డిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం స్థలం ఎంపిక...

- January 07, 2019 , by Maagulf
డిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం స్థలం ఎంపిక...

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇక జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వివిధ జాతీయ పార్టీల మాదిరిగానే దేశ రాజధాని డిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆ పార్టీ అదిష్టానం అందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఇవాళ టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఇవాళ ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రం సమర్పించారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు 17 మంది వున్నారు. కాబట్టి చట్ట ప్రకారం తమ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు డిల్లీలో 1000 చదరపు మీటర్ల స్థలం వస్తుందని ప్రధానిని తెలియజేశారు.
ఇప్పటికే తమ పార్టీ ఎంపీల మంతా కలిసి డిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం అనువైన ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి ప్రధానికి తెలియజేశారు. తాము కోరినట్లుగా అర్బన్ డెవలప్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారం రాజేంద్ర ప్రసాద్ రోడ్ లో ఖాళీగా ఉన్న 1000 చదరపు మీటర్లు స్థలం కేటాయించాలని కోరినట్లు జితేందర్ రెడ్డి తెలిపారు.

తమ వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు జితేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాము కోరిన స్థలాన్ని కేటాయిస్తే త్వరలో అన్ని వసతులతో కూడిన కార్యాలయాన్ని నిర్మించుకుంటామని ఆయన తెలిపారు.

పెడరల్ ప్రంట్ పేరుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీల నేతలు, సీఎంలతో సమావేశమవుతున్నారు. ఇలా కేసీఆర్ ఎక్కువగా డిల్లీకి వెళుతున్నారు. అయితే అక్కడ అధికారిక సమావేశాలు జరపడానికి, ఇతర పార్టీల నాయకులను కలవడానికి టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి కార్యాలయం లేదు. దీంతో హైదరాబాద్ లో తెలంగాణ భవన్ మాదిరిగి డిల్లీలో కూడా ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకోసం ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు అందుకోసం ప్రధానిని కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com