కుంభ్ మేళ: ఎన్ని ప్రత్యేకతలు సంతరించుకుందో మీరే చదవండి

- January 08, 2019 , by Maagulf
కుంభ్ మేళ: ఎన్ని ప్రత్యేకతలు సంతరించుకుందో మీరే చదవండి

ప్రయాగ్‌రాజ్: ఈ ఏడాది జరగబోయే కుంభమేళాకు ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధమవుతున్నది. కోట్లాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుక కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుంభమేళా కోసం రూ.2800 కోట్లు కేటాయించడం విశేషం. కుంభమేళా నిర్వహణకు మొత్తం రూ.4300 కోట్లు ఖర్చు కానుండగా.. మిగిలిన మొత్తం ఇతర నిధుల రూపంలో అందనున్నాయి. ఈ కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ పక్కనే ఓ తాత్కాలిక నగరాన్ని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన తాత్కాలిక నగరం కావడం విశేషం. ఈ నగరంలో 250 కిలోమీటర్ల మేర రోడ్లు, 22 పాంటూన్ బ్రిడ్జీలు నిర్మించారు. 40 వేల ఎల్‌ఈడీ బల్బులను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. రూ.247 కోట్లతో ప్రయాగ్‌రాజ్‌లో రెండు కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో రూ.116 కోట్లతో చేపట్టిన ఓ సెంటర్ పూర్తయింది. మొత్తం 20 వేల మంది పోలీసులను భద్రత కోసం నియమించారు. ఈ పోలీసులెవరికీ మందు తాగే అలవాటు లేదు. పైగా అందరూ కేవలం శాకాహారం మాత్రం తింటారని యూపీ డిఐజీ కేపీ సింగ్ వెల్లడించారు. జనవరి 15 నుంచి మొదలయ్యే ఈ కుంభమేళాకు సుమారు 12 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 192 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా రానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com