పుట్టినరోజు వేడుకలకు కేసీఆర్‌ దూరం

- February 17, 2019 , by Maagulf
పుట్టినరోజు వేడుకలకు కేసీఆర్‌ దూరం

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌ 65 వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే పుల్వామా దాడి ఘటనతో పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నారు కేసీఆర్‌. ఎలాంటి వేడుకలు జరపొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి రెండోసారి అధికారంలోకి వచ్చే వరకు.. ఆయన రాజకీయం జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఇపుడు తెలంగాణ మహోన్నత నాయకుడిగా కీర్తినందుకుంటున్నారు.

రాజకీయాలు వేరు..! ఉద్యమాలు వేరు..! ఈ రెండింటిని కలిపి ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదంటారు. కానీ రాజకీయ పార్టీ పెట్టి.. ఉద్యమం చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి.. తెలంగాణను సాధించడమే కాదు... పాలకుడిగానూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అందుకే ఉద్యమకారుడిగా గెలిచిన సీట్ల కంటే పాలకుడిగా ముందస్తు ఎన్నికలను స్వీప్‌ చేశారు. అందుకే కేసీఆర్‌ మహోన్నత నాయకుడిగా చెబుతోంది టీఆర్‌ఎస్‌.

తెలుగు రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిందీ లేదు.. అయితే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. అసెంబ్లీని రద్దు చేసి.. ఆర్నెళ్ల ముందే ఎన్నికలకు వెళ్లి... ఘన విజయం సాధించారు. అసెంబ్లీ రద్దు చేయడంలో... ఒకేసారి వందకు పైగా సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంలో.. ఆయన నిర్ణయాలెప్పుడూ.. షాకింగ్‌గానే ఉంటాయ్‌. ఆ నిర్ణయాలకు ఫలితాలు అంతే ఆశ్చర్యకరంగా కనిపిస్తాయ్‌. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న కేసీఆర్‌.. తెలంగాణ మొత్తం పర్యటించారు. ఎన్నికల్లో ఒక్కడై... పల్లెపల్లెకు తిరిగి... పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. ఒక్కో రోజు 6, 7 సభల్లో పాల్గొన్న రోజులు ఉన్నాయి. ఈ స్తాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం.. పార్టీ గెలుపు బాటలో నిలబెట్టడం కేసీఆర్‌కే చెల్లిందంటారు.

రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. అది ఎలాంటి స్పందనో... ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలతో తెలంగాణను సుభిక్షం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. అంతేకాదు.. ఇవాళ కేసీఆర్‌ ఆలోచించింది... రేపు దేశం ఆలోచిస్తుందని అంటున్నారు గులాబీ నేతలు. కేంద్రం సైతం తెలంగాణ పథకాలను ఫాలో అవుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలుపు బాట పట్టించింది. అయితే ఇపుడిదే పథకాన్ని కేంద్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో తీసుకొస్తుందంటున్నారు గులాబీ నేతలు. కేంద్రం మాత్రమే కాదని... ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్‌నే ఫాలో అవుతున్నాయని చెబుతున్నారు. రైతుబంధు లాంటి పథకాన్ని తీసుకురావడం కేసీఆర్‌కే సాధ్యమంటున్నారు. కేసీఆర్‌ పథకాలెన్నో జాతీయ స్తాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్లు టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నారు.

వనమే జనాలను రక్షిస్తుందని నమ్ముతారు సీఎం కేసీఆర్‌. అందుకే పచ్చదనం వృద్ధికి హరితహారం తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది కొన్ని కోట్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. పథకం ప్రవేశపెట్టడమే కాదు... హరితహారంలో పెట్టిన మొక్కలు ఎండిపోతే.. అధికారులపై చర్యలు సైతం తీసుకున్నారు. మొక్క ఎండిపోయిందని... సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వారించిన సంఘటనలు ఉన్నాయి. ఇక ఇపుడు అడవులను హరిస్తోన్న వీరప్పన్‌లపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. అడువుల నరికివేయడం.. వన్య మృగాలను చంపుతున్న వారికి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

లక్షల మంది జనం కేరింతలు కొట్టేలా మాట్లాడమే కాదు... జనాల్లోకి సూటిగా వెళ్లేలా సీఎం కేసీఆర్‌ ప్రసంగాలు ఉంటాయ్‌. అయితే నాయకుడిగా ప్రసంగాలు చేస్తున్నారు. అవసరమైన సమయంలో ఓ ఉపాధ్యాయుడిగా పాఠాలు చెబుతారు. ఇటీవల పంచాయితీ రిసోర్స్‌ పర్సన్‌లకు ప్రత్యేక శిక్షణ నిచ్చారు. గంటల సేపు నిలబడే... రిసోర్స్‌ పర్సన్‌కు పంచాయితీ నియమ, నిబంధనలపై అవగాహన కల్పించారు. అందుకే కేసీఆర్‌ మల్టీ టాలెంటెడ్‌గా చెబుతారు పార్టీ నేతలు.

ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ భిన్నంగా ఆలోచిస్తారు. నిజానికి నీటి పారుదల రంగంపై కేసీఆర్‌ మంచి పట్టు ఉంది. అంతేకాదు... తెలంగాణలోని ఏ ప్రాంతంలో ఏ చెరువు ఉంది..! ఏ రిజర్వాయర్‌ ఎక్కడ ఉంది అనే దానిపై ఆయనకు పక్కా అవగాహన ఉంది. అందుకే కాళేశ్వరం రీ డిజైన్‌ను ఆయనే అసెంబ్లీలో విపక్షాలకు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరుగులు పెడుతోంది. ఈ ఏడాది పూర్తి చేసుకునే దిశగా పనులు జరుగుతున్నాయ్‌. సంక్షేమ పథకాలు, పనులతో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఇపుడు దృష్టినంత రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలపై పెట్టారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం మమత, నవీన్‌ పట్నాయక్‌, అఖిలేష్‌ యాదవ్‌, కుమారస్వామి లాంటి నేతలను కలిశారు. ఇపుడు పార్లమెంట్‌ ఎన్నికల్లో స్వీప్‌ చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

కేసీఆర్‌ బర్త్‌డేను భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే పుల్వామా ఉగ్రవాదుల దాడితో తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు సీఎం. కార్యకర్తలు, పార్టీ నేతలు ఎవ్వరూ కూడా తన పుట్టిన రోజు వేడుకలు జరపొద్దని సూచించారు కేసీఆర్‌. అయితే ఫ్లెక్సీలు, పోస్టర్లు కాకుండా.. తన జన్మదిన వేడుకల కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. అవయవదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ నాయకుల్లో కేసీఆర్‌ది విభిన్న శైలి..! ఆయన నిర్ణయాలు... ఆలోచనలు, వాటిని అమలు చేసే తీరు.. ఎవరికి అంతు చిక్కవు..! మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ మహోన్నతుడిగా ఎదిగారు. ఉద్యమకారుడిగా.. నాయకుడిగా... పాలకుడిగా... ప్రజల మెప్పు పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com