ఆధార్‌ కార్డుకు మరో ప్రయోజనం

- January 21, 2019 , by Maagulf
ఆధార్‌ కార్డుకు మరో ప్రయోజనం

ఢిల్లీ: ఆధార్‌ కార్డుకు మరో ప్రయోజనం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్ల వయస్సు లోపు, 65 ఏళ్ల పైబడ్డ భారతీయులు నేపాల్‌, భూటాన్‌ దేశాలకు వెళ్లాలనుకుంటే ఇవి గుర్తింపు కార్డుల మాదిరిగా ఉపయోగపడతాయి. మిగిలిన వయసుల వారు వాటిని గుర్తింపు పత్రాలుగా ఉపయోగించడానికి వీల్లేదు. ఈ రెండు పొరుగు దేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవసరం లేదు. పాసుపోర్టు, ఓటరు కార్డు/పాన్‌కార్డులాంటి ఫొటో గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. తాజాగా ఈ జాబితాలో ఆధార్‌ కార్డు చేరింది. 15 ఏళ్ల వయస్సు లోపు, 65 ఏళ్ల పైబడ్డ భారతీయులు ఆధార్‌ను గుర్తింపు పత్రంగా చూపించొచ్చు. భారత పౌరులకు కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయం ఇచ్చే రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం ఆధారంగా ఇకపై రెండు దేశాల మధ్య ప్రయాణించడానికి వీల్లేదు. అయితే నేపాల్‌లోని భారతీయులు అత్యవసరంగా భారత్‌ రావాల్సిన సమయంలో రాయబార కార్యాలయం ఇచ్చే అత్యవసర ధ్రువపత్రం, గుర్తింపు ధ్రువపత్రం ఆధారంగా ఒకవైపు ప్రయాణం చేయవచ్చు. భారత్‌, నేపాల్‌ మధ్య ప్రయాణించాలనుకునే రెండు దేశాల్లోని 15-18 ఏళ్లలోపు విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇచ్చే ధ్రువపత్రం సరిపోతుంది. కుటుంబం అంతా కలిసి వెళ్తున్నప్పుడు అందరికీ కాకుండా ఒక్కరికి పాస్‌పోర్టు, ఫొటో గుర్తింపు కార్డు ఉన్నా చాలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com