తెలంగాణ కేబినెట్ : మంత్రి పదవులు వీరికే!

- February 03, 2019 , by Maagulf
తెలంగాణ కేబినెట్ : మంత్రి పదవులు వీరికే!

తెలంగాణ:డిసెంబ‌ర్ 13న సీఎం కేసిఆర్ తో పాటు మ‌హ్మూద్ అలీ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పీడ దినాలుండ‌టంతో సంక్రాంతి త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ కేసిఆర్ ప్రతిష్టాత్మక యాగం చేయ‌డంతో మ‌రింత ఆల‌స్యమైంది. ఇక ఎల్లుండు నుంచి మాఘ‌మాసం మొద‌లు కావ‌డంతో కేసీఆర్ మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌కు సిద్దమైన‌ట్టు తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీలోపు కీల‌క‌మైన శాఖ‌ల‌కు మంత్రి ప‌ద‌వుల ఖాయమ‌ని తెలుస్తోంది. ఈనెల 7న లేదా 8వ తేదీన మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఉంటుంద‌ని టిఆర్‌ఎస్‌లో జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఈ నెల 18 కేంద్ర ఆర్థిక సంఘం బృందం హైద‌రాబాద్ పర్యట‌న‌, ఫిబ్రవ‌రి చివ‌రి వారంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స‌మావేశాలు జ‌రుగ‌నుండ‌టంతో ఈ సారి మంత్రి వ‌ర్గ విస్తర‌ణ ఖాయమని గులాబి శ్రేణులు భావిస్తున్నారు..

 
ఇక మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌ర‌గ‌డం ఖాయ‌మని ప్రచారం జ‌రుగుతుండ‌టంతో ఆశావాహుల్లో ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఇప్పుడే పూర్తి స్థాయి మంత్రి వ‌ర్గం కొలువు తీర‌ద‌ని .. 10మందికి మాత్రమే మంత్రి వ‌ర్గంలో చోటు ఉంటుంద‌ని సమాచారం. దీంతో ఇప్పుడే ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నారు ఆశావాహులు. పాత మంత్రుల్లో కేటిఆర్, హ‌రీష్ రావ్ ల‌తో పాటు మ‌రో ముగ్గురు మాజీ మంత్రుల‌కు చోటు ద‌క్కనున్నట్టు స‌మాచారం. ఇక కొత్త వారిలో వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, కొప్పుల ఈశ్వర్ ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అధికారికంగా ప్రక‌టించ‌క పోయినా .. కొంత మంది ఎమ్మెల్యేల‌కు కేసిఆర్ ఫోన్ చేసి భరోసా ఇచ్చినట్లు టిఆర్‌ఎస్‌ శ్రేణులు పేర్కొంటున్నారు.

అయితే మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేందుకు మాజీలు వ‌ర్సెస్ కొత్త వాళ్ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. మాజీ మంత్రులు ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి, క‌డియం శ్రీ‌హ‌రి, జోగు రామ‌న్న, ప‌ద్మారావు, జ‌గ్దీశ్వర్ రెడ్డిల‌కు కొత్త కేబినెట్ లో బెర్త్ డౌటే అంటున్నాయి టిఆర్‌ఎస్‌ వ‌ర్గాలు. ఇప్పటికే గ‌త కేబినెట్‌లో ప‌ని చేసిన నాయిని న‌ర్సింహా రెడ్డిని పార్టీకే ప‌రిమితం చేసిన‌ట్టు తెలుస్తోంది.. పాత మంత్రుల్లో న‌లుగురు ఓడి పోవ‌డంతో ఇక కొత్తవారికి ఎక్కువ‌గా అవ‌కాశాలు ద‌క్కనున్నాయి. వీరికి తోడు ఎమ్మెల్సీలు కూడా మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నాలు చేశారు. ఇప్పటికే కేసిఆర్ ,కేటిఆర్‌ల‌ను క‌లిసి త‌మ‌కు మంత్రి వ‌ద‌వులు ఇవ్వాల‌ని ప‌లువురు ఎమ్మెల్సీలు కోర‌డంతో పాత మంత్రుల‌కు ఎంత మందికి మ‌ళ్లీ అమాత్య యోగం ఉంటుంద‌నేది తేలాల్సి ఉంది.

పూర్తి స్థాయిలో మంత్రి వ‌ర్గ విస్తర‌ణ జ‌ర‌గాలంటే లోక్‌స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కూ ఆగాల్సిందే అంటున్నారు గులాబీ నేత‌లు. అందుకే ఇప్పుడే కేబినెట్ చోటు ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తున్నారు ఆశావాహులు. క‌నీసం మంత్రి ప‌ద‌వి కాక‌పోయినా చీఫ్ విప్ , విప్ ప‌ద‌వులు కానీ , లేదంటే పార్లమెంట‌రీ కార్యద‌ర్శుల పోస్టులైనా ద‌క్కితే చాలని ఆశ ప‌డుతున్నారు. మ‌రి కేసిఆర్ మ‌దిలో ఏముందో అర్థం కాక‌, విస్తర‌ణ తేదీలు ఎప్పుడు క‌న్ఫామ్ అవుతాయో తెలియక.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఆశావాహులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com