మహాకూటమి ఏర్పాట్లను ముమ్మరం చేసిన చంద్రబాబు

- January 09, 2019 , by Maagulf
మహాకూటమి ఏర్పాట్లను ముమ్మరం చేసిన చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది మహాకూటమి ఏర్పాట్లు కసరత్తును ముమ్మరం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబర్‌ 9న ఢిల్లీలో సుమారు 28 రాజకీయ పార్టీలతో జరిగిన భేటీకి కొనసాగింపుగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ అనుసరించాల్సిన వ్యహాంపై రాహుల్ తో చర్చించారు. ఎవరు ప్రధాని అనేది ముఖ్యం కాదు.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలముందుకు నిర్ధిష్ట లక్ష్యంతో వెళ్లాలని నిర్ణయించినట్లు ఇరువురు నేతలు నిర్ణయించినట్లు సమాచారం.

రాహుల్‌తో భేటీ అనంతరం ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. తరువాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు మంతనాలు జరిపారు.. వారితో ఈ నెల 19న కోల్‌కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై నేతలతో చర్చించారు. అక్కడ జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. అందరు కలిసి జాతీయ స్థాయిలో పనిచేయాల్సి ఉందని వారితో బాబు అన్నట్లు సమాచారం.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎజెండాను పూర్తిస్థాయిలో ఖరారు చేసే లక్ష్యంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు.. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి? జనవరి 19 తర్వాత ఎక్కడ ఎలాంటి సమావేశాలు పెట్టాలి? ఎవరు ఎక్కడ హాజరు కావాలి? ఆయా చోట్ల ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలేమిటి? తదితర అంశాలపై ఆయా నేతలతో బాబు చర్చించనున్నట్టు తెలుస్తోంది.

జాతీయ నేతలతో చర్చల తర్వాత ఎంపీలతో చంద్రబాబు భేటీ అయ్యారు.. బీజేపీ వ్యతిరేక కూటమి భవిష్యత్‌ వ్యూహంపై చర్చించారు.. అటు ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ముఖ్యం కాదని జాతీయ స్థాయిలో కలిసి పనిచేయడమే ప్రధానమని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. పొత్తు విషయం చంద్రబాబుకే రాహుల్ గాంధీ వదిలేశారని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com