కామెడీ కింగ్ ‘బ్రహ్మానందం’ బర్త్‌డే స్పెషల్

- February 01, 2019 , by Maagulf
కామెడీ కింగ్ ‘బ్రహ్మానందం’ బర్త్‌డే స్పెషల్

దేవుడు మనిషితో పాటు ఇతర జీవులను సృష్టించిన తర్వాత ఏదో లోపం కనిపించిందట. అందరూ సమానంగా ఉంటే ఏం బావుంటుంది అనుకుని.. మనిషికి మాత్రమే నవ్వు అనే ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఆ వరాన్ని పొందిన మనిషి దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటాడో లేదో అని మళ్లీ డౌట్ తో ఒక ఆనందాన్ని సృష్టించాడట. ఆ ఆనందం హాస్యబ్రహ్మను చేరి బ్రహ్మానందమై వెండితెరపై విరబూసి దేవుడిచ్చిన నవ్వు అనే వరాన్ని జనాలంతా సక్రమంగా ఉపయోగించుకునేలా చేస్తున్నాడు.. మరి అలాంటి ఆనందాన్ని దశాబ్ధాలుగా మనకందిస్తోన్న బ్రహ్మానందం బర్త్ డేని తలచుకోకపోతే ఎలా.. ఇవాళ ఈ నవ్వుల ఱేడు పుట్టిన రోజు.

 
నవ్వించడానికి చాలామంది ఉన్నారు. అందరిదీ తలో స్టైల్.. ఒకరు మాటలతో,మరొకరు ఎక్స్ ప్రెషన్స్ తో, మరొకరు మరోలా.. కానీ ఈ అన్నిటినీ కలిపి నవ్వించడం బ్రహ్మానందం స్టైల్. అందుకే ఇన్నేళ్లైనా అతని ఎక్స్ ప్రెషన్స్ కు ఎక్స్ పైరీ డేట్ రాలేదు. అతని డైలాగ్స్ పై మొనాటనీ రాలేదు. వైవిధ్యమైన అభినయంతో లక్షలాది నవ్వుల టానిక్కులను ప్రేక్షకులకు పంచుతూ వారి ఆయుష్సును పెంచుతోన్న కామెడీక్లినిక్ బ్రహ్మానందం.


అసలు నవ్వించడం అంటే నవ్వినంత ఈజీ కాదు.. కానీ నవ్వించడమనే యోగాన్ని జన్మతః పొందిన వరప్రసాదం బ్రహ్మానందం. శవాల మీద పైసలేరుకునే వెధవా.. పోతావ్ రా నాశనమైపోతావ్ రొరేయ్ అంటూ అరగుండుగా మొదలైన ఆ నవ్వుల పరంపర నేటికీ అలాగే కొనసాగుతోంది. అందుకే ఓ దశలో బ్రహ్మానందం లేని తెలుగు సినిమానా.. అని ఆశ్చర్యపోయిన ప్రేక్షకులున్న సందర్భాలూ ఉన్నాయి.

బ్రహ్మానందం అంటే కామెడీ సైరన్.. బ్రహ్మానందం ఉంటే సినిమా ఫుల్ రన్. నాటి రేలంగోడిని స్ఫూర్తిగా తీసుకుని వచ్చినా.. ఆయన్ని సైతం మించిపోయాడేమో అనేంతగా నవ్వులు పంచాడు. అసలు కమెడియన్ గా నటించక్కర్లేదు.. జస్ట్ కనిపించినా చాలు.. కళ్ల వెంట నీళ్లొచ్చేలా నవ్వుకున్న సినిమాలున్నాయి. నిశ్శబ్ధంగా ఉన్నా.. వాగుడుకాయలా ఉన్నా.. బ్రహ్మానందం ఫేస్ కు ఉన్న ఫేస్ వాల్యూ అది..

చాలామంది కమెడియన్స్ .. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగానూ మారారు. కానీ ఒకవేళ అలా మారతానన్నా వీలు లేని కమెడియన్ ఒక్క బ్రహ్మానందమే. మనోడు వీరావేశంలో వీరో అయినా.. తీరా ఆ సినిమా పోయాకే తత్వం బోధపడింది. అందుకే తను వచ్చిన పనికే పూర్తిగా అంకితమైపోయాడు. ఎగస్ట్రా వేషాలేయకుండా… బ్రహ్మకిచ్చిన మాట ప్రకారం ప్రేక్షకులకు బ్రహ్మానందం పంచడమే తనకూ బ్రహ్మానందంగా ఫీలై మళ్లీ వీరో గట్రా వేషాలేయలేదు. వేసినా మనం ఊరుకున్నామా..


