మీకు రూ.25 లక్షలు కావాలా? అయితే రోజుకు రూ.30 దాయండి.. ఈ లెక్కేంటంటే..

- January 16, 2019 , by Maagulf
మీకు రూ.25 లక్షలు కావాలా? అయితే రోజుకు రూ.30 దాయండి.. ఈ లెక్కేంటంటే..
పెట్టుబడులు చేయడంలో ప్రాథమికంగా నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే.. ఎంత తొందరగా పొదుపు చేయడం మొదలుపెడితే.. ఆర్థిక లక్ష్యాలను అందుకోడం అంత సులభం అవుతుంది.
 
కోటీశ్వరుడు కావాలనే కోరిక దాదాపు అందరికీ ఉంటుంది. కానీ అలా అయేందుకు నిర్ణీత సమయం అవసరం అవుతుంది. ఈ కలను నెరవేర్చుకునేందుకు ఎంతో ఓపిక కూడా అవసరం. కష్టపడి సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి చేయడమే కాదు.. ఓపికగా ఎదురుచూడాలి కూడా. అయితే పెద్ద లక్ష్యాలను అందుకోవడం అసాధ్యమైన విషయం ఏమీ కాదు.
 
7 సున్నాలు ఉన్న అంకెల ఆస్తి(కోటి)ని మీ ఖాతాలో చూసుకోవాలంటే ముఖ్యంగా మూడింటిని ఎల్లపుడూ గుర్తుంచుకోవాలి.
 
1) నెలవారీ/ఏటా పెట్టుబడి చేసే మొత్తం
2) రాబడి శాతం
3) కాంపౌండింగ్ శక్తిని తెలుసుకోవడం
 
1. నెలవారీ/ఏటా పెట్టుబడి చేసే మొత్తం
రేపు బాగుండడం కోసం ఇవాళ పొదుపు చేయమని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇది నిజం, ఎందుకంటే ఇవాళ మీరు పొదుపు చేసే మొత్తం ఎంతో పెద్దదిగా మారి మీకు రేపు చేతికి అంది వస్తుంది. అద్భుతమైన రాబడులను చిన్న మొత్తాల పొదుపు కూడా అందించగలదు.
 
ప్రతీ రోజు పొదుపు మొత్తం ఏటా రాబడి శాతం కాల వ్యవధి చేతికి అందే మొత్తం
రూ. 30 10% 25 ఏళ్లు రూ. 11,84,590
రూ. 30 12% 25 ఏళ్లు రూ. 16,35,207
రూ. 30 15% 25 ఏళ్లు రూ. 26,79,596
 
(ఇక్కడ చూపిన అంకెలు సోదాహరణంగా మాత్రమే ఇవ్వబడినవి, వాస్తవ విలువలు కాంపౌండింగ్ ప్రకారం మారవచ్చు)
పెట్టుబడిపై ఎక్కువ వడ్డీ లేదా రాబడి అందుకోవాలనే లక్ష్యం ఏ ఇన్వెస్టర్‌కి అయినా సహజం. అయితే, రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి పెట్టుబడులను ఎంచుకోవాలి.
 
2. రాబడి శాతం
ఒక్కో రకమైన పెట్టుబడి ఒక్కో రేటు చొప్పున రాబడి అందిస్తుంది. యంగ్ఏజ్‌లో రిస్క్ సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టే.. వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభించాలని నిపుణులు చెబుతారు. వయసు మీద పడుతున్న కొద్దీ డెట్ ఫండ్స్ వైపు మారుతుండడం ఉత్తమం. పెట్టుబడులకు ప్రాథమిక అవకాశాలు అయిన ఈక్విటీలు, డెట్ ఫండ్స్, బంగారాలలో పెట్టుబడి చేస్తే, ఏదో ఒక విభాగం అండర్‌పెర్ఫామ్ చేసినా మీ ఆస్తికి రక్షణ ఉంటుంది.
 
