటి వెలుగును కేసీఆర్ ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లారు. ఇక వృద్ధ్యాప్య, వితంతు పించ‌న్లు, బీడీ కార్మికుల‌కు భృతి, క‌ల్యాణ ల‌క్ష్మి, షాదీ ముబార‌క్, గ‌ర్భిణిల‌కు కేసీఆర్ కిట్లు వంటి సంక్షేమ ప‌థ‌కాలు పేద‌ల‌కు ప్రత్యక్ష్యంగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. దీంతో స్థానిక అభ్యర్థిపై వ్యతిరేక‌త ఉన్నా… దాన్ని ప‌క్కన‌పెట్టి ల‌బ్దిదారులంతా కేసీఆర్ మ‌ళ్లీ సీఎం కావాల‌నే ఉద్దేశంతో గంప‌గుత్తగా ఓట్లేసిన‌ట్లు ఈ ఫ‌లితాలు వెల్లడిస్తున్నాయి. ప్రజ‌లు గుర్తుపెట్టుకుంది రెండే రెండు. ఒక‌టి కేసీఆర్, మ‌రోటి కారు గుర్తు. అందుకే వృద్ధులు, రైతులు, మ‌హిళ‌లు… ఇలా అన్ని వ‌ర్గాలు టీఆర్ఎస్ కు ప‌ట్టం క‌ట్టాయి.

కేసీఆర్ స‌ర్కారు చేప‌ట్టిన కీల‌క అభివృద్ధి ప‌థ‌కాలు కూడా ప్లస్ అయ్యాయి. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌, కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టులు, ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డం వంటివి టీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యాయి. డ‌బుల్ బెడ్ రూం ప‌థ‌కం మైన‌స్ అవుతుంద‌ని భావించినా… మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే డ‌బుల్ బెడ్ రూం స్కీమ్ ను పూర్తిచేస్తామ‌ని ఇచ్చిన హామీ, పించ‌న్లు రెట్టింపు చేయ‌డం, నిరుద్యోగుల‌కు భృతి వంటి హామీలు టీఆర్ఎస్ కు ప్లస్ అయ్యాయి. పించ‌న్లు, నిరుద్యోగ భృతి రెట్టింపు ఇస్తామ‌న్నా ప్రజా కూట‌మిని ఓట‌ర్లు విశ్వసించ‌లేక‌పోయారు. ఎందుకంటే సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎలాంటి ఆటంకం లేకుండా అమ‌లు చేయ‌డంతో కేసీఆర్ పై జ‌నంలో న‌మ్మకాన్ని పెంచాయి. ఈ న‌మ్మకం ఓట్ల రూపంలోకి మారింది. సీట్లతోపాటు ఓట్ల శాతం కూడా టీఆర్ఎస్ కు భారీగా పెరిగేలా చేసింది. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ బంపర్ మెజార్టీ సాధించ‌డానికి కేసీఆర్ వ్యూహం, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు ఉప‌యోగ‌ప‌డిన‌ట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com