ఒపెక్‌ అమెరికాకి వ్యతిరేకం కాదు

- January 13, 2019 , by Maagulf
ఒపెక్‌ అమెరికాకి వ్యతిరేకం కాదు

అబుదాబి: ఒపెక్‌ అమెరికాకు ఏమాత్రం వ్యతిరేకం కాదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఇంధన శాఖ మంత్రి సుహాయిల్‌ అల్‌ మజ్రోయి పేర్కొన్నారు. తమ రెండు దేశాలు పరస్పరం అభినందించుకుంటున్నాయని శనివారం ఆయన దుబాయ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. 2018లో చమురు బ్యారెల్‌ ధర సగటున 70 డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. 1.2 మిలియన్‌ బ్యారెళ్ల మేరకు చమురు ఉత్పత్తిలో కోత విధిస్తే ధర పతనం కాకుండా అడ్డుకోవచ్చని ఆయన తెలిపారు.

ఈ నెల మొదట్లో ధర కొంత దిద్దుబాటుకు గురికావచ్చని అంచనా వేశారు. 2019 మధ్యలో చమరు ధర లక్ష్యాన్ని చేరుకొంటుందని యూఏఈ ఇంధన శాఖ మంత్రి సుహాయిల్ అల్ మజ్రోయి అన్నారు. ఇప్పటికే ఒపెక్‌లో మినహాయింపులు పొందిన వెనుజువెలా, లిబియా, ఇరాన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచబోవని ఆశాభావం వ్యక్తం చేశారు.
2019లో చమురు ధర 60 నుంచి 80 డాలర్ల మధ్యలో కదలాడవచ్చని మహ్మద్‌ అల్‌ రుహ్మి పేర్కొన్నారు. 2019లో చమురు ధరలు పతనం కాకుండా ఒపెక్‌, రష్యా నేతృత్వంలోని సహచర దేశాలు రోజుకు 1.2 మిలియన్‌ బారెళ్ల చమురు ఉత్పత్తిపై కోత విధించాలని నిర్ణయించాయి.

ఒపెక్, రష్యా సారథ్యంలోని నాన్ ఒపెక్ దేశాల నిర్ణయంపై ట్రంప్‌ స్పందించారు. ఒపెక్‌ , సహచర దేశాల నిర్ణయం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి తగ్గించుకోవాలన్న నిర్ణయాన్ని ఒపెక్ సభ్య దేశాలతోపాటు రష్యా తదితర దేశాలు ఉపసంహరించుకోవాలని కోరినా కోరుకోలేదు.

పెట్రోలియం ఉత్పత్తిని తగ్గించాల్సిన అవసరం తమకు లేదని ఒపెక్, నాన్ ఒపెక్ దేశాలు పేర్కొన్నాయి. 2019లో పెట్రోలియం ఉత్పత్తి తగ్గించే విషయమై వచ్చే ఏప్రిల్ నెలలోపు సమావేశం కానవసరం లేదన్నాయి.

పెరుగుతున్న పెట్రో భారం
పెట్రో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తిరిగి విజృంభిస్తుండటంతో.. ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడుతున్నది. ఈ క్రమంలోనే శనివారం లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్‌లో 20 పైసలు ఎగిసి రూ.73.47ను చేరింది. డీజిల్ ధర కూడా 32 పైసలు ఎగబాకి రూ.68.60ను తాకింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ.69.26 వద్దకు, డీజిల్ 29 పైసలు పెరిగి రూ.63.10 వద్దకు చేరాయి. ఇక గత మూడు రోజుల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 80 పైసలు, డీజిల్ 94 పైసలు చొప్పున పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com