సింగపూర్ లో ఘనంగా సంక్రాంతి సందడి

- January 28, 2019 , by Maagulf
సింగపూర్ లో ఘనంగా  సంక్రాంతి సందడి

సింగపూర్:సింగపూర్ తెలుగు సమాజం వారు అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది జనవరి 26 న (శనివారం) స్థానిక గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్ నందు అంగరంగ వైభవం గా జరిగింది.

 

మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ద్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా పండుగ వాతావరణం లో నిర్వహించారు. బొంగరాలు, గోళీలు, గాలిపటాలు, రంగవల్లుల పోటీలు , మగువలకు-బాలబాలికలకు-దంపతులకు వివిధ సాంప్రదాయ ప్రాచీన క్రీడలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన బహుమతుల తో పాటు ప్రశంసాపత్రాలను అందించారు. హరిదాసు, సోది మరియు పిట్టలదొర ప్రత్యేక ఆకర్షణ గా నిలిచి తెలుగు వారందరినీ అలరించారు.

తదుపరి ప్రారంభమైన సాంసృతిక కార్యక్రమాలలో సమకాలిన పరిస్ధితులపై ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం యడవల్లి శ్రీదేవి బుర్రకదా బృందం  వారిచే బుర్రకథా కాలక్షేపం అత్యంత ఆదరణ పొందింది. భరతనాట్య ప్రదర్శనలు, గోదారోళ్ళమండి ఏకపాత్రాభినయం, చిన్నారులచే సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన మరియు సింగపూర్ తెలుగు వారిచే ఎన్నో మరెన్నో పాట-నాటిక-నృత్య ప్రదర్శనలు మొదలగు సాంసృతిక కార్యక్రమాలు ఇక్కడి తెలుగు వారిని అలరించి రంజింప చేసాయి. తెలుగు బుట్టబొమ్మలకొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.


ఈ సంబరాలలో సింగపూర్ కాలమానం లో గుణించిన సింగపూర్ తెలుగు 2019 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. సింగపూర్ లో మొట్ట మొదటి సారిగా మన రేడియో వారి భాగస్వామ్యం తో తెలుగు వారికి ప్రత్యేకంగా STS మన రేడియో ని ప్రారంభించారు.


అచ్ఛమైన సంక్రాంతి తెలుగు పిండివంటలు, వంటకాలతో కూడిన తెలుగు భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకొంది. మన భాష, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కేవలం భాషణలకే పరిమితం కాకుండా, ఆచరణ లో చూపించాలని అధ్యక్షులు కోటిరెడ్డి గారు కోరారు. కార్యక్రమ నిర్వాహకులు నాగేష్ టేకూరి మాట్లాడుతూ ఇటీవల భోగి పండుగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేసి మన భోగిపళ్ళ సంప్రదాయాన్ని ప్రోత్సహించామని తెలిపారు. ఆహ్లాదభరితంగా జరిగిన ఈకార్యక్రమంలో పాల్గొన్న  వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు , కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com