డిగ్రీ పూర్తి చేసిన వారికి ‘డైటీషియన్లు’గా అవకాశాలు

- January 21, 2019 , by Maagulf
డిగ్రీ పూర్తి చేసిన వారికి ‘డైటీషియన్లు’గా అవకాశాలు

టెక్నాలజీతో పాటు మనిషి జీవన శైలి కూడా మారిపోతోంది. స్లిమ్‌గా ఉండాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. పని ఒత్తిడిని తట్టుకుంటూ పైకెదగడానికి తెలివిగా వ్యూహాలు రచించాలి.. మరి వీటన్నింటినీ సమన్వయం చేసుకోవాలంటే సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి.

 
శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటివి సమపాళ్లలో అందాలి. ఏదో ఒకటి తినేసి బాడీ పెరిగిందని ఆహారం మానేయడం సరికాదు. వయసుతో పని లేకుండా వస్తున్న బీపీ, షుగర్, ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందుగానే డైటీషియన్లను సంప్రదించడం మంచిది.

ఇందుకోసం హాస్పిటల్స్‌లో డైటీషియన్లు ఉంటున్నారు. వారు చెప్పినట్లుగా పాటిస్తే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. పదిమందికీ ఉపయోగపడొచ్చు. ప్రస్తుత రోజుల్లో డైటీషియన్లకు మంచి డిమాండ్ ఉంటోంది. మరి ఈ కోర్సు చేయాలంటే అందుకు కావలసిన అర్హతలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
డైటీషియన్లు చేసే పని..
డాక్టర్‌లానే డైటీషియన్‌ది కూడా గౌరవప్రదమైన వృత్తి. వ్యక్తుల ఆరోగ్య వివరాలను పూర్తిగా తెలుసుకుని డైట్ చార్ట్ ఇస్తారు. 
చదవాల్సిన కోర్సులు
ఇందుకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీతో పాటు మాస్టర్ డిగ్రీ కోర్సు, డిప్లొమా కోర్సులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని..
బీఎస్సీ/ బీఏ న్యూట్రిషియన్ (ఇది మూడేళ్ల కోర్సు)
అర్హత: ఇంటర్ బైపీసీ గ్రూప్‌తో ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. 
కోర్సులో చెప్పే అంశాలు: హ్యూమన్ సైకాలజీ, బేసిక్స్ ఆఫ్ న్యూట్రీసియన్, ఫుడ్ బయో టెక్నాలజీ మొదలైన అంశాలు బోధిస్తారు. కోర్సు చివరలో డైట్ చార్ట్స్ తయారు చేయడం, బరువు తగ్గడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇస్తారు. 
బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ
ఇది కూడా మూటు సంవత్సరాల కోర్సు. దీనికి అర్హత ఇంటర్. ఇందులో బేసిక్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఫుడ్ సైన్స్, న్యూట్రిషియన్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రిపరేషన్ మొదలైన అంశాలు ఉంటాయి. 
పీజీ డిప్లొమా కోర్సులను బ్యాచిలర్ డిగ్రీ పూర్తయిన వారు చేయొచ్చు. ఫుడ్ అండ్ న్యూట్రిషియన్‌కు సంబంధించిన వివిధ స్పెషలైజేషన్లతో పీజీ డిప్లొమా కోర్సులు చేయవచ్చు కోర్సులో భాగంగా ఏదైనా హెల్త్ కేర్ సెంటర్‌లో తప్పనిసరిగా ఏడు లేదా ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 
విద్యా సంస్థలు
దేశంలోని పలు విద్యా సంస్థలు డైటీషియన్‌ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవి..
యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ – ఢిల్లీ
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ – హైదరాబాద్
పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ- లూథియానా
యూనివర్సిటీ ఆఫ్ పూణె- పూణె
యూనిర్సిటీ ఆఫ్ అలహాబాద్ – అలహాబాద్
జాదవ్ పూర్ యూనివర్సిటీ- కోల్‌కతా
యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్- చెన్నై
యూనివర్సిటీ ఆఫ్ ముంబై- ముంబై
అవకాశాలు
మనదేశంలో గత కొంతకాలంగా డైటీషియన్లకు డిమాండ్ పెరుగుతున్నది. వారికి కార్పొరేట్ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, నర్సింగ్ హోమ్‌లు, ప్రభుత్వ ఆరోగ్య శాఖ, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు, హెల్త్ క్లబ్‌లు, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లు, ఆహార సంబంధిత పరిశ్రమలు, రీసెర్చ్ ల్యాబ్‌లు, వివిధ ఎంఎన్సీ కంపెనీలు మొదలైన వాటిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 
వేతనాలు:
అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు, మాస్టర్ డిగ్రీ చేసిన వారికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ప్రారంభ వేతనం వస్తుంది. ఆ తరువాత అనుభవం ఆధారంగా వేతనం రెట్టింపు అవుతుంది. 
ముందుగా ఇండియన్ డైటిక్ అసోసియేషన్ (ఐడీఏ)లో పేరు నమోదు చేసుకోవాలి. ఆ తరువాత ఐడీఏ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే రిజిస్టర్డ్ డైటీషియన్‌గా గుర్తింపు లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com