హాస్య బ్రహ్మడి ప్రధాన అస్త్రమై ఆయన అన్ని సినిమాల్లో ఎన్ని నవ్వులు పంచాడనీ.. మహాప్రభో.. ఈయన పంచే నవ్వులు తట్టుకోలేక మా పొట్ట చెక్కలైపోతున్నాయని ఆ హాస్య బ్రహ్మడికి ప్రేక్షకులు ఎన్ని ఫిర్యాదులు చేశారనీ.. అయినా వింటేనా.. వినలేదు. బ్రహ్మానందాన్ని ఓ నవ్వుల అక్షయ పాత్రగా చేసి, ప్రతి సినిమాకూ సరికొత్త పాత్రతో ప్రేక్షకులకు వండి వడ్డించారు.

బ్రహ్మానందం చేసే కామెడీకి నవ్వాపుకోలేక చాలాసార్లు ప్రేక్షకులు.. ఈడెంకమ్మా సంపేత్తన్నాడురా అనుకున్నారు. అయినా ఆపుతాడా.. అదే పనిగా కితకితలు పెడుతూనే ఉన్నాడు. ఆ కితకితలకు అలవాటుపడ్డారేమో బ్రహ్మానందం ఇతర పాత్రలు వేయొద్దని చాలా గాఠ్టిగా ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అయినా వారి మాట కాదన్నాడోసారి నేనూ వీరో అవుతానని పట్టుబట్టాడు. మరి ఆయన వీరో అయితే మనల్ని అంతలా నవ్వించేది ఎవురంటా అందుకే, బాబాయ్.. ఇలా చేస్తే ఇక నీ నవ్వుల హోటల్ కు మేం రాం అన్నారు ఆడియన్స్. మేటర్ అర్థమైంది… మళ్లీ రూట్ లోకి వచ్చాడు. మరి.. ఆడియన్స్ అంటే జఫ్ఫాగాళ్లు కాదు కదా..

అసలెవరు ఊహించారు మనకు రేలంగి, రాజబాబు వంటి కమెడియన్స్ సరసన నిలిచే కమెడియన్ వస్తాడని.. వచ్చాడు సరే.. తిన్నగా ఉండొద్దూ.. ఏకంగా వారిని సైతం మరిపించేంతటి నవ్వులు పంచుతున్నాడు.అప్పుడు జంధ్యాల తర్వాత కృష్ణారెడ్డి, ఇవివి సత్యన్నారాయణ… ఇంక వీళ్లూరుకున్నారా.. బ్రహ్మీలో వేళ్లూనుకుపోయి ఉన్న హావభావాలన్నీ బయటకు తీసి మరీ ఆడియన్స్ ను కుర్చీలో కూర్చోకుండా చేసేశారు. వాళ్లూ.. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నంతగా హాయిగా నవ్వింపచేశారు..

అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ని ఆపలేకపోవచ్చు.. కానీ బ్రహ్మీని అడ్డు పెట్టుకుని సినిమాలు నిలుపుకోవచ్చు. హీరోతో పనిలేకుండానే ఇరగదీసేయొచ్చు. కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్రరావైనా.. కామెడీ డైరెక్టర్ ఇవివి అయినా.. ఎవరైనా సరే బ్రహ్మానందాన్ని నమ్ముకుని, సరైన పాత్ర రాసుకుంటే చాలు.. హీరోలతో పనిలేకుండానే సక్సెస్ అయిపోతారంతే.

సినిమాకు వెళుతున్నావా.. అవును. ఏ సినిమా.. ఫలానా సినిమా… అవునా అందులో బ్రహ్మానందం ఉన్నాడా.. ఇది వరస. హీరో, హీరోయిన్ల కంటే ముందు బ్రహ్మీ ఉన్నాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని మరీ సినిమాకు వెళ్లిన ప్రేక్షకులున్నారు. అంటే ఆయన ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ తెగ నవ్విస్తోన్న టైమ్ లోనే కమెడియన్ గా బ్రహ్మానందం ఆ స్థాయికి చేరుకోవడం తెలుగువారు చేసుకున్న అదృష్టం.


మెగా స్టార్ నుంచి సడెన్ స్టార్ వరకూ బ్రహ్మానందం కాంబినేషన్ వర్కవుట్ కాని సినిమాల్లేవ్. బ్రహ్మానందం వచ్చిన టైమ్ నుంచి వెండితెరకు ఎంతమంది కమెడియన్స్ వచ్చారో లెక్కలేదు. వారిలో వేళ్లపై లెక్కపెట్టేంత వరకూ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు ఆడియన్స్. కానీ ఎన్నివేళ్లున్నా బొటనవేలు లేకపోతే వేస్ట్ అన్నట్టు తెలుగు సినిమా కామెడీకి బొటనవేలయ్యాడు బ్రహ్మీ.