3. కాంపౌండింగ్ శక్తిని తెలుసుకోవడం
పెట్టుబడులు చేయడంలో వయసు, ఆర్థిక బాధ్యత కీలక పాత్ర పోషిస్తాయి. బాధ్యతలు తక్కువగా ఉండే చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభించడం ఎంతో సమంజసం. ఈక్విటీలలో చిన్న వయసులోనే పెట్టుబడులు చేయడంతో దీర్ఘకాలంలో కాంపౌండింగ్ శక్తి ప్రతిఫలాన్ని అందుకునే అవకాశం ఉంటుంది.
 
ఉదాహరణకు.. రూ. 10000లను 10 శాతం వడ్డీ చొప్పున పెట్టుబడి పెడితే ఏడాదికి రూ. 11,000 అవుతుంది. మీకు లభించిన వడ్డీని కూడా కలిపి తిరిగి పెట్టుబడి చేసినట్లు అయితే, రెండో ఏడాది చివరకు రూ. 12,100 అవుతుంది. ఇలా దశాబ్దం గడిచేసరికి 10 శాతం రాబడి చొప్పున రూ. 25,937 అవుతుంది.
 
ఏడాది ప్రారంభ విలువ రాబడి శాతం గడించిన వడ్డీ మొత్తం విలువ
1 10,000 10% 1,000 11,000
2 11,000 10% 1,100 12,100
3 12,100 10% 1,210 13,310
4 13,310 10% 1,331 14,641
5 14,641 10% 1,464 16,105
6 16,105 10% 1,610 17,715
7 17,715 10% 1,771 19,487
8 19,487 10% 1,948 21,435
9 21,435 10% 2,143 23,579
10 23,579 10% 2,357 25,937
 
కోటీశ్వరుడు కావాలని కలలు కనడంలో తప్పేమీ లేదు. పైన చెప్పిన మూడింటిని మనసులో ఉంచుకుంటే.. ఈ లక్ష్యాన్ని తేలికగానే అందుకోవచ్చు. దీర్ఘకాలంలో అండర్‌పెర్ఫామెన్స్ ఎక్కడైనా కనిపించచ్చు. కానీ ఏ ఇతర విభాగాలతో పోల్చినా ఈక్విటీలు మాత్రం భారీ స్థాయిలో రాబడులను అందించాయి.
 
గత 20 ఏళ్లలో సెన్సెక్స్ టోటల్ రెవెన్యూ ఇండెక్స్ 12.77 శాతం సీఏజీఆర్‌తో రాబడులు అందించగా.. ప్రపంచ జీఆర్ఐ కేవలం 9.52 శాతం మాత్రమే.
 
గత పదేళ్ల కాలాన్ని తీసుకుంటే, సెన్సెక్స్ 9.87శాతం సీఏజీఆర్.. క్రిసిల్ కాంపోజిట్ బాండ్ ఫండ్ ఇండెక్స్ 7.96 శాతం రాబడులను ఇవ్వగా.. బంగారం 12.03 శాతం రిటర్న్‌లు ఇవ్వడం విశేషం.
 
గత ఐదేళ్ల వ్యవధిని మాత్రమే పరిగణిస్తే, సహజంగా ఇంత స్వల్ప కాలానికి మార్కెట్‌లో రిటర్న్‌లు రావని అనుకుంటాం. కానీ సెన్సెక్స్ టీఆర్ఐ ఈ కాలంలో 11.83 శాతం రాబడులు అందించగా.. బంగారం 1.12 శాతం ‌సీఏజీఆర్‌ను మాత్రమే అందించగలిగింది.
 
ఇదే సమయంలో క్రిసిల్ కాంపోజిట్ బాండ్ ఫండ్ ఇండెక్స్ 9.24 శాతం రిటర్న్‌లు ఇవ్వగలిగింది. ఆరు నెలలకు, ఏడాదికి మార్కెట్లలో రిటర్నులను లెక్కించలేం. కానీ సుదీర్ఘ కాలానికి పరిగణిస్తే మాత్రం మార్కెట్లో పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయని చరిత్ర చెబుతోంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com