కేటీఆర్ కు పట్టాభిషేకం

- December 17, 2018 , by Maagulf
కేటీఆర్ కు పట్టాభిషేకం

 

తెలంగాణ సాధన కోసం ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్. ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. టీఆర్ఎస్ అధినేత తన ప్రాణాలు సైతం లెక్కబెట్టకుండా తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష..సకల జనుల సమ్మె, పల్లేపట్నం అనే తేడా లేకుండా ప్రతినోట జై తెలంగాణ నినాదాలతో అప్పటి యూపిఏ ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ఆయన తనయుడు కేటీఆర్ ఐటి మినిష్టర్ గా తన పదవీ బాధ్యతలు సమర్థవంతంగా వహిస్తున్నారు. 

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ కే జై కొట్టారు తెలంగాణ ప్రజలు. రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాద్యతలు చేపట్టారు. అయితే టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్‌.. సోమవారం బాధ్యత లు స్వీకరించారు. ఉదయం 11.55 గంటలకు తెలంగాణ భవన్‌లో ఆయన బాధ్యతలు చేబట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, దానం నాగేందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా..బంగారు తెలంగాణను సాధించుకోవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను మరోసారి గెలిపించిన ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండేందుకు కృషి చేస్తానని కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు.
 
టీఆర్ఎస్ అంటే 'తిరుగులేని రాజకీయ శక్తి' అని కొత్త నిర్వచనాన్ని చెప్పిన ఆయన, గడచిన ఎన్నికల్లో పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి కలనూ నిజం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు తాను హామీ ఇస్తానని చెప్పారు.
 
అంతే కాదు టీఆర్ఎస్ మరో పాతిక సంవత్సరాలు అజేయ శక్తిగా నిలిపేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని కేటీఆర్ అన్నారు. తన తండ్రి, రాష్ట్ర పెద్ద కేసీఆర్ తనపై చాలా బాధ్యతను ఉంచారని, దాన్ని సక్రమంగా నెరవేర్చేందుకు ప్రాణమున్నంత వరకూ కృషి చేస్తానని కేటీఆర్ తెలిపారు.
 
ఇక అన్ని జిల్లాలు, మండలాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మాణం చేస్తామని, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలి వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com