అయితే కొత్త కమెడియన్స్, దర్శకులు వస్తున్నారు. ఇంక బ్రహ్మానందం పనైపోయినట్టే.. అనుకున్న రోజులు చాలానే ఉన్నాయి. అలా అనుకున్న ప్రతి సారీ అతను దేనికైనా రెడీ అంటూ కొత్త కమెడియన్స్ అందరినీ ఢీ కొట్టాడు. ఆ దెబ్బకు అలా అన్నవాళ్లే కాదు, వారి మాటలు నిజమని సంబరపడ్డ వాళ్లూ సైలెంట్ అయిపోయారు. అంతే కాదు, ఏజ్ బార్ అయిన బ్రహ్మీ కొత్త దర్శకులకు బ్రహ్మాస్త్రం అయ్యాడు.

బ్రహ్మ ఆశిస్సులతో వచ్చినవాడు కదా.. అందుకే బ్రహ్మీ ఏ టర్న్ తీసుకున్నా రిటర్న్ అనేది లేకుండా పోయింది. చెంపదెబ్బలు తిన్నా, కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆఖరుకి హీరోల చేతిలో చావు దెబ్బలు తిన్నా.. ప్రేక్షకులకు నవ్వాపుకోవడం సాధ్యం కాలేదు. ఓ కమెడియన్ ఇన్నేళ్లుగా రాణిస్తున్నాడంటే కారణం .. అతను దర్శకుల చేతిలో బొమ్మై పోవడం. వాళ్లు ఎలా మలిస్తే అలా నవ్వించడం.

తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేశాడనీ గిన్నిస్ బుక్ లో ఎక్కించారు. లక్షలాది నవ్వులు పంచి ప్రజలకు డాక్టర్ ఫీజ్ తగ్గించాడని డాక్టరేట్ ఇచ్చారు. తెలుగు సినిమా సరస్సులో పద్మమై వికసించాడనీ పద్మశ్రీ ఇచ్చారు. కానీ, బ్రహ్మానందం తర్వాత మళ్లీ బ్రహ్మానందాన్ని ఇవ్వడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మానందాన్ని మళ్లీ సృష్టించాలంటే ఆ బ్రహ్మకూ సాధ్యం కాదు కాబట్టి. వెయ్యి సినిమాల్లో ఇన్నేసి నవ్వుల్ని పంచే యోగాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం జన్మ నిజంగా ధన్యం.


ఓ కొత్త హీరోకు హిట్ కావాలంటే బ్రహ్మానందం కావాలి. వరుస ఫ్లాపులతో ఉన్న హీరో మళ్లీ ఫామ్ లోకి రావాలంటే బ్రహ్మానందం ఉండాలి. రచయితల క్రియేటివిటీని, దర్శకుల వర్కింగ్ స్టైల్ కు అనుగుణంగా వెండితెరపై నవ్వులు విరబూయించాలంటే బ్రహ్మానందమే రావాలి. అందుకే బ్రహ్మీ పని ఐపోయిందన్నమాట బలంగా వినిపించిన తర్వాత కూడా దశాబ్ధం పాటు వెండితెరను ఏలాడీ ఖాన్ దాదా…

బ్రహ్మానందంకు కోపం ఎక్కువ. కొత్త దర్శకులను లెక్కచేయడు, కో ఆర్టిస్టులను రెస్పెక్ట్ చేయడు.. నిర్మాతను ఇబ్బంది పెడతాడు.. కాల్షీట్ టైమింగ్స్ లో ఉండడు.. ఇవీ ఈ మధ్య బ్రహ్మీ గురించి తరచుగా వినిపిస్తోన్న మాటలు. ఈ మాటలు కోటలు దాటి.. ఇప్పుడు మళ్లీ బ్రహ్మానందం పని ఐపోయింది.. ఇక కొత్త కమెడియన్స్ దే హవా.. అనే మాటలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి మాటలు.. మూడు దశాబ్ధాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.. ఏనాడూ బ్రహ్మీ నిరుత్సాహపడలేదు. ఎందుకంటే ముందే అతను లెక్చరర్. తను చెప్పే పాఠం ప్రతి ఒక్కరికీ అర్థం కావాలనేం లేదుగా.. అంతిమంగా ఆ లెక్చరర్ ప్రతిభను తెలిపేది రిజల్ట్స్.. ఆ రిజల్ట్ గురించి ముందే తెలుసు కాబట్టే బ్రహ్మీ సైలెంట్ గా పని చేసుకుంటాడు.

ఈ మధ్య కాలంలో ఓ సంచలన వార్త వచ్చింది. బ్రహ్మానందం ఆరోగ్యం పాడైందని. నిజమే.. ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఇప్పుడు మళ్లీ మునుపటి ఉత్సాహంతోనే ఉన్నారు. పూర్తిగా కోలుకుని మరోసారి మనల్ని నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా కోట్లాది నవ్వులు పంచి ఎందరికో ఎంతో ఆరోగ్యాన్ని అందించిన బ్రహ్మానందం సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షులతో ఆ నవ్వులను కొనసాగించాలని కోరుకుంటూ ఈ హాస్య శిఖరానికి మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com